టీమిండియాకు శుభవార్త: నితీశ్‌ రెడ్డిపై గావస్కర్‌ ప్రశంసలు | Sunil Gavaskar Hails SRH Star Nitish Kumar Reddy All Round Brilliance, Calls It Big Boost For Team India | Sakshi
Sakshi News home page

టీమిండియాకు శుభవార్త: నితీశ్‌ రెడ్డిపై గావస్కర్‌ ప్రశంసలు

Apr 4 2026 12:59 PM | Updated on Apr 4 2026 4:49 PM

Very Encouraging for India: Gavaskar hails SRH Star Nitish Kumar Reddy

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డిపై భారత క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ ప్రశంసలు కురిపించాడు. అతడి బౌలింగ్‌ బాగా మెరుగుపడిందని.. టీమిండియాకు ఇదొక శుభవార్త అని పేర్కొన్నాడు. కాగా గతేడాది ఐపీఎల్‌లో నితీశ్‌ రెడ్డి (Nitish Kumar Reddy) పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.

తొలి మ్యాచ్‌లో విఫలం
గాయాల కారణంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఈ ఆంధ్ర క్రికెటర్‌.. ఈ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (SRH vs RCB)తో మ్యాచ్‌లో నితీశ్‌ రెడ్డి బ్యాట్‌, బంతితో రాణించడంలో విఫలమయ్యాడు. 

నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి ఆరు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగుకే నిష్క్రమించిన ఈ పేస్‌బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌.. రెండు ఓవర్లు బౌల్‌ చేసి 19 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు.

కేకేఆర్‌తో మ్యాచ్‌లో సూపర్‌ హిట్‌
ఇక సన్‌రైజర్స్‌ తమ రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తలపడగా.. ఈసారి నితీశ్‌ రెడ్డి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన నితీశ్‌ 24 బంతుల్లో 39 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత బౌలింగ్‌లో 2 ఓవర్లు వేసి 17 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు.

తద్వారా సన్‌రైజర్స్‌ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా నితీశ్‌ రెడ్డి మాట్లాడుతూ.. బౌలింగ్‌లో తాను మెరుగుపడటానికి ‘ప్రత్యేక’ వ్యక్తి శిక్షణ కారణమని పేర్కొన్నాడు. స్లో బౌన్సర్లతోనే కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఫలితం రాబట్టానని తెలిపాడు.

టీమిండియాకు శుభవార్తే
ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్‌ సునిల్‌ గావస్కర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డిని ప్రశంసించాడు. ‘‘అతడు వేగంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. బౌలింగ్‌కు మరికొంత పేస్‌ కూడా జతచేశాడు. అతడి బౌలింగ్‌ శైలి, లయ మెరుగుపడ్డాయి. పూర్తి ఫిట్‌గా ఉన్నందు వల్లే అతడికి ఇది సాధ్యమైంది.

తన ఫిజికల్‌ ట్రెయినర్‌కు అతడు క్రెడిట్‌ ఇచ్చాడు. అతడు ఫిట్‌గా ఉండటమే అతిపెద్ద సానుకూలాంశం. అతడు బౌన్స్‌ కూడా రాబట్టగలుగుతున్నాడు. నితీశ్‌ రెడ్డి ఇలా రాణించడం టీమిండియాకు శుభవార్తే అవుతుంది’’ అని గావస్కర్‌ కొనియాడాడు.

కాగా సన్‌రైజర్స్‌ తరఫున సత్తా చాటి వెలుగులోకి వచ్చిన నితీశ్‌ రెడ్డి.. అనతికాలంలోనే మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. అరుదైన పేస్‌ బౌలింగ్‌ నైపుణ్యాలున్న హార్దిక్‌ పాండ్యా వారసుడిగా నీరాజనాలు అందుకున్నాడు. ఇలాంటి దశలో గాయాలు, ఫిట్‌నెస్‌ సమస్యల కారణంగా కాస్త వెనుకబడినా.. తిరిగి నిలదొక్కుకునే దిశగా ముందుకు సాగుతున్నాడు.

చదవండి: ‘ధోని ఎక్కడి నుంచో వచ్చాడు.. రో-కోలకు ముఖం మీదే చెప్పేయండి’: యువీ

Advertisement
 
Advertisement
Advertisement