ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి మరో సూపర్ స్టార్ పుట్టుకొచ్చాడు. తన సంచలన బ్యాటింగ్‌తో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. మిచెల్ మార్ష్, మార్‌క్రమ్, పూరన్ వంటి విధ్వంసకర ఆటగాళ్ల విఫలమైన చోట.. ఆ యువ ఆటగాడు అద్భుతం సృష్టించాడు. ఒంటో చేత్తో తన జట్టుకు విజయాన్ని అందించాడు. అతడే లక్నో సూపర్ జెయింట్స్ యువ సంచలనం ముకుల్ చౌదరి.
ఐపీఎల్-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముకుల్ చౌదరి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఓడిపోయే మ్యాచ్‌ను ఓంటి చేత్తో గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో అజింక్య రహానే(41) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రఘువంశీ(45), గ్రీన్(32), రావ్‌మన్ పావెల్(39) రాణించారు.
అనంతరం 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో పవర్ ప్లేలోనే ఓపెనర్లు మార్‌క్రమ్ (22), మార్ష్(15) వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత రిషబ్ పంత్(10), పూరన్(13), సమద్(2) ముగ్గురు కూడా వరుస క్రమంలో పెవిలియన్‌కు చేరారు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికి ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అయూశ్ బదోని(54) మాత్రం దూకుడుగా ఆడుతూ కేకేఆర్ బౌలర్లపై ఒత్తిడి తెచ్చాడు.
కానీ అదే సమయంలో క్రీజులోకి వచ్చిన ముకుల్ చౌదరి కేకేఆర్ బౌలర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డాడు. హాఫ్ సెంచరీ సాధించిన అనంతరం అయూశ్ బదోని సైతం ఔటయ్యాడు. అప్పటికే చివరి నాలుగు ఓవర్లలో లక్నో విజయానికి 50 పరుగులు కావాలి. రెగ్యులర్ బ్యాటర్లు ఎవరు లేకపోవడంతో లక్నో ఓటమి ఖాయమని అంతా భావించారు. కానీ ముకుల్ చౌదరి అందరి అంచనాలను తారుమారు చేశాడు.
తొలి ఆరు బంతుల్లో కేవలం రెండు పరుగులు చేసిన ముకుల్.. ఆఖరి నాలుగు ఓవర్లలో విశ్వరూపాన్ని చూపించాడు. వైభవ్ అరోరా వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో 4, 6, 1 బాది 11 పరుగులు రాబట్టిన ముకుల్ చౌదరి.. తర్వాత కార్తీక్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో 2 సిక్సర్లతో 13 పరుగులు రాబట్టాడు. దీంతో చివరి రెండు ఓవర్లలో లక్నో విజయానికి 30 పరుగులు అవసరమయ్యాయి.
ఈ సమయంలో కామెరూన్ గ్రీన్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో ముకుల్ 6, 4, 6 బాది 16 పరుగులు పిండుకున్నాడు. దీంతో ఆరోరా వేసిన చివరి ఓవర్‌లో లక్నో విజయ సమీకరణం 14 పరుగులుగా మారింది. తొలి బంతిని అవేష్ సింగిల్ తీసి ముకుల్ చౌదరికి స్ట్రైక్ ఇచ్చాడు. దీంతో ముకుల్.. రెండో బంతిని డీప్ స్క్వేర్-లెగ్ దిశగా భారీ సిక్సర్‌గా మలిచాడు.
అనంతరం వరుసగా రెండు బంతులకు ఎలాంటి పరుగులు రాకపోవడంతో లక్నో డగౌట్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కానీ ఐదో బంతికి ముకుల్ సిక్స్ బాది స్కోర్లను సమం చేశాడు. చివరి బంతికి బై రూపంలో పరుగు తీసి తన జట్టుని గెలిపించాడు. ముకుల్ కేవలం 27 బంతుల్లోనే 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 54 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఎవరీ ముకుల్ చౌదరి నెటిజన్లు తెగవేతికేస్తున్నారు.
ఎవరీ ముకుల్ చౌదరి?
21 ఏళ్ల ముకుల్ చౌదరి.. రాజస్తాన్‌లోని ఝున్‌ఝునులో జన్మించాడు. ముకుల్‌కు చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. అతడి తండ్రి ముకుల్‌ను గొప్ప క్రికెటర్ చేయాలని కలలు కన్నాడు. కానీ అప్పట్లో వారి ఆర్ధిక పరిస్థితి అంత బాగోలేకపోవడంతో సరైన అకాడమీలో చేర్చలేకపోయాడు. ఆఖరికి పైసా పైసా కూడబెట్టి 12-13 ఏళ్ల వయసులో తొలిసారి ముకుల్‌ను ఓ క్రికెట్ ఆకాడమీలో అతడి తండ్రి చేర్చాడు.
ముకుల్ మొదట్లో మీడియం ఫాస్ట్ బౌలర్‌గా శిక్షణ పొందాడు. అయితే తన అకాడమీ జట్టులో వికెట్ కీపర్ లేకపోవడంతో కీపింగ్ గ్లౌవ్స్ ధరించాడు. ఆపై అతడు బౌలింగ్‌ను పక్కన పెట్టి స్పెషలిస్ట్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా మారిపోయాడు. ముకుల్ 2023లో రాజస్థాన్ తరపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. కానీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో 165+ స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు.
అంతేకాకుండా గతేడాది జరిగిన అండర్-23 వన్డే టోర్నమెంట్‌లో కూడా అతడు రాజస్తాన్ తరపున సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఈ వన్డే టోర్నీలో అతడు 102.83 సగటుతో 617 పరుగులు చేసి టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2026 వేలానికి ముందు అతడిని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ట్రయల్స్‌కు పిలిచింది.
ట్రయల్స్‌లో కూడా తన అద్భుత బ్యాటింగ్‌తో ముంబై స్కౌట్లను ఆకట్టుకున్నాడు. దీంతో ముకుల్‌ను వేలంలో కొనుగోలు చేయాలని ముంబై భావించింది. రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన అతడి కోసం రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ పోటీ పడింది.
ఆఖరికి లక్నో రూ. 2.60 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ముకుల్ ఆడిన రెండు మ్యాచ్‌లలో అతడు సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యాడు. కానీ అతడికి లక్నో మేనెజ్‌మెంట్ మరోసారి అవకాశమచ్చింది. ఈసారి తన మూడో మ్యాచ్‌లో అద్బుత ఇన్నింగ్స్‌తో మేనెజ్‌మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇప్పటివరకు 4 ఫస్ట్ క్లాస్, 5 లిస్ట్-ఎ, 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.


