
రియల్టర్ దారుణ హత్య
నెల్లూరు(క్రైమ్): వ్యాపార లావాదేవీల్లో నెలకొన్న విభేదాలో.. పాతకక్షలో.. కారణమో తెలియదు గానీ రియల్టర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన నెల్లూరు నగరంలోని వెంకటరెడ్డినగర్‌లో జరిగింది. ఘటనా స్థలంలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌లు పరిశీలించి ఆధారాలు సేకరించాయి. విభిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మంగళవారం వారు వివరాలు వెల్లడించారు. ఉదయగిరి మండలం సర్వరాబాదు గ్రామానికి చెందిన గొల్లపల్లి చిన్నయ్య అలియాస్ చిన్నా అలియాస్ ఇస్సాక్ (40), వేళాంగిణి దంపతులకు సాత్విక్, కార్తీక్, శాలిని అనే సంతానం ఉన్నారు. ప్రైవేట్ వెటర్నరీ అసిస్టెంట్‌తోపాటుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వ్యాపార లావాదేవీల విషయంలో అదే మండలానికి చెందిన కొందరితో చిన్నయ్యకు విభేదాలున్నాయి. హైకోర్టులో కేసుల విచారణ సాగుతోంది. అదే క్రమంలో ఫైనాన్స్ వ్యాపార విషయంలోనూ పలువురితో గొడవలున్నాయి.
నాలుగేళ్లుగా స్నేహతుడి ఇంట్లో..
చిన్నయ్యకు ఉదయగిరి మండలం వెంకటరావుపల్లికి చెందిన రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ ఎస్.ఓబుల్‌రాజు స్నేహితుడు. ఆయనకు నెల్లూరు నగరంలోని వెంకటరెడ్డినగర్ నాలుగో వీధిలో రెండు అంతస్తుల భవనం ఉంది. దీంతో చిన్నయ్య నాలుగేళ్లుగా ఆ ఇంట్లో రెండో అంతస్తులో ఉంటున్నాడు. మొదటి అంతస్తులో రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ కార్యాలయం ఏర్పాటు చేశాడు. స్నేహితుడితో కలిసి వ్యాపారం చేస్తున్నారు. ప్రతి శని, ఆదివారం ఉదయగిరిలోని గొల్లపాళెం వెళ్లి భార్య, పిల్లలతో గడిపి నెల్లూరుకు వచ్చేవాడు. రియల్ ఎస్టేట్ పనుల నిమిత్తం గత నెల 30వ తేదీ నుంచి చిన్నయ్య గొల్లపాళేనికి వెళ్లకుండా నెల్లూరులోనే ఉంటున్నాడు.
ఇంట్లోనే అతికిరాతకంగా..
చిన్నయ్య స్నేహితుడు ఎస్.వెంకటేశ్వర్లు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. వెంకటేశ్వర్లు సోమవారం చిన్నయ్య వద్దకు వచ్చాడు. ఇద్దరూ రాత్రి టిఫిన్ చేశారు. వెంకటేశ్వర్లు పడకగదిలో, చిన్నయ్య హాల్లోని సోఫాలో నిద్రపోయారు. మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో వెంకటేశ్వర్లు నిద్ర లేచి హాల్లోకి వచ్చిచూడగా ముఖంపై కత్తిపోట్లతో రక్తపు మడుగులో చిన్నయ్య మృతిచెంది ఉండటాన్ని గమనించి పరుగులు తీస్తూ కింద పోర్షన్‌లో ఉంటున్న వారి వద్దకు వెళ్లాడు. చిన్నయ్యను ఎవరో చంపేశారని భోరున విలపించాడు. వారు వేదాయపాళెం పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే వెంకటేశ్వర్లు బాధిత కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని ఫోన్ ద్వారా తెలియజేశాడు. నగర డీఎస్పీ పి.సింధుప్రియ, ఇన్‌స్పెక్టర్లు రోశయ్య, టీవీ సుబ్బారావులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. వెంకటేశ్వర్లుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం పరిశీలన
ఘటనా స్థలంలో క్లూస్ టీం వేలిముద్రలను సేకరించింది. డాగ్ స్క్వాడ్ ఘటన జరిగిన ప్రాంతం నుంచి గాంధీనగర్ వైపుగా కొద్దిదూరం వరకు వెళ్లి తిరిగి వచ్చింది. చిన్నయ్య తండ్రి చిన్నబాల ఓబయ్యతోపాటు కుటుంబసభ్యులు, బంధువులు నెల్లూరుకు చేరుకున్నారు. చిన్నయ్య మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడి సోదరుడు రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మృతుడికి సొంత గ్రామంలో పలువురితో భూమికి సంబంధించిన విభేదాలున్నాయి. ఓ స్థలానికి సంబంధించి ఇతని ఫిర్యాదు వల్ల కొందరికి జైలుశిక్ష సైతం పడినట్లు సమాచారం. వ్యాపార లావాదేవీల్లోనూ పలువురితో విభేదాలున్నట్లు తెలుస్తోంది. వివాహేతర సంబంధం ఏమైనా ఉందా? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు నెల్లూరు నగరంతోపాటు ఉదయగిరి మండలంలోనూ విచారిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆరోజు రాత్రి సుమారు 11.40 గంటల ప్రాంతలో కొందరు ఆ వీధిలో నుంచి గాంధీనగర్ వైపు పరుగులు తీస్తూ వెళ్లినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలంతో పాటు పరిసర ప్రాంతాల్లోనీ సీసీ టీవీ ఫుటేజ్‌లు, సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
● కాగా చిన్నయ్య తండ్రి చిన్నబాల ఓబయ్య మీడియాతో మాట్లాడుతూ భూ వివాదాల నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
ఉదయగిరిలో చర్చ
ఉదయగిరి: చిన్నయ్య దారుణ హత్యకు గురికావడం ఉదయగిరి పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. మృతుడు 2008లో పశుసంవర్థక శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి పశువైద్యశాలలో అటెండర్‌గా చేరాడు. అక్కడ నాలుగేళ్లపాటు పనిచేశాడు. ఈ క్రమంలో గ్రామస్తులతో కొన్ని విభేదాలు తలెత్తాయి. దీంతో సీతారామపురం మండలం బసినేనిపల్లి పశువైద్యశాలకు మార్పించుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడే అటెండర్‌గా ఉన్నాడు. ఉదయగిరి ఎస్సై ఇంద్రసేనారెడ్డి మృతుడి గ్రామానికి వెళ్లి విచారించారు. ఆరునెలల క్రితం సొంతూరు సర్వరాబాదు నుంచి ఉదయగిరి పట్టణంలో భార్య, బిడ్డలతో కాపురం పెట్టినట్లు చెబుతున్నారు.
నెల్లూరులో దారుణం
విభిన్న కోణాల్లో కేసు దర్యాప్తు

రియల్టర్ దారుణ హత్య

రియల్టర్ దారుణ హత్య

రియల్టర్ దారుణ హత్య