ఢిల్లీ గెలుపు సమీరం  | Delhi Capitals Beat Lucknow Super Giants By 6 Wickets | Sakshi
Sakshi News home page

ఢిల్లీ గెలుపు సమీరం 

Apr 2 2026 5:07 AM | Updated on Apr 2 2026 10:02 AM

Delhi Capitals Beat Lucknow Super Giants By 6 Wickets

6 వికెట్లతో లక్నోపై విజయం 

సమీర్‌ రిజ్వీ అర్ధ సెంచరీ

ఐపీఎల్‌లో మరో మ్యాచ్‌ స్వల్ప స్కోర్లతో ఉత్కంఠభరితంగా ముగిసింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో 142 పరుగుల లక్ష్య ఛేదనలో ఒకదశలో 26/4తో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ చివరకు గట్టెక్కింది. యువ ఆటగాడు సమీర్‌ రిజ్వీ ముందుండి నడిపించగా, ట్రిస్టన్‌ స్టబ్స్‌ అతనికి అండగా నిలిచాడు. అంతకుముందు ఢిల్లీ బౌలర్ల ముందు నిలవలేక టాప్‌–5లో ముగ్గురు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడంతో లక్నో ఇన్నింగ్స్‌ స్వల్ప స్కోరుకే ముగిసింది. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌ల తర్వాత ఒక టీమ్‌కు ‘హోం గ్రౌండ్‌’లో ఓటమి ఎదురైంది.  

లక్నో: అక్షర్‌ పటేల్‌ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐపీఎల్‌లో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 18.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. అబ్దుల్‌ సమద్‌ (25 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్‌), మిచెల్‌ మార్ష్  (28 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మాత్రమే ఫర్వాలేదనిపించారు. 

ఢిల్లీ బౌలర్లలో ఎన్‌గిడి, నటరాజన్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఢిల్లీ 17.1 ఓవర్లలో 4 వికెట్లకు 145 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సమీర్‌ రిజ్వీ (47 బంతుల్లో 70 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీ సాధించగా, ట్రిస్టన్‌ స్టబ్స్‌ (32 బంతుల్లో 39 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) అండగా నిలిచాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 76 బంతుల్లో అభేద్యంగా 119 పరుగులు జోడించారు.  

టపటపా... 
మార్ష్  కొన్ని చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టినా... రిషభ్‌ పంత్‌ (7), మార్క్‌రమ్‌ (11) విఫలం కావడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 48/2కు చేరింది. ఆ తర్వాత బదోని (0), పూరన్‌ (8) కూడా విఫలమయ్యారు. కుల్దీప్‌ చక్కటి బంతితో మార్ష్ ను బోల్తా కొట్టించడంతో సగం ఓవర్ల లోపే లక్నో సగం వికెట్లు చేజార్చుకుంది. 23 పరుగుల వ్యవధిలో జట్టు 4 వికెట్లు చేజార్చుకుంది. ముకుల్‌ (14) ప్రభావం చూపలేకపోగా, ఈ స్థితిలో సమద్‌ ఒక్కడే కాస్త పట్టుదలగా నిలబడి కొన్ని పరుగులు సాధించాడు. అయితే నటరాజన్‌ ఒకే ఓవర్లో సమద్, షమీ (1)లను అవుట్‌ చేయగా, ఎన్‌గిడి తర్వాతి ఓవర్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీయడంతో మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే లక్నో ఇన్నింగ్స్‌ ముగిసింది.  

కీలక భాగస్వామ్యం... 
ఛేదనలో ఢిల్లీ తడబడింది. మొదటి బంతికే కేఎల్‌ రాహుల్‌ (0) వెనుదిరగ్గా... ఐదు పరుగుల వ్యవధిలో నితీశ్‌ రాణా (15), నిసాంక (1), అక్షర్‌ పటేల్‌ (0) అవుటయ్యారు. 4.3 ఓవర్లకే స్కోరు 26/4 కావడంతో క్యాపిటల్స్‌ కష్టాలు పెరిగాయి. అయితే రిజ్వీ, స్టబ్స్‌ పట్టుదలగా నిలబడి 17 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీని విజయతీరాలకు చేర్చారు. లక్నో ఏకంగా 16 వైడ్‌లు సహా 20 అదనపు పరుగులిచ్చి ప్రత్యర్థికి ఇతోధిక సహకారం అందించింది.  

