కోహ్లికి కూడా ఫ్లైయింగ్‌ కిస్‌ ఇస్తావా? కేకేఆర్‌ స్టార్‌ రిప్లై వైరల్‌ | Will You Give A Flying Kiss To Virat Kohli KKR Star Reply Is Viral | Sakshi
Sakshi News home page

విరాట్‌ కోహ్లికి కూడా ఫ్లైయింగ్‌ కిస్‌ ఇస్తావా? కేకేఆర్‌ స్టార్‌ రిప్లై వైరల్‌

Published Tue, Jun 18 2024 4:35 PM | Last Updated on Tue, Jun 18 2024 5:50 PM

Will You Give A Flying Kiss To Virat Kohli KKR Star Reply Is Viral

ఐపీఎల్‌-2024లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బౌలర్‌ హర్షిత్‌ రాణా. జట్టును చాంపియన్‌గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు.

ఈ మెగా టోర్నీలో హర్షిత్‌ మొత్తంగా 13 మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు పడగొట్టాడు. తద్వారా తాజా సీజన్‌లో కేకేఆర్‌ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా.. వరుణ్‌ చక్రవర్తి(21 వికెట్లు) తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.

కాగా ఐపీఎల్‌ తాజా ఎడిషన్‌లో ఆటతోనే కాకుండా.. తనదైన వైల్డ్‌ సెలబ్రేషన్స్‌తోనూ అందరి దృష్టిని ఆకర్షించాడు హర్షిత్‌ రాణా. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌ సందర్భంగా మయాంక్‌ అగర్వాల్‌ వికెట్‌ తీసిన తర్వాత ఫ్లైయింగ్‌ కిస్‌తో సెలబ్రేట్‌ చేసుకున్నాడు ఈ 22 ఏళ్ల రైటార్మ్‌ పేసర్‌.

మ్యాచ్‌ ఫీజులో 60 శాతం మేర కోత
ఈ నేపథ్యంలో బీసీసీఐ హర్షిత్‌ను మందలించింది. మరోసారి ఇలాగే అతి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ.. మ్యాచ్‌ ఫీజులో 60 శాతం మేర కోత విధించింది.

ఇక ఆ తర్వాత హర్షిత్‌ రాణా మరోసారి ఇలా ఏ బ్యాటర్‌కు సెండాఫ్‌ ఇవ్వలేదు. అయితే, అతడి ప్రవర్తనపై మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.

భయ్యాతో మాట్లాడాను
తాజాగా శుభాంకర్‌ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ హర్షిత్‌ రాణా ఈ విషయంపై స్పందించాడు. ‘‘నేను ఉద్దేశపూర్వకంగా ఆరోజు మయాంక్‌ భయ్యాకు ఫ్లైయింగ్‌ కిస్‌ ఇవ్వలేదు. మయాంక్‌ భయ్యా బంతిని గాల్లోకి లేపగానే తన దగ్గరగా వెళ్లాను.

ఆ సమయంలో వికెట్‌ సెలబ్రేట్‌ చేసుకునే క్రమంలో సరదాగా అలా చేశాను. కెమెరామెన్‌ కూడా నా వైపే ఫోకస్‌ చేశాడు. ఆ తర్వాత నేను ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా మయాంక్‌ భయ్యాను కలిశాను.

తనను అగౌరవపరిచే ఉద్దేశం నాకు లేదని చెప్పాను. ఆయన కూడా అర్థం చేసుకున్నాడు. మా ఇద్దరి మధ్య అవగాహన కుదిరింది’’ అని హర్షిత్‌ రాణా పేర్కొన్నాడు.

విరాట్‌ కోహ్లికి కూడా ఫ్లైయింగ్‌ కిస్‌ ఇస్తావా? 
ఈ క్రమంలో విరాట్‌ కోహ్లి విషయంలో కూడా ఇలాగే చేస్తావా  అంటూ హోస్ట్‌ ప్రశ్నించగా.. ‘‘నేను ముందు చెప్పినట్లుగా.. కావాలని ఏదీ చేయను. ఆర్సీబీ మ్యాచ్‌లో కూడా నేను ఫ్లైయింగ్‌ కిస్‌ ఇస్తే చూడాలని చాలా మంది అనుకున్నారు.

నన్ను చాలెంజ్‌ చేశారు. కానీ కోహ్లిని నేను ఎన్నటికీ టీజ్‌ చేయను. ఆయన పట్ల నాకు అమితమైన గౌరవం ఉంది. కోహ్లి భయ్యా ఒక్కడే కాదు.. ప్రతి ఒక్క ఆటగాడిని నేను గౌరవిస్తాను.

ఏదేమైనా కోహ్లి ముందు మాత్రం ఇలా అస్సలు చేయను’’ అని హర్షిత్‌ రాణా బదులిచ్చాడు. కాగా లీగ్‌ దశలో దుమ్ములేపిన కేకేఆర్‌.. ఫైనల్లో సన్‌రైజర్స్‌ను ఓడించి 2024 టైటిల్‌ గెలిచిన విషయం తెలిసిందే. 

తద్వారా మూడో ట్రోఫీని అందుకుంది. ఇక విజయానంతరం కేకేఆర్‌ సహ యజమాని షారుఖ్‌ ఖాన్‌ సైతం ఫ్లైయింగ్‌ కిస్సులు ఇస్తూ సెలబ్రేట్‌ చేసుకున్న విషయం తెలిసిందే.

చదవండి: ఐపీఎల్‌ సృష్టికర్త కుమార్తె.. వేల కోట్లకు వారసురాలు! ఆమె ప్రత్యేకత ఇదే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement