కోహ్లిని మరోసారి గెలికిన హెడ్‌ | Travis Head Fires Indirect Shots At Virat Kohli Just Before IPL 2026 Final | Sakshi
Sakshi News home page

కోహ్లిని మరోసారి గెలికిన హెడ్‌

May 31 2026 11:17 AM | Updated on May 31 2026 11:17 AM

Travis Head Fires Indirect Shots At Virat Kohli Just Before IPL 2026 Final

ఐపీఎల్ 2026 ఫైనల్‌కు ముందు విరాట్ కోహ్లీ–ట్రావిస్ హెడ్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. కొద్ది రోజుల కిందట ఓ ఐపీఎల్‌ మ్యాచ్‌లో (ఆర్సీబీ-ఎస్‌ఆర్‌హెచ్‌) వీరిద్దరూ మాటా-మాటా అనుకున్న విషయం తెలిసిందే. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ, ఎస్‌ఆర్‌హెచ్‌లోని పలువురు ఆటగాళ్లతో కరచాలనం చేసినప్పటికీ, ట్రావిస్ హెడ్‌తో మాత్రం చేతులు కలపలేదు.

ఆతర్వాత కోహ్లి అభిమానులు హెడ్‌ను, అతని భార్య జెస్సికా హెడ్‌ సోషల్‌మీడియా వేదికగా టార్గెట్‌ చేయడం ప్రారంభించారు. కోహ్లి అభిమానులు హెడ్‌ భార్యపై వ్యక్తిగత దూషణలు కూడా చేశారు.

ఈ వివాదం హెడ్‌ తాజా సోషల్‌మీడియా పోస్ట్‌తో కొత్త మలుపు తీసుకుంది. ఎస్‌ఆర్‌హెచ్‌ ప్లే ఆఫ్స్‌లో ఆశించిన ఫలితాలు సాధించలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ,  జోఫ్రా ఆర్చర్ ధాటికి ఓటమి పాలైంది. 

తాజాగా ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాడైన ట్రావిస్ హెడ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టాడు. అందులో "Appreciate those who showed love and respect" అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఈ క్యాప్షన్‌ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.

ఆ క్యాప్షన్‌లో హెడ్‌ నేరుగా ఎవరి పేరు ప్రస్తావించకపోయినా, కోహ్లినే పరోక్షంగా టార్గెట్‌ చేసినట్లు అర్దమవుతుంది. కోహ్లీ అభిమానుల నుంచి తనకు, తన కుటుంబానికి ఎదురైన ట్రోలింగ్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్య చేశాడని సోషల్ మీడియాలో విశ్లేషణలు మొదలయ్యాయి.

కాగా, హెడ్‌-కోహ్లి మధ్య గొడవ తర్వాత జెస్సికా హెడ్‌, ఆమె కుటుంబం, స్నేహితులపై సోషల్‌మీడియా వేదికగా తీవ్రస్థాయి దూషణలు వచ్చాయి. భారత్‌లో జరిగిన 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత కూడా ఇలాంటి చేదు అనుభవాలే ఎదురైనట్లు ఆమె స్వయంగా వెల్లడించింది. 

ఆ ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్‌పై అద్భుత సెంచరీ సాధించి ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించిన ట్రావిస్ హెడ్ అప్పుడూ భారత అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. అలాగే 2024 బాక్సింగ్ డే టెస్టులో భారత్‌పై కీలక ఇన్నింగ్స్ ఆడిన తర్వాత కూడా ఇలాంటి ట్రోలింగ్ ఎదుర్కొన్నట్లు నివేదికలు వెల్లడించాయి. 

కుటుంబాలను టార్గెట్‌ చేయడం కరెక్ట్‌ కాదు..! 
క్రీడల్లో పోటీ ఎంత తీవ్రంగా ఉన్నా, ఆటగాళ్ల కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని దూషించడం సమర్థనీయం కాదనే అభిప్రాయం మాత్రం అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.

ఇదిలా ఉంటే, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ (మే 31) రాత్రి ఐపీఎల్‌ 2026 ఫైనల్‌ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ టైటిల్‌ పోరులో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆర్సీబీ- గుజరాత్‌ టైటాన్స్‌ పోటీపడనున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement