దేశంలో మహిళల క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణ
గతంతో పోలిస్తే ఎన్నో రెట్లు పెరిగిన ఆన్‌లైన్, టీవీ వీక్షకుల సంఖ్య
» ప్రస్తుత ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో మొదటి 13 మ్యాచ్‌లను జియోహాట్‌స్టార్‌లో 6 కోట్ల మందికిపైగా ఆస్వాదించారు. ఈ వేదికపై వీక్షకుల సంఖ్య 2022లో జరిగిన మహిళల ప్రపంచ కప్‌తో పోలిస్తే ఐదు రెట్లు పెరిగింది.
» తాజాగా జరిగిన మొదటి 11 మ్యాచ్‌లను 7.2 కోట్ల మంది టీవీలో వీక్షించారు. 2022తో పోలిస్తే టీవీ వీక్షకుల సంఖ్య 160% పెరిగింది.
» ఉమెన్స్ క్రికెట్‌ను చూస్తున్న వారిలో 5758% మంది పురుషులే.
» ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మొత్తం వీక్షణ సమయం 700కోట్ల నిమిషాలకు చేరుకుంది. టీవీలో అయితే ఈ సంఖ్య 630 కోట్ల నిమిషాలు దాటింది. – వివరాలు 3లో
సాక్షి, స్పెషల్ డెస్క్: క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. భారత జట్టు మైదానంలో ఉందంటే కోట్ల మంది టీవీలకు అతుక్కుపోవడమో, స్మార్ట్‌ఫోన్లను ముందు పెట్టుకోవడమో చేయాల్సిందే. అంతలా ఈ క్రీడ భారతీయులకు దగ్గరైంది. ఇక క్రికెట్ జట్టు అనగానే పురుషుల బృందం గుర్తొచ్చే రోజులు పోయాయి. మహిళల జట్లకూ క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.
ఆన్‌లైన్ ద్వారా కోట్లలో మ్యాచ్‌ల వీక్షణ
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ గణాంకాల ప్రకారం ప్రస్తుత ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో ఎనిమిది దేశాల జట్లు ఆడుతుండగా మొదటి 13 మ్యాచ్‌లను 6 కోట్ల మందికిపైగా వీక్షించారు. ఈ వేదికపై వీక్షకుల సంఖ్య 2022లో జరిగిన మహిళల ప్రపంచ కప్‌తో పోలిస్తే ఏకంగా ఐదు రెట్లు పెరగడం విశేషం. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మొత్తం వీక్షణ సమయం 700 కోట్ల నిమిషాలకు చేరుకుంది. మూడేళ్ల క్రితం జరిగిన మ్యాచ్‌లతో పోలిస్తే అనూహ్యంగా ఇది 12 రెట్లు ఎక్కువ.
ఇక టీవీ వీక్షణాల విషయానికి వస్తే ప్రస్తుత టోర్నమెంట్‌లో మొదటి 11 మ్యాచ్‌లను 7.2 కోట్ల మంది టీవీల్లో ఆస్వాదించారు. టీవీ వీక్షకుల సంఖ్య 2022తో పోలిస్తే 160 శాతం వృద్ధి చెందడం విశేషం. మహిళల క్రికెట్‌కూ ఆదరణ పెరుగుతోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. ఇంకేముంది.. ప్రకటన కంపెనీలు సైతం క్యూ కట్టాయి. స్పాన్సర్స్‌లో రెక్సోనా, గూగుల్ బ్రాండ్స్ జెమినై, పే, పిక్సెల్, ఆండ్రాయిడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ జెమాలాజికల్ ఇన్‌స్టిట్యూట్ ఉన్నాయి. అఫీషియల్ బేవరేజ్ పార్ట్‌నర్‌గా కోకా–కోలా ఉంది.
కొత్త రికార్డులకు.. : ఈ సంవత్సరం ప్రపంచ కప్ మహిళల క్రికెట్ పోటీల్లో వీక్షకుల సంఖ్య, ప్రకటనలు కొత్త రికార్డులకు వేదికయ్యాయి. టోర్నమెంట్ ప్రకటనల కోసం బ్రాండ్స్ చేస్తున్న ఖర్చు గత ఎడిషన్ కంటే 50% ఎక్కువగా ఉంది. ఈ ఏడాది పురుషుల క్రికెట్ ఈవెంట్లతో క్యాలెండర్ బిజీగా ఉన్నప్పటికీ మహిళల క్రికెట్‌తో బ్రాండ్స్ భాగస్వామ్యం కావడం విశేషం.
2026లో మహిళల ప్రీమియర్ లీగ్‌కు ఈ కంపెనీలు మరింత ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సాధారణంగా పురుషుల క్రికెట్ వీక్షకుల్లో 70% మంది పురుషులు ఉంటుండగా ఉమెన్స్ క్రికెట్‌ను చూస్తున్న వారిలో 57–58 శాతం మంది పురుషులే ఉంటుండటం మరో ఆసక్తికర అంశం. ఇంగ్లండ్–ఆ్రస్టేలియా మ్యాచ్ వంటి భారతేతర మ్యాచ్‌లను కూడా దాదాపు 90 లక్షల మంది చూశారు.
జెర్సీలతోనూ ప్రచారం..
కొన్ని సంవత్సరాలుగా బ్రాండ్లు మహిళల క్రికెట్‌లో టోకెన్ స్పాన్సర్íÙప్స్ నుంచి దీర్ఘకాలిక భాగస్వామ్యాలకు మారుతున్నాయి. ఇందుకు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఒక గేమ్ ఛేంజర్‌గా నిలిచింది. అంతేకాదు.. మహిళల క్రికెట్‌కు ప్రైమ్–టైమ్ విజిబిలిటీని అందిస్తోంది. మీడియా కవరేజ్, సోషల్ మీడియా ట్రాక్షన్, క్రికెటర్లపై మీడియాలో సానుకూల కథనాలు.. వెరసి ప్రకటనదారులనేగాక వీక్షకుల ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.
పురుషుల టోర్నమెంట్ల మాదిరిగానే బ్రాండ్లు కూడా మహిళల మ్యాచ్‌ల కోసం ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలను రూపొందిస్తున్నాయి. ఏషియన్ పెయింట్స్ ‘మేరీ వాలి బ్లూ’ప్రచారం ఇందుకు ఉదాహరణ. జియోస్టార్ ‘జెర్సీ వహి తో జస్బా వహి’నినాదం కూడా భారత జెర్సీ శక్తిని చాటి వీక్షకులను ఆకట్టుకుంటోంది.
గతంలో కంటే అధికంగా..
మహిళల క్రికెట్‌కు సంబంధించి తక్కువ నిడివిగల స్పోర్ట్స్ కంటెంట్ పెరుగుతోంది. ఇది బ్రాండ్లకు కలిసి వచ్చిందని మార్కెటింగ్ సంస్థలు అంటున్నాయి. దీంతో మహిళల క్రికెట్‌పై గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ ఖర్చు చేస్తున్నాయని చెబుతున్నాయి.
ముఖ్యంగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తర్వాత మహిళల క్రికెట్ వైపు బ్రాండ్ పెట్టుబడుల్లో స్థిరమైన పెరుగుదల ఉంది. కొన్నేళ్ల క్రితంతో పోలిస్తే మార్కెటింగ్ కంపెనీలు మహిళల క్రీడల బ్రాండింగ్‌కు నిధులు పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అభిమానుల సంఖ్య అధికం కావడం, మెరుగైన ప్రసారం, ఖర్చుకు తగ్గ రాబడులు పెరగడం ఇందుకు దోహదం చేస్తున్నాయని వెల్లడిస్తున్నారు.
బ్రాండ్లకు ప్రచారకర్తలుగానూ..
మహిళా క్రికెటర్లు బ్రాండ్ ప్రచారకర్తలుగా నియమితులవుతున్నారు. సినీతారలు, పురుష క్రికెటర్లతో పోలిస్తే ఈ ఒప్పందాల సంఖ్య చాలా తక్కువ. మహిళా క్రికెటర్లు సహజంగానే క్రీడా దుస్తులు, వ్యక్తిగత సంరక్షణ వంటి కొన్ని విభాగాలకు బాగా సరిపోతారు. అయితే సంప్రదాయికంగా పురుష అంబాసిడర్లు ఉన్న ఆటోమొబైల్ వంటి విభాగాల్లో మహిళా క్రికెట్ స్టార్స్‌ను సైతం ప్రచారకర్తలుగా చేర్చుకుంటే మార్కెటింగ్ వ్యవస్థలో గణనీయమైన మార్పు ఉండవచ్చన్నది నిపుణుల మాట.


