విశ్వవిజేతగా (Women's CWC 2025) నిలిచేందుకు భారత మహిళా క్రికెట్ జట్టుకు (Team India) అన్ని అర్హతలు ఉన్నాయని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) అభిప్రాయపడింది. 2025 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో సౌతాఫ్రికాపై విజయం అనంతరం హర్మన్ మాట్లాడుతూ ఇలా అంది.
"వరుసగా మూడు ఓటముల తర్వాత కూడా ఏదైనా అద్భుతం చేయగలమని మేం నమ్మాం. పగలు, రాత్రి శ్రమించిన ఈ జట్టుకు విశ్వ విజేతగా నిలిచేందుకు అన్ని అర్హతలూ ఉన్నాయి.
బ్యాటింగ్‌లో షఫాలీ చూపించిన ఆత్మవిశ్వాసాన్ని బట్టి ఆమెకు బౌలింగ్‌లో కూడా రాణిస్తుందని భావించా. అదే మలుపుగా మారింది. ఈ రోజు పిచ్ సెమీస్‌కంటే భిన్నమైంది.
ఫైనల్లో ఉండే ఒత్తిడి వల్ల మేం చేసిన స్కోరు సరిపోతుందని తెలుసు. దక్షిణాఫ్రికా బాగానే ఆడినా చివర్లో ఒత్తిడి పెంచుకుంది. దానిని మేం సరైన విధంగా వాడుకున్నాం.
ప్రతీ ప్రపంచ కప్ ముగిసిన తర్వాత మేం వచ్చే సారైనా ఎలా గెలవాలి అనే విషయం చర్చించుకునేవాళ్లం. గత రెండేళ్లలో కోచ్ అమోల్ మజుందార్ నేతృత్వంలో మా సన్నాహకాలు చాలా బాగా సాగాయి. తుది జట్టులో మేం పెద్దగా మార్పులు చేయకుండా ప్రతీ మ్యాచ్‌లో వారిపై నమ్మకం ఉంచాం.
ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు ఇలాంటి విజయాలను అలవాటుగా మార్చుకోవాలనుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద టోర్నీలు ఉన్నాయి. అక్కడా ఇదే జోరు కొనసాగాలి.మ్యాచ్ ఆసాంతం మైదానంలో అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు"
కాగా, నిన్న జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్లో భారత్ సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో గెలుపొంది, తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి సౌతాఫ్రికాను చిత్తు చేసింది.
తొలుత బ్యాటింగ్‌లో షఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58), స్మృతి మంధన (45) సత్తా చాటి భారత్‌కు భారీ స్కోర్ (298/7) అందించగా.. టార్గెట్‌ను కాపాడుకునే క్రమంలో దీప్తి శర్మ (9.3-0-39-5) చెలరేగిపోయింది. ఫలితంగా సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ లారా వోల్వర్డ్ట్ (101) ఒంటరి పోరాటం చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.
చదవండి: జగజ్జేత టీమిండియాకు భారీ నజరానా


