
400 మందికి పైగా పేర్లు నమోదు
ఆసక్తి చూపుతున్న విదేశీ షూటర్లు
న్యూఢిల్లీ: భారత షూటింగ్ లీగ్ (ఎస్‌ఎల్‌ఐ)లో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా షూటర్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న ఈ లీగ్ కోసం ఇప్పటి వరకు దేశవిదేశాలకు చెందిన 400 మందికి పైగా షూటర్లు పేర్లు నమోదు చేసుకున్నట్లు జాతీయ రైఫిల్ సంఘం (ఎన్‌ఆర్‌ఏఐ) బుధవారం వెల్లడించింది. ఇందులో కజకిస్తాన్, రష్యా, ఇరాన్, హంగేరి, క్రొయేషియా, అజర్‌బైజాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, గ్రెనెడా, ఇటలీ, ఆ్రస్టేలియా, ఆ్రస్టియా, సెర్బియా, అమెరికా, స్పెయిన్, థాయ్‌లాండ్, జర్మనీ, చెక్ రిపబ్లిక్, నార్వే, సాన్ మారినో, రొమానియా దేశాలకు చెందిన షూటర్లు ఉన్నారు.
తొలిసారి నిర్వహిస్తున్న ఈ లీగ్‌కు అనూహ్య స్పందన రావడం ఆనందంగా ఉందని ఎన్‌ఆర్‌ఏఐ అధ్యక్షుడు కాళికేశ్ నారాయణ్ సింగ్ పేర్కొన్నారు. ‘ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న భారత షూటింగ్ లీగ్ పై స్పష్టమైన అవగాహనతో ఉన్నాం. ప్రపంచ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నాం. భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలిచేవిధంగా సహృద్భావ వాతావరణంలో పోటీలు నిర్వహిస్తాం’ అని అన్నారు. జూలై వరకు పేర్లు నమోదు చేసుకునే ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు.
నవంబర్ 20 నుంచి డిసెంబర్ 2 వరకు ఎస్‌ఎల్‌ఐ తొలి సీజన్ జరిగే అవకాశం ఉంది. లీగ్‌లో పిస్టల్ విభాగంలో 10 మీటర్లు, 25 మీటర్లు... రైఫిల్ విభాగంలో 10 మీటర్లు, 50 మీటర్లు, ‘త్రీ’ పొజిషన్... షాట్‌గన్ విభాగంలో ట్రాప్, స్కీట్‌లో పోటీలు నిర్వహించనున్నారు. లీగ్‌లో కనీసం ఆరు జట్లు పాల్గొననుండగా... రెండు గ్రూప్‌లుగా విభజించి పోటీలు చేపట్టనున్నారు. ఆటగాళ్లను ఎలైట్ చాంపియన్స్, వరల్డ్ ఎలైట్, నేషనల్ చాంపియన్స్, యూత్ చాంపియన్స్ అనే నాలుగు కేటగిరీల్లో విభజించనున్నారు