వుమెన్స్‌ ఐపీఎల్‌ మీడియా రైట్స్‌కు ఊహించని భారీ ధర

Viacom18 Bags Womens IPL Media Rights For 951 Crore For 2023 27 Season - Sakshi

Women's IPL Media Rights: 2023-27 మహిళల ఐపీఎల్‌ సీజన్‌కు సంబంధించిన మీడియా హక్కులను వయాకామ్‌18 సంస్థ రికార్డు ధర (రూ.951 కోట్లు) కోట్‌ చేసి దక్కించుకుంది. బిడ్డింగ్‌లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌, సోనీ నెట్‌వర్క్, అమెజాన్ ప్రైమ్ వంటి బడా కంపెనీలు పోటీ పడినప్పటికీ వయాకామ్‌18 ఎంతమాత్రం ​తగ్గకుండా టీవీ, డిజిటల్ ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు. వయాకామ్‌18 సంస్థ భారీ మొత్తాన్ని చెల్లించి వుమెన్స్‌ ఐపీఎల్‌ మీడియా రైట్స్‌ను సొంతం చేసుకోవడం శుభపరిణామమని, ఇది మహిళా క్రికెట్‌ అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుందని షా ట్వీట్ చేశాడు.

కాగా, మహిళల ఐపీఎల్‌ను బీసీసీఐ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఏడాది (2023) నుంచే ప్రవేశపెట్టాలని డిసైడైన విషయం తెలిసిందే. అరంగేట్రం సీజన్‌లో మొత్తం ఐదు ఫ్రాంచైజీలు బరిలోకి దిగబోతున్నాయి. ఈ ఫ్రాంచైజీలను కొనుగోలు చేసేందుకు ఐపీఎల్‌ యాజమాన్యాలు తెగ ఆసక్తి చూపుతున్నాయి. క్రికెటర్ల వేలం ప్రక్రియకు సంబంధించిన తేదీలు త్వరలోనే వెలువడనున్నాయి. క్రికెటర్లు వేలంలో తమ పేర్లు నమోదు చేసుకునేందుకు జనవరి 26 ఆఖరి తేదీగా ఉంది. మహిళల ఐపీఎల్‌ మీడియా రైట్స్‌ వేలం ద్వారా బీసీసీఐకి ఒక్కో మ్యాచ్‌కు రూ.7.09 కోట్ల ఆదాయం సమకూరనుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top