Nick Kyrgios: వివాదం లేకుంటే మనసుకు పట్టదనుకుంటా.. నువ్వు మారవు!

US Open: Nick Kyrgios Smashes Tennis Racquet After Losing Quarter-final - Sakshi

ఆస్ట్రేలియా టెన్నిస్‌ స్టార్‌ నిక్‌ కిర్గియోస్‌ సహనం కోల్పోయాడు. ఓడిపోయాననే బాధలో టెన్నిస్‌ రాకెట్‌ను నేలకేసి కొట్టడం వైరల్‌గా మారింది. ఆట కంటే వివాదాలతోనే ఎక్కువ పేరు సంపాదించిన కిర్గియోస్‌ ఆన్‌ఫీల్డ్‌, ఆఫ్‌ ఫీల్డ్‌లో చాలాసార్లు తన కోపాన్ని ప్రదర్శించాడు. తాజాగా యూఎస్‌ ఓపెన్‌లో క్వార్టర్స్‌లోనే వెనుదిరగడంతో కిర్గియోస్‌లో కోపం కట్టలు తెంచుకుంది.

విషయంలోకి వెళితే.. భారత కాలమాన ప్రకారం మంగళవారం అర్థరాత్రి జరిగిన క్వార్టర్స్‌లో రష్యన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ కచనోవ్‌ చేతిలో 7-5, 4-6,7-5, 6-7(3-7)తో కిర్గియోస్‌ ఓటమి పాలయ్యాడు. దీంతో గ్రాండ్‌స్లామ్‌ కొట్టాలన్న అతని కల క్వార్టర్స్‌కే పరిమితం కావడంతో కోపం నషాళానికి అంటింది. ప్లేయర్‌కు, అంపైర్‌కు షేక్‌హ్యాండ్‌ ఇచ్చిన అనంతరం తన బ్యాగు వద్దకు వెళ్లిన కిర్గియోస్‌.. చేతిలోని రాకెట్‌ను కోపంతో నేలకేసి బాదాడు. అయినా కోపం తగ్గలేదనుకుంటా.. మరో టెన్నిస్‌ రాకెట్‌ను నేలకేసి కొట్టాడు. అనంతరం బ్యాగు వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

దీనికి సంబంధించిన వీడియోనూ ప్రాప్‌ స్వాప్‌ అనే సంస్థ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. ''కోపం నషాళానికి అంటింది.. కిర్గియోస్‌ తన రెండు రాకెట్లను ముక్కలు చేశాడు.'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. అయితే కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చిన నిక్‌ కిర్గియోస్‌ ఓటమిపై స్పందించాడు. ''నేను ఓడిపోవడం బాధ కలిగించింది. నేను గెలవాలని చాలా మంది మద్దతు ఇచ్చారు. కానీ వారి ఆశలను వమ్ము చేశాను. అందుకే కోపంతో టెన్నిస్‌ రాకెట్‌ను విరగొట్టాల్సి వచ్చింది. అయితే కచనోవ్‌ పోరాటం మెచ్చుకోదగినది. ఈరోజు అతనిలో ఒక ఫైటర్‌, వారియర్‌ కనిపించాడు. ఇక ముందు కూడా ఇదే పోరాట పటిమను కనబరిచి గ్రాండ్‌స్లామ్‌ నెగ్గాలని ఆశిస్తున్నా'' అంటూ పేర్కొన్నాడు.

ఇక సెమీస్‌కు చేరుకున్న కచనోవ్‌ నార్వేకు చెందిన కాస్పర్‌ రూడ్‌తో తలపడనున్నాడు. ఇప్పటికే నాదల్, మెద్వదేవ్‌లు వెనుదిరగ్గా.. తాజాగా కిర్గియోస్‌ కూడా క్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టడంతో​ యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ను ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

చదవండి: FIH Awards: ‘ఎఫ్‌ఐహెచ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు రేసులో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top