
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఆఖరి దశ పోటీల్లో తెలుగు టైటాన్స్ నిలకడగా రాణిస్తోంది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో టైటాన్స్ జట్టు 30–25 గుజరాత్ జెయింట్స్‌పై విజయం సాధించింది. టైటాన్స్ జట్టులో కెప్టెన్ విజయ్ మాలిక్ (8), భరత్ (7) పోటీపడి రాణించారు. ఇద్దరు ఆల్‌రౌండర్లు క్రమం తప్పకుండా పాయింట్లు తెచ్చిపెట్టారు. డిఫెండర్లు అజిత్ పవార్ (4), అంకిత్ (4)లు మెరుగ్గా ఆడారు.
గుజరాత్ తరఫున రెయిడింగ్‌లో హిమాన్షు సింగ్ (6), కెప్టెన్ రాకేశ్ (5) రాణించగా, డిఫెండర్ లక్కీ శర్మ 4 పాయింట్లు సాధించాడు. మిగతా వారిలో ఆల్‌రౌండర్ మొహమ్మద్ రెజా (3), విశ్వనాథ్, నితిన్ పన్వార్ చెరో 2 పాయింట్లు చేశారు. 12వ సీజన్‌లో ఆరంభం నుంచే పట్టుదలగా ఆడుతున్న తెలుగు టైటాన్స్ 17 మ్యాచ్‌లాడి పదో విజయాన్ని నమోదు చేసింది.
నేడు మ్యాచ్‌లకు విశ్రాంతి రోజు. రేపు జరిగే పోటీల్లో బెంగాల్ వారియర్స్‌తో తమిళ్ తలైవాస్ పోటీపడుతుంది. యూ ముంబాను జైపూర్ పింక్‌పాంథర్స్ ఢీకొంటుంది. హరియాణా స్టీలర్స్‌తో గుజరాత్ జెయంట్స్ తలపడుతుంది.
ప్లేఆఫ్స్ చేరిన యూ ముంబా
లీగ్‌లో మరో జట్టు యూ ముంబా కూడా ప్లే ఆఫ్స్ చేరింది. హరియాణా స్టీలర్స్‌తో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో యూ ముంబా టై బ్రేకర్‌లో గెలిచి ముందంజ వేసింది. నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరు జట్లు 37–37 స్కోరుతో సమంగా నిలిచాయి. దీంతో టైబ్రేక్ అనివార్యం కాగా యూ ముంబా రెయిడర్లు జట్టును గెలిపించారు. సందీప్ (9) అదరగొట్టాడు. 21 సార్లు కూతకెళ్లిన అతను 9 సార్లు విజయవంతంగా పాయింట్లు తెచ్చాడు.
సహచరుల్లో అజిత్ చౌహాన్ (6), అమిర్ మొహమ్మద్ (6), సునీల్ కుమార్ (4), విజయ్ కుమార్ (3) రాణించారు. హరియాణా జట్టులో జైదీప్ (9) కడదాకా శ్రమించాడు. మిగతావారిలో సాహిల్ నర్వాల్ (6), శివమ్ పతారే (4), వినయ్ (3), రాహుల్ (3) మెరుగ్గా ఆడారు. ఆఖరి మూడో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 38–27తో పుణేరి పల్టన్‌పై గెలుపొందింది.