
ఆసియా ఖండంలో టీమిండియా తర్వాత రెండో అత్యుత్తమ క్రికెట్ జట్టు ఏదనే అంశంపై గత కొంతకాలంగా డిబేట్స్ నడుస్తూ ఉన్నాయి. చాలామంది ఆ స్థానం శ్రీలంక లేదా పాకిస్తాన్ జట్లదిగా భావిస్తుంటారు.
అయితే ఈ భావన తప్పని ఆఫ్ఘనిస్తాన్ గతకొంతకాలంగా నిరూపిస్తూ వస్తుంది. పాక్, శ్రీలంక జట్లను ఇటీవలికాలంలో చాలాసార్లు ఓడించి, ఆసియాలో టీమిండియా తర్వాత తామే తోపులమని రుజువు చేసుకుంది.
అయినా ఎక్కడో, ఏ మూలనో ఆఫ్ఘనిస్తాన్ సామర్థ్యంపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అలాంటి వారికి తాజా ఉదంతం శాశ్వత సమాధానమిచ్చింది. ఆసియాలో టీమిండియా తర్వాత ఆఫ్ఘనిస్తానే అత్యుత్తమ జట్టని ఈ ఉదంతంతో తేటతెల్లమైంది.
యూఏఈ ట్రై సిరీస్‌లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 2) జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ పాక్‌ను చిత్తుగా ఓడించింది. అన్ని విభాగాల్లో పాక్ కంటే మెరుగైన ప్రదర్శనలు చేసి ఆసియాలో నంబర్-2 తామేనని మరోసారి రజువు చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌లో రాణించి, ఆతర్వాత తమ ప్రధాన బలమైన బౌలింగ్‌లో చెలరేగి ఓ మోస్తరు లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది.
ఈ దెబ్బతో ఆసియా నంబర్-2 జట్టేదన్న డిబేట్‌కు పుల్ స్టాప్ పడింది. టీమిండియా తర్వాత ఆఫ్ఘనిస్తానే తోపని నిరూపితమైంది. ఇంకా క్లారిటీ రావాలంటే ఆసియా కప్ వరకు వేచి చూడాలి. ఆ ఖండాంతర టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్.. భారత్ సహా పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్ తదితర జట్లను ఎదుర్కోనుంది. అక్కడ కూడా ఇదే ఫలితం పునరావృతమైతే ఆసియాలో నంబర్ 2 జట్టేదన్న డిస్కషన్ ఆపై జరుగదు.
మ్యాచ్ విషయానికొస్తే.. షార్జా వేదికగా నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ పాక్‌ను 18 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. సెదీఖుల్లా అటల్ (64), ఇబ్రహీం జద్రాన్ (65) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో ఫహీమ్ అష్రాఫ్ (4-0-27-4) అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
అనంతరం ఆఫ్ఘన్ బౌలర్లు చెలరేగడంతో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫజల్ హక్ ఫారూకీ, కెప్టెన్ రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ, నూర్ అహ్మద్ తలో 2 వికెట్లు తీసి పాక్‌ను దెబ్బకొట్టారు. పాక్ ఇన్నింగ్స్‌లో పదో నంబర్ ఆటగాడు హరీస్ రౌఫ్ చేసిన 34 పరుగులే అత్యధికం.