ఐపీఎల్‌కు స్టార్‌ ఆల్‌రౌండర్‌ రిటైర్మెంట్‌ | Vijay Shankar retires from Indian domestic cricket and the IPL | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌కు స్టార్‌ ఆల్‌రౌండర్‌ రిటైర్మెంట్‌

May 23 2026 7:34 AM | Updated on May 23 2026 7:34 AM

Vijay Shankar retires from Indian domestic cricket and the IPL

భారత క్రికెట్‌లో 3D ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న తమిళనాడు ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కూ వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ఈ నిర్ణయంతో ఇకపై విదేశీ ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడేందుకు ఆయనకు మార్గం సుగమమైంది. 35 ఏళ్ల విజయ్‌ శంకర్‌ తన రిటైర్మెంట్‌ ప్రకటనలో (ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టు) యువర్‌ 3D క్రికెటర్‌ అంటూ సంతకం చేయడం విశేషం.  

2019 వన్డే ప్రపంచకప్‌ సమయంలో విజయ్‌ శంకర్‌ను త్రిముఖ ప్రతిభ కలిగిన ఆటగాడంటూ టీమిండియాకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో విఫలం కావడంతో అభిమానులు విజయ్‌ను వ్యంగ్యంగా 3D ప్లేయర్‌ అంటూ సంబోధించడం ప్రారంభించారు.

విజయ్‌ భారత్‌ తరఫున 12 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌లు 324 పరుగులు, 9 వికెట్లు తీశాడు. కుడి చేతి వాటం మిడిలార్డర్‌ బ్యాటర్‌, రైట్‌ ఆర్మ్‌ మీడియం బౌలర్‌ అయిన విజయ్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 4253 పరుగులు, లిస్ట్‌-ఏలో 2790, టీ20ల్లో 2583 పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 154 వికెట్లు కూడా తీశాడు.

తమిళనాడు జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించిన విజయ్‌.. విజయ్‌ హజారే ట్రోఫీ, దేవధర్‌ ట్రోఫీ, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలను గెలిపించాడు. 2025-26 సీజన్‌కు ముందు విజయ్‌ త్రిపుర జట్టుకు మారాడు. విజయ్‌ తన చివరి రంజీ మ్యాచ్‌లో గుజరాత్‌పై అజేయంగా 151 పరుగులు చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

విజయ్‌ ఐపీఎల్‌ ప్రస్తానాన్ని పరిశీలిస్తే..  2014 అరంగేట్రం చేసిన ఇతగాడు.. 2025 వరకు 78 మ్యాచ్‌లు ఆడి 1233 పరుగులు, 9 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌ కెరీర్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించిన విజయ్‌ను.. 2026 సీజన్‌ వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. గత సీజన్‌ విజయ్‌ సీఎస్‌కేకు ప్రాతినిథ్యం వహించి 6 మ్యాచ్‌ల్లో 118 పరుగులతో పర్వాలేదనిపించాడు.

2019 ప్రపంచకప్‌కు ముందు అంబటి రాయుడిని పక్కనపెట్టి విజయ్‌ శంకర్‌ను ఎంపిక చేయడం అప్పట్లో భారీ చర్చకు దారితీసింది. మూడు డైమెన్షన్లు ఉన్న ఆటగాడు అంటూ నాటి సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ చెప్పిన మాటలు పెద్ద వివాదమయ్యాయి. రాయుడు 3D గ్లాసెస్‌ ఆర్డర్‌ చేశా అంటూ వ్యంగ్య ట్వీట్‌ చేయడం అప్పట్లో వైరల్‌గా మారింది.

 

Advertisement
 
Advertisement
Advertisement