BCCI: రోహిత్‌, కోహ్లికి ముఖం మీదే చెప్పేయండి: యువీ | Rohit Kohli deserve clarity from management And Dhoni Come From: Yuvraj | Sakshi
Sakshi News home page

‘ధోని ఎక్కడి నుంచో వచ్చాడు.. రో-కోలకు ముఖం మీదే చెప్పేయండి’

Apr 4 2026 11:50 AM | Updated on Apr 4 2026 12:39 PM

Rohit Kohli deserve clarity from management And Dhoni Come From: Yuvraj

టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజాలు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మను ఉద్దేశించి లెజెండరీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్‌కప్‌-2027లో ఆడించే విషయంలో యాజమాన్యం (బీసీసీఐ) వీరిద్దరికి ఇప్పుడే స్పష్టతనిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.

ప్రపంచకప్‌ ఆడటమే లక్ష్యంగా
కాగా టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత రో-కో (Rohit Sharma- Virat Kohli) అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అనూహ్య రీతిలో గతేడాది రోజుల వ్యవధిలోనే వీరిద్దరు టెస్టులకూ గుడ్‌బై చెప్పేశారు. ప్రస్తుతం వన్డేల్లో కొనసాగుతున్న రోహిత్‌- కోహ్లి ప్రపంచకప్‌ ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

అయితే, రోహిత్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన క్రమంలో చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ రో-కో భవితవ్యం గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. వీరిద్దరు వరల్డ్‌కప్‌ ఆడేందుకు కట్టుబడి ఉన్నారో లేదో తమకు తెలియదన్నాడు. అయితే, రో-కో మాత్రం ఇందుకు భిన్నంగా సూపర్‌ ఫామ్‌తో ముందుకు సాగుతూ తమ లక్ష్యం ఏమిటో ఆటతోనే చెప్పకనే చెబుతున్నారు.

తుది నిర్ణయం సెలక్టర్లదే
ఈ పరిణామాల గురించి యువరాజ్‌ సింగ్‌ తాజాగా స్పందించాడు. స్పోర్ట్స్‌ తక్‌ చానెల్‌తో మాట్లాడుతూ.. ‘‘రోహిత్‌- కోహ్లి ఆలోచన ఏమిటో నాకైతే తెలియదు. అయితే, ఈ ఇద్దరూ కూడా వరల్డ్‌కప్‌ ఆడేందుకు నిబద్ధతతో పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, వారిని ఆడించాలా? లేదా? అన్న నిర్ణయం మాత్రం సెలక్టర్లదే.

నిజం నిష్ఠూరంగా ఉన్నా.. 
వీరిద్దరి భవితవ్యాన్ని నిర్ణయించేంది సెలక్టర్లే. నా అభిప్రాయం ప్రకారం వారిద్దరు గొప్ప ఆటగాళ్లు. అయితే, వరల్డ్‌ ఆడించే విషయంలో మేనేజ్‌మెంట్‌ వారికి స్పష్టతనిస్తే మంచిది. ఇలాంటి విషయాల గురించి ఆటగాళ్లతో మనస్ఫూర్తిగా చర్చించాలి.

ముఖ్యంగా ఇద్దరూ కెరీర్‌ చరమాంకంలో ఉన్నారు. కాబట్టి వారి విషయంలో నిజం నిష్ఠూరంగా ఉన్నా.. ముందుగానే ముఖం మీద చెప్పేస్తే బాగుంటుంది. కాకపోతే భారత క్రికెట్‌లో ఇలా జరగడం లేదు’’ అని యువీ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు.

ఎక్కడి నుంచో వచ్చి ధోనీ కెప్టెన్‌ అయ్యాడు 
ఇక టీమిండియా యాజమాన్య వైఖరిని ఈ సందర్భంగా యువీ గుర్తు చేసుకున్నాడు. కెప్టెన్‌ ఎంపిక అంచనాలకు అందకుండా సాగుతుందని పేర్కొన్నాడు. తాను టీమిండియాకు వైస్‌కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సమయంలో జట్టులో సీనియర్‌ ప్లేయర్లు ఉన్నప్పటికీ... అనూహ్యంగా ధోనీని భారత జట్టు కెప్టెన్‌గా ఎంపిక చేసిన విషయాన్ని యువీ గుర్తు చేసుకున్నాడు.

తాజాగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌... ప్యాట్‌ కమిన్స్‌ గైర్హాజరీలో జట్టు పగ్గాలు అభిషేక్‌ శర్మకు కాకుండా ఇషాన్‌ కిషన్‌కు అప్పగించిన నేపథ్యంలో యువీ మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

‘ఈ నిర్ణయం నన్ను నిరాశ పరిచింది. దీన్ని ఒక ఆటగాడి కోణం నుంచి చూస్తే... ఉదాహరణకు ఒక ఆటగాడు ప్రపంచకప్‌నకు ముందు చక్కటి ఫామ్‌తో తన రాష్ట్ర జట్టు తరఫున సత్తా చాటి వరల్డ్‌కప్‌నకు ఎంపికయ్యాడు.

అక్కడ కూడా మెరుగైన ప్రదర్శనతో జట్టుకు వరల్డ్‌కప్‌ అందించాడు. అలాంటి ప్లేయర్‌ను ఫ్రాంచైజీ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. మరోవైపు ఏడేళ్లుగా ఒక ప్లేయర్‌ ఆ ఫ్రాంచైజీ కోసం ప్రాణం పెట్టి అద్భుతంగా ఆడుతున్నాడు. 

ఇలాంటి అనుభవం నాకు కూడా జరిగింది
అయినప్పటికీ అతడికి జట్టు కెప్టెన్‌ పదవి కాకుండా వైస్‌కెప్టెన్‌ పదవి దక్కింది. మైదానంలో అడుగు పెట్టినప్పుడు అతడి మానసిక స్థితి ఎలా ఉంటుంది. ఇలాంటి అనుభవం నాకు కూడా జరిగింది.

నేను భారత జట్టుకు వైస్‌కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సమయంలో హర్భజన్, సెహ్వాగ్‌ వంటి సీనియర్‌లు జట్టులో ఉన్నా... ఎక్కడి నుంచో వచ్చి ధోని కెపె్టన్‌ అయ్యాడు. కారణాలు ఏవైనా మీరు భారత కెప్టెన్‌గా ఉంటారా లేదా అనేది ఫ్రాంచైజీ క్రికెట్‌ నిర్ణయించదు. 

కానీ ఆటగాడి కోణం నుంచి చూస్తే ఇది నిరాశ కలిగించే అంశం’ అని యువరాజ్‌ అన్నాడు. 2007లో జట్టులో సీనియర్‌ ప్లేయర్లు ఉన్నప్పటికీ ధోనీకి అనూహ్యంగా జట్టు పగ్గాలు అప్పజెప్పడంపై యువీ ఈ పరోక్ష వ్యాఖ్యలు చేశాడు.  

చదవండి: ఎంతపని చేశావ్‌ అయ్యర్‌.. పంజాబ్ జ‌ట్టుకు షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement