
కత్తిపోట్లకు గురైన మహిళ మృత్యువాత
● హత్య కేసుగా మార్పు
నెల్లూరు(క్రైమ్): కత్తిపోట్లకు గురైన మహిళను మెరుగైన వైద్యం నిమిత్తం చైన్నెకు తరలిస్తుండగా దారిలో మృతిచెందింది. పోలీసుల కథనం మేరకు.. బుజబుజనెల్లూరు చెన్నకేశవులనగర్‌కు చెందిన సయ్యద్ మాబునీ (33), గౌస్‌బాషా దంపతులకు ఇద్దరు పిల్లలు. అదే ప్రాంతానికి చెందిన బి.విజయ్ లారీ డ్రైవర్. అతను తరచూ మద్యం మత్తులో ఇష్టానుసారంగా ప్రవర్తించేవాడు. పలు కేసులున్నాయి. విజయ్ చేష్టలను పలుమార్లు మాబునీ అడ్డుకుని పద్ధతి మార్చుకోవాలని సూచించింది. అయినా మారలేదు. మూడు నెలల క్రితం విజయ్ తన కుటుంబంతో కలిసి ఇల్లు ఖాళీ చేసి పక్క వీధిలో చేరాడు. శనివారం సాయంత్రం మాబునీ పిల్లలు ఆడుకుంటూ ఈలలు వేస్తుండగా మద్యం మత్తులో ఉన్న విజయ్ వారిని తిట్టాడు. వారు భయపడి పరుగులు తీయగా వారిని వెంబడించి ఇంటి వద్దకెళ్లి గొడవ చేశాడు. దీంతో మాబునీ అతని ఇంటికెళ్లి నిలదీయగా కోపోద్రిక్తుడైన విజయ్ కత్తితో ఆమైపె దాడి చేశాడు. మూడుచోట్ల పొడవడంతో తీవ్రంగా గాయపడింది. ఆమెను కుటుంబ సభ్యులు చి కిత్స నిమిత్తం జీజీహెచ్‌లో చేర్పి ంచారు. మెరుగైన చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ఆస్పత్రికి, అక్కడి నుంచి మరో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆదివారం తెల్లవారుజామున చైన్నెకు తరలిస్తుండగా మాబునీ మృతిచెందింది. మృతురాలి సోదరుడు ఇమామ్‌బాషా వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ రోశయ్య హత్యాయత్నం కేసును హత్య కేసుగా మార్చి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.