లక్నో కోచ్‌, గోయెంకా సీరియస్‌!.. పంత్‌ వివరణ ఇచ్చినా.. | Trouble In LSG Pant Goenka Engage In Intense Chat After Loss vs DC | Sakshi
Sakshi News home page

మళ్లీ మొదలు.. కోచ్‌, గోయెంకా సీరియస్‌!.. పంత్‌ వివరణ ఇస్తూ..

Apr 2 2026 1:46 PM | Updated on Apr 2 2026 2:38 PM

Trouble In LSG Pant Goenka Engage In Intense Chat After Loss vs DC

ఐపీఎల్‌-2026 టోర్నీని లక్నో సూపర్‌ జెయింట్స్‌ పరాజయంతో ఆరంభించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో లక్నో ఓటమిపాలైంది. సొంతమైదానం ఏకనా స్టేడియంలో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో.. 141 పరుగులకే ఆలౌట్‌ అయింది.

సమీర్‌ రిజ్వీ ధనాధన్‌
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ నాలుగు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. ఆదిలోనే ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (0), పాతుమ్‌ నిస్సాంక (1).. వన్‌డౌన్‌ బ్యాటర్‌ నితీశ్‌ రాణా (15) వికెట్లు తీసి లక్నో శుభారంభం అందుకున్నా..  సమీర్‌ రిజ్వీ (47 బంతుల్లో 70), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (32 బంతుల్లో 39) అజేయ ఇన్నింగ్స్‌తో ఢిల్లీని గెలుపుతీరాలకు చేర్చారు.

కోచ్‌, గోయెంకా సీరియస్‌.. పంత్‌ వివరణ ఇస్తూ..
ఫలితంగా లక్నో జట్టుకు చేదు అనుభవం తప్పలేదు. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం లక్నో కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant).. హెడ్‌కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌, జట్టు యజమాని సంజీవ్‌ గోయెంకాలకు సీరియస్‌గా ఏదో వివరణ ఇస్తున్నట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో లక్నో మాజీ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul)కు సంజీవ్‌ గోయెంకా గతంలో చివాట్లు పెట్టిన విషయాన్ని నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. ఈ పరిణామం తర్వాత రాహుల్‌.. గౌరవం లేని చోట ఉండలేనంటూ లక్నోను వీడి ఢిల్లీ జట్టులో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంత్‌కు కూడా ఇలాంటి పరాభవం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అత్యధిక ధర
కాగా ఐపీఎల్‌-2025 మెగా వేలంలో పంత్‌ను ఏకంగా రూ. 27 కోట్లకు లక్నో కొనుగోలు చేసింది. తద్వారా ఐపీఎల్‌లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా పంత్‌ నిలిచాడు. అయితే, అతడి ప్రదర్శన మాత్రం దారుణంగా ఉంటోంది. గత సీజన్‌లో బ్యాటర్‌గా పూర్తిగా విఫలమైన పంత్‌.. కెప్టెన్‌గా 14 మ్యాచ్‌లకు గానూ ఆరు మ్యాచ్‌లు గెలిపించగలిగాడు.

ఓపెనర్‌గా, సారథిగా విఫలం
ఇక తాజా సీజన్‌లో తొలి మ్యాచ్‌లోనే బ్యాటర్‌, కెప్టెన్‌గా పంత్‌ విఫలమయ్యాడు. ఈసారి ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ 9 బంతులు ఎదుర్కొని కేవలం ఏడు పరుగులే చేశాడు. రనౌట్‌ అయి నిరాశగా పెవిలియన్‌ చేరాడు. దీంతో మరోసారి పంత్‌ ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. అయితే, తాను ఓపెనర్‌గా వచ్చి విఫలమైన అంశంపైనే లాంగర్‌, గోయెంకాకు వివరణ ఇచ్చినట్లు నెటిజన్లు భావిస్తున్నారు.

చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన మహ్మద్‌ షమీ

Advertisement
 
Advertisement
Advertisement