భారత్‌లో ఫాస్ట్ బౌలర్ల కన్నా మీడియం ఫాస్ట్ బౌలర్లే ఎక్కువగా ఉంటారు. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, కార్తిక్ త్యాగి వంటి ఫాస్ట్ బౌలర్లు అరుదుగా కనిపిస్తుంటారు. తాజాగా ఐపీఎల్ 2026 సీజన్ ద్వారా మరో ఫాస్ట్ బౌలర్ వెలుగులోకి వచ్చాడు. అతడే గుజరాత్ టైటాన్స్‌కు చెందిన అశోక్ శర్మ.
శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎవరూ ఊహించని విధంగా గంటకు 154 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి నిప్పులు చెరిగాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ చివరి బంతిని అశోక్ శర్మ 154.2 కి.మీ వేగంతో విసిరాడు. మెరుగు వేగంతో వచ్చిన బంతిని ధ్రువ్ జురేల్ భారీ షాట్ ఆడడంలో విఫలమై డిఫెన్స్ చేసుకున్నాడు.
ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో అశోక్ శర్మ సంధించిన బంతి అత్యంత వేగవంతమైనదిగా రికార్డులకెక్కింది. అశోక్ శర్మ కంటే ముందు లక్నో సూపర్‌జెయింట్స్ బౌలర్ అన్రిచ్ నోర్ట్జే (150.9), కార్తిక్ త్యాగి (149.7), రబాడ (149.1) ఉన్నారు. అయితే తొలి స్పెల్‌లో అశోక్ శర్మను రాజస్తాన్ బ్యాటర్లు దంచికొట్టారు. 2 ఓవర్లు కలిపి 9 సగటుతో 18 పరుగులు సమర్పించుకున్నాడు.
అయితే రెండో స్పెల్‌లో మాత్రం అశోక్ శర్మ దుమ్మురేపాడు. ఒక వికెట్ తీయడంతో పాటు తన ఫాస్ట్ బౌలింగ్‌తో వణికించాడు. అంతేకాదు గుజరాత్ బౌలర్లలో అందరూ దాదాపు భారీగా పరుగులిచ్చుకోగా.. అశోక్ శర్మ మాత్రం మిగతా వాళ్లతో పోలిస్తే తక్కువ ఎకానమీ నమోదు చేయడం విశేషం. గుజరాత్ ఓడినప్పటికీ అశోక్ శర్మ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఎవరీ అశోక్ శర్మ? ఎక్కడి నుంచి వచ్చాడనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఎవరీ అశోక్ శర్మ?
రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామానికి చెందిన అశోక్ శర్మను ఐపీఎల్ 2026 మినీ వేలంలో గుజరాత్ టైటాన్స్ రూ.90 లక్షలకు కొనుగోలు చేసింది. అశోక్ శర్మ తండ్రి హుకుమ్ చంద్ శర్మ.. రాజస్థాన్ పోలీస్ విభాగంలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. కొడుకును క్రికెటర్‌గా చూడాలనేది ఆయన కోరిక.
తండ్రి ప్రోత్సాహంతో క్రికెటర్‌గా ఎదిగిన అశోక్ శర్మ.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాజస్థాన్ తరఫున సత్తా చాటి అందరి దృష్టిని ఆకర్షించాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులను సంధించడం అతని ప్రత్యేకత. కుడిచేతి వాటం పేసర్ అయిన అశోక్ శర్మ.. తనను తాను హార్డ్ లెంగ్త్ బౌలర్‌గా చెప్పుకుంటాడు.
ముస్తాక్ అలీ ట్రోఫీతో వెలుగులోకి
ముస్తాక్ అలీ ట్రోఫీలో రాజస్థాన్ తరఫున 19 వికెట్లతో అల్లాడించాడు. 12.10 సగటు, 8.84 ఎకానమీతో టాప్ బౌలర్‌గా నిలిచాడు. అశోక్ శర్మ తొలినాళ్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టులో నెట్ బౌలర్‌గా పనిచేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయడంలో ఇతనికి మంచి పట్టు ఉంది.
2022 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇతడిని రూ. 55 లక్షలకు కొనుగోలు చేయగా, 2025లో రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వెళ్ళాడు. ఇక 2026 వేలంలో గుజరాత్ టైటాన్స్ రూ. 90 లక్షలు వెచ్చించి అశోక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు 11 టీ20 మ్యాచ్‌ల్లో 33 వికెట్లు పడగొట్టిన ఈ యువ స్పీడ్‌స్టర్, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోనూ మంచి రికార్డును కలిగి ఉన్నాడు.
Ashok Sharma clocks the fastest ball of the season🚄#AshokSharma #IPL2026 #GTvsRR pic.twitter.com/wfyPT9UeC7
— CREX (@Crex_live) April 4, 2026
చదవండి: రవి బిష్ణోయ్ అరుదైన రికార్డు!


