ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన రికార్డుల వేటను కొనసాగిస్తున్నాడు. ఈ ధనాధన్ లీగ్‌లో భాగంగా మంగళవారం ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.
అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను వైభవ్ ఉతికారేశాడు. ఈ బిహార్ కుర్రాడు కేవలం 16 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. ఈ తుఫాన్ ఇన్నింగ్స్‌తో ప్రస్తుత సీజన్‌లో వైభవ్ 400 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను వైభవ్ తన పేరిట లిఖించుకున్నాడు.
వైభవ్ సరికొత్త చరిత్ర
👉ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్‌లో అత్యంత వేగంగా 400 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా సూర్యవంశీ రికార్డులకెక్కాడు. వైభవ్ ఈ ఫీట్‌ను కేవలం 167 బంతుల్లో మాత్రమే సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు కోల్‌కతా నైట్‌రైడర్స్ దిగ్గంజ ఆండ్రీ రస్సెల్ పేరిట ఉండేది. 2019 సీజన్‌లో రస్సెల్ 188 బంతుల్లో 400 పరుగులు సాధించాడు. తాజా మ్యాచ్‌తో రస్సెల్‌ను వైభవ్ అధిగమించాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలకు కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు.
👉అదేవిధంగా ఒకే సీజన్‌లో 400 పైగా పరుగులు చేసిన అత్యంత పిన్నవయష్కిడిగా తిలక్ వర్మ రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. తిలక్ 20 ఏళ్ల వయస్సులో ముంబై ఇండియన్స్ తరపున 2023 సీజన్‌లో ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇప్పుడు ఈ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు.
👉అలాగే ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాళ్ల జాబితాలో వైభవ్ ఇప్పటికే 37 సిక్సర్లతో రిషబ్ పంత్‌తో కలిసి సంయుక్తంగా ఐదవ స్థానంలో ఉన్నాడు. అభిషేక్ శర్మ (42), శ్రేయాస్ అయ్యర్ (39) అగ్రస్థానాల్లో ఉన్నారు.
ఇక ఓవరాల్‌గా ఈ ఏడాది సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన వైభవ్.. 238.10 స్ట్రైక్ రేటుతో 400 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ వైభవ్ వద్దే ఉంది.
చదవండి: IPL 2026: జైలుకు రియాన్ పరాగ్?


