ఐపీఎల్-2026 సీజన్‌లో తుది సమరానికి రంగం సిద్దమైంది. ఈ మెగా టోర్నీ ఫైనల్ పోరులో భాగంగా ఆదివారం అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తమ రెండో ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.
క్వాలిఫయర్-1లో ఆర్సీబీ చేతిలో ఓటమి చవిచూసిన గుజరాత్.. అందుకు ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో ఉంది. బెంగళూరు మాత్రం ఫైనల్ మ్యాచ్‌లోనూ తమ జోరును కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది.
మ్యాచ్ జరిగే సమయంలో 30 శాతం వరకు వర్షం పడేందుకు అస్కారం ఉందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఒక వేళ వర్షం పడి మ్యాచ్ రద్దేతే పరిస్థితి ఏంటి? ట్రోఫీ ఎవరికి ఇస్తారు? అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ఒకవేళ వర్షం పడితే?
మిగిలిన నాకౌట్ మ్యాచ్‌ల మాదిరిగానే ఈ మ్యాచ్‌కు కూడా 120 నిమిషాల అదనపు సమయం ఇవ్వబడుతుంది. కానీ ఈ తుది పోరుకు మాత్రం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రత్యేకంగా రిజర్వ్ డే ను కేటాయించింది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం(మే 31) పూర్తి మ్యాచ్ నిర్వహించడానికి అంపైర్‌లు నిర్వహిస్తారు.
సమయం మించిపోతుంటే ఓవర్లను కుదిస్తూ వస్తారు. ఫలితం తేలాలంటే ఇరు జట్లు కనీసం 5 ఓవర్ల చొప్పున ఆడాల్సి ఉంటుంది. 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించడానికి చివరి కట్-ఆఫ్ సమయం రాత్రి 11:55 గంటల వరకు ఉంటుంది. ఐదు ఓవర్ల మ్యాచ్ కూడా సాధ్యం కాకపోతే.. అర్ధరాత్రి 12:50 గంటల లోపు కేవలం 'సూపర్ ఓవర్' ద్వారా విజేతను తేల్చేందుకు ప్రయత్నిస్తారు. అప్పటికి వాతవారణం అనుకూలించకపోతే మ్యాచ్ రిజర్వ్ డేకి మారుతుంది.
ఒకవేళ ఆదివారం నాడు వర్షం కారణంగా పూర్తిగా మ్యాచ్ మొదలు కాకపోతే రిజర్వ్ డే అయిన సోమవారం(జూన్ 1)మ్యాచ్‌ను నిర్వహిస్తారు. మ్యాచ్ ప్రారంభమై ఆగిపోతే.. ఆదివారం ఎక్కడైతే మ్యాచ్ ఆగిందో అక్కడి నుంచే ఆటను సోమవారం కొనసాగిస్తారు.
రిజర్వ్ డే రోజు కూడా ఆట సాధ్యం కాకపోతే లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. గ్రూపు స్టేజ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అగ్రస్ధానంలో ఉంది కాబట్టి ఛాంపియన్‌గా అవతరిస్తోంది. కాగా ఐపీఎల్-2023 సీజన్ ఫైనల్ మ్యాచ్ ఫలితం రిజర్వ్ డే రోజునే తేలింది.
చదవండి: సూర్యకుమార్ కీలక నిర్ణయం.. ఆఖరి నిమిషంలో?


