హోబర్ట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో 5 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో భారత్ సమం చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.
టిమ్ డేవిడ్(38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 74), మార్కస్ స్టోయినిష్(39 బంతుల్లో 8 ఫోర్లు,2 సిక్స్‌లతో 64) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి రెండు, శివమ్ దూబే ఒక్క వికెట్ సాధించారు.
వాషింగ్టన్ విశ్వరూపం..
అనంతరం 187 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఈ విజయంలో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ది కీలక పాత్ర. లక్ష్య చేధనలో భారత జట్టు 111 పరుగులకు నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన సుందర్.. ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.
అయితే జితేష్ శర్మ, శివమ్ దూబే వంటి పవర్ హిట్టర్‌ల కంటే ముందు సుందర్‌ను బ్యాటింగ్‌కు పంపడంపై విమర్శలు వచ్చాయి. కానీ విమర్శకులకు తన బ్యాటింగ్‌తోనే సుందర్ సమాధానమిచ్చాడు. తాను ఎదుర్కొన్న రెండో బంతినే సిక్సర్‌గా మలిచాడు.
ఆ తర్వాత 14 ఓవర్ వేసిన సీన్ అబాట్ బౌలింగ్‌లో సుందర్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఆ ఓవర్‌లో సుందర్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో మొత్తంగా 19 పరుగులు పిండుకున్నాడు. మూడు పరుగులు సింగిల్స్ రూపంలో వచ్చాయి. అబాట్ ఓవర్‌తో గేమ్ భారత్ వైపు మలుపు తిరిగింది.
ఆ తర్వాత కూడా సుందర్ తన జోరును కొనసాగించాడు. ఆఖరి వరకు క్రీజులో నిలబడిన సుందర్.. జితేష్ శర్మతో కలిసి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఓవరాల్‌గా 23 బంతులు ఎదుర్కొన్న సుందర్.. 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 49 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా కుల్దీప్ యాదవ్‌ను పక్కన పెట్టి సుందర్‌ను తుది జట్టులోకి తీసుకోవడాన్ని చాలా మంది తప్పుబట్టారు.
అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో సుందర్‌తో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయించలేదు. మెనెజ్‌మెంట్ అతడిని స్పెషలిస్ట్ బ్యాటర్‌గా జట్టుగా తీసుకుంది. సుందర్ స్పెషలిస్ట్ బ్యాటర్ ఎలా అవుతాడంటూ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను ట్రోలు చేశారు. కానీ సుందర్ మాత్రం తన అద్భుత బ్యాటింగ్‌తో గంభీర్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.


