బీసీసీఐకి మా రిక్వెస్ట్‌.. లేఖలో ఆ విషయాలు: బంగ్లాదేశ్‌ | BCB Confirms That We Recently Reaches Out To BCCI After T20 World Cup Pull Out, Read Story For More Details | Sakshi
Sakshi News home page

బీసీసీఐకి ఇదే మా రిక్వెస్ట్‌.. లేఖలో ఆ విషయాలు: బంగ్లాదేశ్‌

Apr 4 2026 5:26 PM | Updated on Apr 4 2026 5:46 PM

We recently Reaches out to BCCI: BCB Confirms After T20 WC Pull out

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని సంప్రదించినట్లు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) తాజాగా ధ్రువీకరించింది. భారత్‌తో క్రికెట్‌ సంబంధాల పునరుద్ధరణ కోసం తాము ముందడుగు వేసినట్లు తెలిపింది. కాగా గత కొంతకాలంగా భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా క్రికెట్‌ సంబంధాలు కూడా దెబ్బతిన్న సంగతి తెలిసిందే.

భద్రతా కారణాలు చూపుతూ
ఈ క్రమంలో బంగ్లాదేశ్‌ ఫాస్ట్‌బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ను ఐపీఎల్‌ నుంచి బీసీసీఐ తొలగించగా.. టీ20 ప్రపంచకప్‌-2026 ఆడేందుకు భారత్‌కు వచ్చేందుకు బంగ్లా నిరాకరించింది. భద్రతా కారణాలు చూపుతూ తమ వేదికను శ్రీలంకను మార్చమని ఐసీసీని కోరగా.. ప్రతికూల నిర్ణయం రావడంతో టోర్నీ నుంచే తప్పుకొంది.

ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు వంత పాడుతూ పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు బీసీసీఐపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేసింది. ఐసీసీ సైతం బీసీసీఐ ఒత్తిడికి తలొగ్గి బంగ్లాదేశ్‌కు అన్యాయం చేసిందని ఆరోపించింది. ఇందుకు ప్రతిగా తాము భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరిస్తామని ప్రగల్భాలు పలికి బొక్కబోర్లా పడింది.

భారీగా నష్టపోయే ప్రమాదం
ఐసీసీ రంగంలోకి దిగడంతో టీమిండియాతో మ్యాచ్‌ ఆడటమే కాకుండా.. యథావిధిగా మరోసారి ఓటమిని మూటగట్టుకుంది పాకిస్తాన్‌. ఈ ఎపిసోడ్‌తో బంగ్లాదేశ్‌ ఆర్థికంగా భారీగా నష్టపోయే ప్రమాదం వచ్చిపడింది. ఆదేశంలోని మెజారిటీ ప్లేయర్ల క్రికెట్‌ కిట్లకు స్పాన్సర్లుగా ఉన్న భారత కంపెనీలు వైదొలుగుతాయనే భయం పట్టుకుంది.

ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పలువురు మాజీ క్రికెటర్లు బంగ్లా బోర్డును హెచ్చరించారు కూడా!.. ఈ క్రమంలో తాజాగా బీసీబీ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ నేపథ్యంలో బీసీబీ క్రికెట్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ నజ్ముల్‌ అబెదిన్‌ ఫాహిమ్‌ ANIతో మాట్లాడుతూ కీలక విషయం వెల్లడించాడు.

 బీసీసీఐని సంప్రదించాము
‘‘వివిధ దేశాల క్రికెట్‌ బోర్డులతో మేము సమన్వయం చేసుకుంటున్నాము. ఇటీవలే బీసీసీఐని కూడా సంప్రదించాము. ఇ-మెయిల్‌ ద్వారా లేఖ పంపించాము. అందులో టీమిండియా బంగ్లాదేశ్‌ పర్యటన గురించి ప్రస్తావించాము. ఈ ఏడాది సెప్టెంబరులో టీమిండియా బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సిన విషయాన్ని గుర్తుచేశాము.

అదే విధంగా మా మహిళా జట్టు భారత్‌లో పర్యటించాల్సి ఉంది. దీనితో పాటు పరస్పర ప్రయోజనాలు చేకూరేలా క్రికెట్‌కు సంబంధించి ఇతర కార్యక్రమాలు ఏమైనా నిర్వహించవచ్చన్న విషయాన్ని కూడా పరిశీలించాలని అభ్యర్థించాము’’ అని నజ్ముల్‌ తెలిపాడు. 

మూడు వన్డేలు, మూడు టీ20లు!
కాగా బంగ్లాదేశ్‌ కొత్త ప్రధానిగా తారిక్‌ రహమాన్‌ ఎన్నికైన తర్వాత భారత్‌- బంగ్లా సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఏప్రిల్‌ 7,8 తేదీల్లో బంగ్లాదేశ్‌ విదేశాంగ శాఖా మంత్రి డాక్టర్‌ ఖాలిలుర్‌ రహమాన్‌ భారత పర్యటనకు రానున్నారు.

ఈ నేపథ్యంలో క్రికెట్‌లోనూ సంబంధాల పునరుద్ధరణ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది బంగ్లా బోర్డు. ఇదిలా ఉంటే గతేడాది ఆగస్టులో టీమిండియా బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా.. టూర్‌ వాయిదా పడింది. ఈ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబరు 1- 13 మధ్య బంగ్లాదేశ్‌తో భారత్‌ మూడు వన్డే, మూడు టీ20లు ఆడేలా షెడ్యూల్‌ ఖరారు కావాలని బీసీబీ కోరుకుంటోంది.

చదవండి: టీమిండియాకు శుభవార్త: నితీశ్‌ రెడ్డిపై గావస్కర్‌ ప్రశంసలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement