మిథాలీ రాజ్‌ను టార్గెట్‌ చేసి ఆ వ్యాఖ్యలు చేశాడా?

WV Raman Letter To Sourav Ganguly And Rahul Dravid Aimed At Mithali Raj - Sakshi

ఢిల్లీ: టీమిండియా ఉమెన్స్‌ క్రికెట్‌ మాజీ కోచ్‌ డబ్ల్యూవీ రామన్‌.. మహిళల జట్టులోనూ స్టార్‌ క్రికెటర్ల ఆధిపత్యం పెరిగిపోయిదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీసీసీఐ గత గురువారం రామన్‌ స్థానంలో రమేశ్‌ పొవార్‌ను ప్రధాన కోచ్‌గా ఎంపిక చేసిన క్రమంలో రామన్‌ తన గళం పెంచాడు. ఒకవైపు పొవార్‌కు ఆల్‌ ద బెస్ట్‌ చెబుతూనే, కొన్ని విమర్శలు చేశాడు.

మహిళల క్రికెట్‌లో స్టార్‌ కల్చర్‌ పెరిగిపోయిందంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్‌కి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. దీన్ని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు ధృవీకరించారు. కాగా, ఈ వ్యాఖ్యలు భారత మహిళా క్రికెట్‌ జట్టు సీనియర్‌ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ను టార్గెట్‌ చేసినట్లే కనబడుతోంది. ''ఉమెన్స్ టీమ్‌లో కొంత మంది క్రికెటర్ల ఆధిపత్యం పెరిగిపోయింది. జట్టుకి మించి ఎవరూ ఎక్కువ కాకూడదనేది నా ఉద్ధేశం. ఇప్పటికైనా టీమ్‌లో స్టార్ కల్చర్‌కి స్వస్తి పలకాలని కోరుతున్నా’ అని రామన్‌ విమర్శించాడు. 

డబ్ల్యూవీ రామన్‌ 2018 డిసెంబర్‌లో మహిళల జట్టు కోచ్‌గా ఎంపికయ్యారు. కానీ గత రెండున్నరేళ్లలో కరోనా దెబ్బకు పెద్దగా మ్యాచ్‌లే జరగలేదు. 2020 మార్చిలో జరిగిన టి20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన భారత్‌... ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఆ తర్వాత ఏడాదిపాటు టీమ్‌ బరిలోకి దిగలేదు. గత మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్‌ 1–4తో... టి20 సిరీస్‌ను 1–2తో ఓడిపోయింది. ఇదే రామన్‌పై వేటుకు కారణం కావచ్చు. కానీ సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన ఒక సిరీస్‌లో ఓటమికి కోచ్‌ను బాధ్యుడిని చేయడం ఆశ్చర్యకరం. నిజానికి కోచ్‌గా రామన్‌కు మంచి గుర్తింపు ఉంది. టెక్నిక్‌పరమైన అంశాల్లో తమ ఆటతీరు ఆయన వల్లే మెరుగైందని భారత అమ్మాయిలు పలు సందర్భాల్లో చెప్పారు.

ఇక రెండేళ్ల క్రితం కోచ్‌గా ఉన్న రమేశ్ పొవార్‌పై తీవ్రస్థాయిలో మిథాలీ రాజ్ ఆరోపణలు గుప్పించింది. ‘ఉద్దేశపూర్వకంగా నా కెరీర్‌ను నాశనం చేసేందుకు ప్రయత్నించాడు’ అంటూ పొవార్‌పై నిప్పులు చెరిగింది. దీనిపై పొవార్‌ కూడా గట్టిగా బదులిచ్చాడు. ఓపెనర్‌గా అవకాశం ఇవ్వకపోతే టోర్నీ మధ్యలో తప్పుకుంటానని మిథాలీ బెదిరించిందని, జట్టులో సమస్యలు సృష్టించిందని పొవార్‌ వ్యాఖ్యానించాడు. తదనంతర పరిణామాల్లో పొవార్‌ను కోచ్‌ పదవి నుంచి బోర్డు తప్పించింది. అయితే అదే పొవార్ మళ్లీ జట్టుకు ప్రధాన కోచ్‌గా రాగా.. మిథాలీ ఇప్పుడు వన్డే టీమ్‌ కెప్టెన్‌గా ఉంది. ఇప్పుడు రామన్‌ ఎవరు పేరు ప్రస్తావించకుండా స్టార్‌ కల్చర్‌ పెరిగిపోయిందంటూ రాసిన లేఖ మహిళా క్రికెట్‌ జట్టులో చర్చనీయాంశంగా మారింది. 
చదవండి: ఆమె బాధలో ఉంది.. బీసీసీఐ పట్టించుకోకపోవడం దారుణం

రమేశ్‌ పొవార్‌కు బీసీసీఐ బంపర్‌ ఆఫర్‌.. రెండోసారి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top