రెండు సిక్సర్లతో మొదలు పెట్టి... 
2024 ఐపీఎల్‌లో రిజ్వీని చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఏకంగా రూ.8.40 కోట్లకు ఎంచుకుంది. ఈ యూపీ ఆటగాడు దూకుడైన బ్యాటింగ్‌తో ‘కుడిచేతి వాటం సురేశ్‌ రైనా’గా గుర్తింపు పొందాడు. ఐపీఎల్‌లో తాను ఆడిన తొలి 4 బంతుల్లో రెండు సిక్సర్లు బాది ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించినా... ఐదు ఇన్నింగ్స్‌లలో కలిపి 51 పరుగులే చేయగలిగాడు. దాంతో చెన్నై వదులుకోగా, గత సీజన్‌లో ఢిల్లీ రూ.95 లక్షలకు తీసుకుంది. చివరి మ్యాచ్‌లో 25 బంతుల్లో 58 పరుగులతో జట్టును గెలిపించగా... ఈసారి అదే మొత్తానికి ఫ్రాంచైజీ అతడిని తమతో కొనసాగించింది. 

ఎట్టకేలకు జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో హీరోలా కీలకమైన హాఫ్‌ సెంచరీతో తన స్థాయిని పెంచుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌ను కూడా రిజ్వీ తడబడుతూనే ప్రారంభించాడు. తొలి 8 బంతుల్లో అతను సింగిల్‌ కూడా తీయలేకపోయాడు. తొలి 13 బంతుల్లో చేసినవి 5 పరుగులే! అయితే నోర్జే బౌలింగ్‌లో డీప్‌ థర్డ్‌మాన్‌ దిశగా కొట్టిన సిక్స్‌తో అతని జోరు మొదలైంది. షహబాజ్‌ ఓవర్లో 3 ఫోర్లు బాదిన తర్వాత పరిస్థితికి తగినట్లుగా ఆటను మార్చుకున్నాడు. మార్క్‌రమ్‌ ఓవర్లో 6, 4 కొట్టి 37 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి వరకు నిలబడి జట్టును గెలిపించాడు.  

షమీ తొలి బంతికే... 
ఐపీఎల్‌లో తొలిసారి లక్నో జట్టు తరఫున బరిలోకి దిగిన సీనియర్‌ పేసర్‌ షమీ వచ్చీ రాగానే ప్రభావం చూపించాడు. మొదటి బంతికే రాహుల్‌ను అతను అవుట్‌ చేశాడు. ఐపీఎల్‌లో ఇన్నింగ్స్‌ తొలి బంతికే షమీ వికెట్‌ తీయడం ఇది ఐదోసారి కావడం విశేషం. గతంలో ఏ బౌలర్‌ మూడుసార్లకు మించి ఈ ఫీట్‌ను నమోదు చేయలేదు.

స్కోరు వివరాలు 
లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మార్ష్  (సి) స్టబ్స్‌ (బి) కుల్దీప్‌ 35; పంత్‌ (రనౌట్‌) 7; మార్క్‌రమ్‌ (బి) అక్షర్‌ 11; బదోని (సి) రాహుల్‌ (బి) నటరాజన్‌ 0; పూరన్‌ (బి) ఎన్‌గిడి 8; సమద్‌ (సి) మిల్లర్‌ (బి) నటరాజన్‌ 36; ముకుల్‌ (సి అండ్‌ బి) కుల్దీప్‌ 14; షహబాజ్‌ (నాటౌట్‌) 15; షమీ (సి) కుల్దీప్‌ (బి) నటరాజన్‌ 1; నోర్జే (సి) స్టబ్స్‌ (బి) ఎన్‌గిడి 0; మొహసిన్‌ (సి) ముకేశ్‌ (బి) ఎన్‌గిడి 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్‌) 141. 

వికెట్ల పతనం: 1–19, 2–48, 3–49, 4–65, 5–71, 6–105, 7–138, 8–140, 9–141, 10–141.
 బౌలింగ్‌: ముకేశ్‌ కుమార్‌ 3–0–17–0, ఎన్‌గిడి 3.4–0–27–3, అక్షర్‌ 3–0–17–1, నటరాజన్‌ 4–0–29–3, కుల్దీప్‌ 4–0–31–1, విప్రాజ్‌ 1–0–8–0.  

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) మొహసిన్‌ (బి) షమీ 0; నిసాంక (సి) పంత్‌ (బి) ప్రిన్స్‌ 1; నితీశ్‌ (సి) సమద్‌ (బి) మొహసిన్‌ 15; రిజ్వీ (నాటౌట్‌) 70; అక్షర్‌ (బి) ప్రిన్స్‌ 0; స్టబ్స్‌ (నాటౌట్‌) 39; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (17.1 ఓవర్లలో 4 వికెట్లకు) 145. 
వికెట్ల పతనం: 1–0, 2–21, 3–25, 4–26. 
బౌలింగ్‌: షమీ 4–0–28–1, ప్రిన్స్‌ 3–0–20–2, మొహసిన్‌ 4–1–19–1, నోర్జే 4–0–39–0, షహబాజ్‌ 1–0–16–0, మార్క్‌రమ్‌ 1–0–13–0, సమద్‌ 0.1–0–6–0.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement