'ఇప్పట్లో కష్టమే.. అది నా చేతుల్లో లేదు'

Vijay Shankar Says I think Done better But It Not My Hands India Comeback - Sakshi

ఢిల్లీ: జీవితంలో క్షణం ఆలస్యం చేసినా జాతకాలు మారిపోతుంటాయి. ఇది అందరికి వర్తిస్తుందో లేదో తెలియదు గానీ టీమిండియా క్రికెటర్‌ విజయ్‌ శంకర్‌ విషయంలో మాత్రం అది నిజమనిపిస్తుంది. 2019 ప్రపంచకప్‌కు త్రీ డైమన్షనల్‌ ప్లేయర్‌ అంటూ విజయ్‌ శంకర్‌ను సెలెక్ట​ చేయడం అప్పట్లో టీమిండియా సెలెక్షన్‌ కమిటీపై విమర్శలు వచ్చేలా చేసింది. దానికి తోడు విజయ్‌ శంకర్‌ అప్పటి ప్రపంచకప్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో ఇతనేనా మీ త్రీ డైమన్షనల్‌ ప్లేయర్‌.. త్రీడీ కళ్లద్దాలు పెట్టుకున్నా అతని ఇన్నింగ్స్‌ ఒక్కటి కనిపించలేదు అంటూ అభిమానులు ట్రోల్‌ చేశారు. ఈ ఒక్క దెబ్బతో  విజయ్‌ శంకర్‌ ఇప్పటివరకు మళ్లీ టీమిండియా తరపున ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేకపోయాడు.

తాజాగా విజయ్‌ శంకర్‌ను ఇండియా టుడే ఇంటర్య్వూ చేసింది. మిమ్మల్ని మళ్లీ టీమిండియాలో చూస్తామా అని అడిగిన ప్రశ్నకు అతను ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు.''ఇప్పట్లో కష్టమే కావొచ్చు.. కానీ అది నా చేతుల్లో లేదు. నేను ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నాను. అయితే టీమిండియాకు అరంగేట్రం చేసే సమయంలోను గాయాలు నన్ను ఇబ్బంది పెట్టాయి. ఒక సిరీస్‌లో మంచిగా  ఆడుతున్న అన్న దశలో ఏదో ఒక గాయంతో జట్టుకు దూరమయ్యాను. టీమిండియాకు ఆడిన అన్ని సందర్భాల్లో మంచి ప్రదర్శనే నమోదు చేశా. విధి నాతో ఆడుకుంది.. కెరీర్‌ మొత్తంలో నాకు గాయాలే ఎక్కువగా కనిపించాయి. నేను మ్యాచ్‌లో బరిలోకి దిగిన ప్రతీసారి నా హార్డ్‌వర్క్‌ను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పటికీ నాకు అవకాశాలు మిగిలే ఉన్నాయి. నా ప్రయత్నం నేను చేస్తా.. కానీ ఎంపిక అనేది నా చేతుల్లో లేదు'' అని చెప్పుకొచ్చాడు.  

నిజానికి 2016లోనే విజయ్‌ శంకర్‌ టీమిండియాలోకి అరంగేట్రం చేయాల్సింది. కానీ హార్దిక్‌ పాండ్యా రూపంలో అతనికి దురదృష్టం ఎదురైంది. ఆ తర్వాత మళ్లీ టీమిండియా తలుపు తట్టేందుకు రెండేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. 2018లో నిదహాస్‌ ట్రోపీలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఆ ట్రోపీలో ఒక మ్యాచ్‌లో రెండు కీలక వికెట్లు తీయడం ద్వారా  మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆ తర్వాత 2019 ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా హార్దిక్‌ పాండ్యా స్థానంలో అవకాశం లభించింది. అలా వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది.

2019 ప్రపంచకప్‌ సెలక్షన్‌ సందర్భంగా ఎంఎస్‌కే ప్రసాద్‌ విజయ్‌ శంకర్‌ గురించి చేసిన వ్యాఖ్యలు తర్వాత శంకర్‌ను ఇబ్బంది పెట్టేలా ఉంటుందని బహుశా ఊహించి ఉండడు. రైనా, కార్తీక్‌లతో పాటు మంచి ఫాంలో ఉన్న అంబటి రాయుడును కాదని విజయ్‌ శంకర్‌కే ఓటు వేశారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా అన్ని విభాగాల్లో విజయ్‌ శంకర్‌ కరెక్టుగా సరితూగాడని.. అతను మల్టీ డైమన్షన్‌ ప్లేయర్‌ అంటూ ప్రసాద్‌ మీడియాకు తెలిపాడు.

అయితే విజయ్‌ శంకర్‌ను ప్రపంచకప్‌కు ఎంపికచేయడం చాలా మంది భారత అభిమానులకు ఇష్టం లేదు. పైగా విజయ్‌ శంకర్‌ ఆ ప్రపంచకప్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. ఇక ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న శంకర్‌ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. నానాటికీ అతని ఆటతీరు మరీ ఘోరంగా తయారవ్వడం కనిపించింది. ఇలాంటి చెత్త ప్రదర్శనతో అతను మళ్లీ టీమిండియాలోకి అడుగుపెట్టడం కష్టమే. ఇక టీమిండియా తరపున విజయ్‌ శంకర్‌ 12 వన్డేల్లో 223 పరుగులు.. 4 వికెట్లు, 9 టీ20ల్లో 101 పరుగులు.. 5 వికెట్లు తీశాడు.
చదవండి: పృథ్వీ షాకు చేదు అనుభవం.. అడ్డుకున్న పోలీసులు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top