
ఆసియా కప్-2025లో పాల్గొన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టులో ఆ దేశంలో పుట్టినవారు కాకుండా వలస వచ్చిన ఆటగాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ఐదుగురు భారత్‌కు చెందినవారు కాగా, మరో ఐదుగురు పాకిస్తానీలు.
ఇక ఈ టోర్నీలో టీమిండియా- పాక్ జట్ల మధ్య తాజా ‘షేక్ హ్యాండ్’ వివాదం నేపథ్యంలో యూఏఈ టీమ్‌లో ఉన్న ఇరు దేశాల క్రికెటర్ల మధ్య సంబంధాలపై కూడా చర్చ జరిగింది. అయితే కెప్టెన్ మొహమ్మద్ వసీమ్ ఈ మొత్తం అంశాన్ని తేలిగ్గా కొట్టిపారేశాడు. భారత్, పాక్ మధ్య ఏం జరిగినా తమకు సంబంధం లేదని, తామంతా యూఏఈ జట్టు ఆటగాళ్లం మాత్రమేనని అతడు స్పష్టం చేశాడు.
ఇక వసీమ్ స్వయంగా పాకిస్తాన్‌లోని ముల్తాన్‌కు చెందిన వాడు కాగా...హైదర్ అలీ, జునైద్, రోహిద్, ఆసిఫ్ ఇతర పాకిస్తాన్ క్రికెటర్లు. భారత్‌కు చెందిన సిమ్రన్‌జీత్ సింగ్, రాహుల్ చోప్రా, హర్షిత్ కౌశిక్, ధ్రువ్ పరాశర్, అలీషాన్ షరఫు టీమ్‌లో కీలక సభ్యులు.
‘యూఏఈ టీమ్ సభ్యులంతా ఒక కుటుంబ సభ్యుల్లాంటివాళ్లం. ఎవరూ భారతీయుడు కాదు, ఎవరూ పాకిస్తానీ కాదు. భారత్, పాక్ వివాదానికి సంబంధించి మా జట్టులో అసలు ఎలాంటి చర్చా జరగలేదు, జరగదు కూడా. మా టీమ్ సభ్యులంతా కలిసి ఎంతో క్రికెట్ ఆడాం. ఒకే కుటుంబంలాగే ఉంటూ ఒకే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాం’ అని వసీమ్ వ్యాఖ్యానించాడు.
ఇదిలా ఉంటే.. రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌తో విభేదాల నేపథ్యంలో బుధవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌కు పాక్ టీమ్ చాలా ఆలస్యంగా వచ్చిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం యూఏఈ అప్పీల్ చేస్తే పాక్ వాకోవర్ ఇచ్చినట్లుగా ప్రకటించి యూఏఈని విజేతగా ఖరారు చేయవచ్చు.
అయితే తమకు అలాంటి ఆలోచన ఏమాత్రం రాలేదని మొహమ్మద్ వసీమ్ వెల్లడించాడు. ఇక యూఏఈపై విజయంతో.. టీమిండియాతో పాటు పాక్‌కు సూపర్-4 దశకు అర్హత సాధించిది. గ్రూప్-ఎ నుంచి దాయాదులు తదుపరి దశకు క్వాలిఫై కాగా.. యూఏఈ, ఒమన్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. అయితే, ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీలో యూఏఈ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది.