‘పోప్‌’ ముందుండి నడిపించగా...

West Indies Team Bowling Failed in Third Test Match - Sakshi

తొలి రోజు ఇంగ్లండ్‌ 258/4

బట్లర్, బర్న్స్‌ అర్ధ సెంచరీలు

విండీస్‌ బౌలింగ్‌ వైఫల్యం

మాంచెస్టర్‌: స్టార్‌ ఆటగాడు స్టోక్స్‌ విఫలమయ్యాడు... కెప్టెన్‌ రూట్‌ది అదే బాట... గత మ్యాచ్‌లో శతకం బాదిన సిబ్లీ ఈ సారి సున్నా చుట్టాడు... ఐదుగురు రెగ్యులర్‌ బ్యాట్స్‌మెన్‌తోనే బరిలోకి దిగిన జట్టులో టాప్‌–4 రెండు సెషన్లు ముగియక ముందే పెవిలియన్‌ చేరారు. అయినా సరే వెస్టిండీస్‌తో చివరి టెస్టులో తొలి రోజు ఇంగ్లండ్‌ పటిష్టమైన స్థితిలో నిలిచింది. ఇదంతా యువ ఆటగాడు ఒలి జాన్‌ పోప్‌ (142 బంతుల్లో 91 బ్యాటింగ్‌; 11 ఫోర్లు) చలవే.

అతనికి సరైన సమయంలో కీపర్‌ బట్లర్‌ (120 బంతుల్లో 56 బ్యాటింగ్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అండగా నిలవడంతో ఆతిథ్య జట్టు ఊపిరి పీల్చుకుంది. రోరీ బర్న్స్‌ (147 బంతుల్లో 57; 4 ఫోర్లు) కూడా రాణించాడు. వెస్టిండీస్‌ పేలవ బౌలింగ్‌ కారణంగా చివరి సెషన్‌ మొత్తం ఆధిక్యం కనబర్చిన ఇంగ్లండ్‌ ఆట ముగిసే సమయానికి 85.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 258  పరుగులు చేసింది. పోప్, బట్లర్‌ ఇప్పటికే ఐదో వికెట్‌కు అభేద్యంగా 136 పరుగులు జోడించారు. 32.4 ఓవర్లు సాగిన చివరి సెషన్‌లో ధాటిగా ఆడి 127 పరుగులు జత చేయడం విశేషం. రోచ్‌కు 2 వికెట్లు దక్కాయి. 

రూట్‌ విఫలం: నిర్ణాయక టెస్టులో విండీస్‌కు శుభారంభం లభించింది. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన సిబ్లీ (0)ని తొలి ఓవర్లోనే రోచ్‌ ఎల్బీగా అవుట్‌ చేశాడు. ఆ తర్వాత లేని సింగిల్‌ కోసం ప్రయత్నించి కెప్టెన్‌ రూట్‌ (17) రనౌట్‌ అయ్యాడు. లంచ్‌ సమయానికి ఇంగ్లండ్‌ 66 పరుగులకు చేరింది. విరామం తర్వాత స్టోక్స్‌ (20)ను అద్భుత ఇన్‌స్వింగర్‌తో రోచ్‌ బౌల్డ్‌ చేశాడు. అయితే సహచరులు వెనుదిరుగుతున్నా మరోవైపు ఓపెనర్‌ బర్న్స్‌ మాత్రం కాస్త పట్టుదల ప్రదర్శించాడు. 126 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే కొద్దిసేపటికే ఛేజ్‌ బౌలింగ్‌లో కార్న్‌వాల్‌కు క్యాచ్‌ ఇచ్చి బర్న్స్‌ వెనుదిరిగాడు. 

కీలక భాగస్వామ్యం: టీ విరామానికి ఇంగ్లండ్‌ 4 వికెట్లు చేజార్చుకొని 131 పరుగులు చేసింది. అనంతరం పోప్, బట్లర్‌ బాధ్యతాయుత ఆటతో ఆదుకున్నారు. విండీస్‌ కూడా కాస్త ఉదాసీనత ప్రదర్శించడంతో చకచకా పరుగులు వచ్చాయి. చక్కటి షాట్లు ఆడిన పోప్‌ 77 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా... వరుసగా విఫలమై విమర్శలు ఎదుర్కొంటున్న బట్లర్‌ ఎట్టకేలకు రాణించాడు. 104 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేశాడు. వీరిద్దరిని విడదీయడం విండీస్‌ వల్ల కాలేదు. కొత్త బంతిని తీసుకున్నా లాభం లేకపోయింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top