బ్రెయిన్‌స్ట్రోక్‌?.. స్పందించిన వినోద్‌ కాంబ్లీ భార్య | Vinod Kambli Wife Left Fuming Over Claims Over Ex Cricketer Health | Sakshi
Sakshi News home page

నా భర్త గురించి తప్పుడు ప్రచారం: వినోద్‌ కాంబ్లీ భార్య

Apr 17 2026 1:18 PM | Updated on Apr 17 2026 2:12 PM

Vinod Kambli Wife Left Fuming Over Claims Over Ex Cricketer Health

తన భర్త గురించి తప్పుడు ప్రచారం చేయొద్దని టీమిండియా మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ భార్య ఆండ్రియా హెవిట్‌ విజ్ఞప్తి చేసింది. దేవుడి దయ వల్ల వినోద్‌ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపింది. కాగా గత కొంతకాలంగా వినోద్‌ కాంబ్లీ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే.

మూత్రనాళ ఇన్ఫెక్షన్‌తో 2024, డిసెంబరులో థానే ఆస్పత్రిలో చికిత్స పొందాడు కాంబ్లీ. ఆ సమయంలో టీమిండియా మాజీ క్రికెటర్లు అతడికి ఆర్థికంగా అండగా నిలిచారు. అతిగా మద్యం సేవించడం, పొగ త్రాగడం వల్లే తనకు అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు కాంబ్లీ గతంలో స్వయంగా వెల్లడించాడు.

మెదడులో రక్తం గడ్డకట్టిందని..
ఈ పరిణామాల నేపథ్యంలో వినోద్‌ కాంబ్లీ స్నేహితుడు, ఫస్ల్‌క్లాస్‌ క్రికెట్‌ మాజీ అంపైర్‌ మార్కస్‌ కౌట్‌ ఇటీవల హిందుస్తాన్‌ టైమ్స్‌తో మాట్లాడుతూ.. షాకింగ్‌ విషయాలు వెల్లడించాడు. కాంబ్లీ మెదడులో రక్తం గడ్డకట్టిందని.. ఏ క్షణమైనా బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్పారన్నాడు.

ఇక కాంబ్లీ ఇప్పటికీ పొగతాగే అలవాటు మానుకోలేకపోతున్నట్లు మార్కస్‌ వెల్లడించాడు. అంతేకాదు అతడికి ఆర్థికంగా సాయం అందించేందుకు తాను వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసినట్లు తెలిపాడు. ఇందులో ఎంతో మంది మాజీ క్రికెటర్లు ఉన్నారని.. సచిన్‌ టెండుల్కర్‌ కూడా ఇందులో భాగమని తెలిపాడు.

ఫీజు లేకుండా శిక్షణ
అదే విధంగా.. ‘‘కాంబ్లీ కర్ర సాయంతో నడుస్తున్నాడు. అతడి కుమారుడు క్రిస్టియానో క్రికెటర్‌ కావాలని కోరుకుంటున్నాడు. ‍క్రిస్టియానోను అకాడమీలో చేర్చుకోవాల్సిందిగా జతిన్‌ పరాంజపేను కోరాను. అందుకు అతడు అంగీకరించాడు. కాంబ్లీ కుమారుడికి అతడికి అకాడమీలో ఫీజు లేకుండా శిక్షణ లభిస్తుంది’’ అని మార్కస్‌ పేర్కొన్నాడు.

వినోద్‌ బాగానే ఉన్నాడు
ఈ క్రమంలో వినోద్‌ కాంబ్లీ భార్య ఆండ్రియా హెవిట్‌ తాజాగా స్పందించింది. ఇండియా టుడేతో మాట్లాడుతూ.. మార్కస్‌ వ్యాఖ్యలను కొట్టిపారేసింది. ‘‘దేవుడి దయవల్ల వినోద్‌ బాగానే ఉన్నాడు. కానీ అతడి ఆరోగ్యం గురించి ఎవరు ఇలా దుష్ఫ్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదు’’ అని ఆండ్రియా హెవిట్‌ వాపోయింది.

చదవండి: T20 WC 2026: మ్యాచ్‌ ఫిక్సింగ్‌!.. రంగంలోకి ఐసీసీ

Advertisement
 
Advertisement
Advertisement