
ఆస్ట్రేలియాతో రెండో టీ20లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. తిరువనంతపురం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేవలం 25 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 పరుగులు చేశాడు.
"అంతకుముందు జరిగిన తొలి టీ20లో కూడా జైశ్వాల్(21) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ నేపథ్యంలో యశస్వీ జైశ్వాల్‌పై అతడి చిన్ననాటి కోచ్ జ్వాలా సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ లాంటి దూకుడైన ఆటతీరును పోలి ఉన్నాడని జ్వాలా సింగ్ కొనియాడాడు.
వరల్డ్‌క్రికెట్‌లో సెహ్వాగ్ చాలా పెద్ద ఆటగాడు. సెహ్వాగ్ ఆడుతున్నప్పుడు పెద్దగా టీ20 క్రికెట్ లేదు. కానీ పదేళ్ల కిందటే టీ20 క్రికెట్ తరహా ఆటను సెహ్వాగ్ ఆడేవాడు. యశస్వి జైశ్వాల్ సెహ్వాగ్ అప్‌గ్రేడ్ వెర్షన్. సెహ్వాగ్ అన్ని రకాల షాట్‌లను తన కెరీర్‌లో ఆడాడు. ఇప్పుడు జైశ్వాల్ కూడా అదే టెక్నిక్‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు.
సెహ్వాగ్‌లానే ఫియర్ లేస్ క్రికెట్ ఆడుతున్నాడు. యశస్వీ మరో దిగ్గజ ఆటగాడు సౌరవ్ గంగూలీ బ్యాటింగ్ స్కిల్స్‌ను కలిగి ఉన్నాడు. అతడి స్క్వేర్ కట్ షాట్, ఆఫ్ సైడ్ గేమ్ చూస్తే సౌరవ్ గంగూలీ గుర్తొస్తున్నాడని" టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్వాలా సింగ్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs AUS: రింకూ సింగ్ అరుదైన రికార్డు.. యువరాజ్ సింగ్, హార్దిక్ సరసన