‘ప్రత్యేక వ్యక్తి’ కృషి వల్లే... | Nitish Kumar Reddy says bowling has improved | Sakshi
Sakshi News home page

‘ప్రత్యేక వ్యక్తి’ కృషి వల్లే...

Apr 4 2026 4:20 AM | Updated on Apr 4 2026 4:20 AM

Nitish Kumar Reddy says bowling has improved

బౌలింగ్‌ మెరుగైందన్న నితీశ్‌ రెడ్డి 

అతని పేరు తర్వాత వెల్లడిస్తానని వ్యాఖ్య

కోల్‌కతా: తన బౌలింగ్‌ మెరుగుపడటం వెనుక ఒక ప్రత్యేక వ్యక్తి ఉన్నాడని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేస్‌ ఆల్‌రౌండర్, ఆంధ్ర క్రికెటర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడించాడు. గాయాలతో ఇబ్బంది పడిన సమయంలో అతడి అండతోనే తిరిగి కోలుకొని బౌలింగ్‌ లయను అందుకోగలిగానని చెప్పాడు. ఐపీఎల్‌ 19వ సీజన్‌లో భాగంగా గురువారం ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నితీశ్‌ రెడ్డి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 

తొలుత బ్యాటింగ్‌లో ఐదో స్థానంలో బరిలోకి దిగి 24 బంతుల్లో 39 పరుగులు చేసిన ఈ ఆంధ్ర ప్లేయర్‌... ఆ తర్వాత బౌలింగ్‌లో 2 ఓవర్లు వేసి 17 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అందులో నైట్‌రైడర్స్‌ వైస్‌ కెప్టెన్‌ రింకూ సింగ్‌ వికెట్‌ కూడా ఉంది. ఆ్రస్టేలియా పర్యటనలో భాగంగా మెల్‌బోర్న్‌ టెస్టులో సెంచరీతో ఆకట్టుకున్న నితీశ్‌... ఆ తర్వాత తక్కువ కాలంలోనే మూడు ఫార్మాట్‌లలోనూ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. హార్దిక్‌ పాండ్యా తరహాలో టీమిండియాకు పేస్‌ ఆల్‌రౌండర్‌ లభించినట్లే అనుకుంటున్న దశలో గాయాలు, ఫిట్‌నెస్‌ సమస్యలు అతడిని వెనక్కి లాగాయి. 

గత ఐపీఎల్‌ సీజన్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన 22 ఏళ్ల నితీశ్‌... కోల్‌కతాతో పోరులో చక్కటి ప్రదర్శన కనబర్చాడు. మ్యాచ్‌ అనంతరం నితీశ్‌ మాట్లాడుతూ... ‘బౌలింగ్‌ను మరింత మెరుగు పరుచుకునేందుకు ఎప్పుడూ ప్రయతి్నస్తూనే ఉంటా. అయితే గతేడాది గాయాల కారణంగా ఎక్కువ సమయం లభించలేదు. ఈ సీజన్‌ ఆరంభానికి ముందు దొరికిన కొద్దిపాటి సమయంలో బాగా శ్రమించా. ఓ ప్రత్యేక వ్యక్తి పర్యవేక్షణలో ప్రాక్టీస్‌ చేశాను. అది ఎంతగానో ఉపయోగపడింది’ అని అన్నాడు.  

‘స్లో బౌన్సర్ల’తోనే ఫలితం... 
అయితే ఆ ‘స్పెషల్‌ పర్సన్‌’ పేరు మాత్రం నితీశ్‌ వెల్లడించలేదు. ‘ఆ వ్యక్తి ఎవరో తర్వాత చెప్తా. కోల్‌కతాతో మ్యాచ్‌లో మా ఓపెనర్లు చక్కటి ఆరంభం ఇచ్చారు. క్లాసెన్‌తో కలిసి బ్యాటింగ్‌ చేయడం గొప్ప అనుభూతి. దక్షిణాఫ్రికా సీనియర్‌ ప్లేయర్‌ మీకు సలహాలు ఇస్తుంటే దాని ఫలితం రాకపోదు. అందుకే మా భాగస్వామ్యం బాగా సాగింది. సీనియర్‌లు జట్టులో ఉంటే ఇలాంటి ప్రయోజనం చేకూరుతుంది. మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులను వారు ఇంతకుముందే అధిగమించి ఉంటారు. వారి సలహాలు ఎంతగానో ఉపయోగపడతాయి. 

‘స్లో బాల్స్‌’తోనే ఫలితం ఉంటుందని బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడే అర్థమైంది. అందుకే బౌలింగ్‌కు వచ్చినప్పుడు అదే ప్రయత్నించా. స్లో బౌన్సర్‌ ద్వారానే రింకూ వికెట్‌ పడగొట్టా. నెమ్మదైన బంతులతో ప్రత్యర్థిని బోల్తా కొట్టించడం నా బలం. దాన్నే వినియోగించా. మా బౌలింగ్‌లో కావాల్సినంత వైవిధ్యం ఉంది. జైదేవ్‌ ఉనాద్కట్‌కు ఎంతో అనుభవం ఉంది. ఇషాన్‌ మలింగ, డేవిడ్‌ పేన్‌ రూపంలో మంచి బౌలర్లు అందుబాటులో ఉన్నారు. బ్యాటింగ్‌లో మా జట్టు పటిష్టంగా ఉందనేది వాస్తవం. అలాగే బౌలింగ్‌లోనూ మాకు చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఉప్పల్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు సహకరిస్తుంది. అక్కడ బౌలింగ్‌ చేయడం ఎవరికైనా కష్టమే’ అని నితీశ్‌ రెడ్డి వివరించాడు. 

చాలా కాలంగా ఎదురు చూశా... 
జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడంపై నితీశ్‌ రెడ్డి స్పందిస్తూ... ‘చాన్నాళ్లుగా ఇలాంటి ప్రదర్శన కోసం ఎదురుచూస్తున్నా. సరైన సమయంలో అది వచ్చింది. బౌలింగ్‌లో మెరుగవడం నా ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించింది. గతేడాది ఆశించిన స్థాయిలో ఆడలేకపోయా. దీంతో మనసులో ఎన్నో ఆలోచనలు వచ్చాయి. కానీ అవన్నీ పక్కనపెట్టి నా బలాన్ని నమ్ముకున్నా. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నా. ఫిన్‌ అలెన్‌ ఎంత ప్రమాదకర ఆటగాడో అందరికీ తెలుసు. చూస్తుండగానే మ్యాచ్‌ను మార్చేసే ప్లేయర్‌ అతడు. అతడి వికెట్‌ ఆరంభంలోనే తీయడం కలిసొచ్చింది’ అని తెలిపాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement