తండ్రికి తగ్గ తనయుడు.. ఆ పోలికలు ఎక్కడికి పోతాయి

Tagenarine Chanderpaul Batting Similar His Father Shivnarine Chanderpaul - Sakshi

వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం శివనరైన్‌ చందర్‌పాల్‌ గుర్తున్నాడు కదా.. రెండు దశాబ్దాల పాటు విండీస్‌ క్రికెట్‌లో మిడిలార్డర్‌లో మూల స్తంభంగా నిలిచాడు. బ్రియాన్‌ లారా తర్వాత టెస్టు క్రికెట్‌లో చందర్‌పాల్‌ విండీస్‌ జట్టులో కీలకపాత్ర పోషించాడు. అతని బ్యాటింగ్‌ స్టైల్‌ ఒక యూనిక్‌ అని చెప్పొచ్చు. క్రీజులో కాస్త వంకరగా నిలబడి మిడిల్‌ వికెట్‌ను మొత్తం కవర్‌ చేస్తూ బ్యాటింగ్‌ చేయడం అతనికి మాత్రమే సాధ్యం. రెండు దశాబ్దాల పాటు క్రికెట్‌ ఆడిన చందర్‌పాల్‌ బ్యాటింగ్‌ స్టాండింగ్‌ విషయంలో ఏనాడు ఒక్క ఫిర్యాదు రాలేదంటే అర్థం చేసుకోవచ్చు.

తాజాగా చందర్‌పాల్‌ కొడుకు టగ్‌నరైన్‌ చందర్‌పాల్‌ కూడా విండీస్‌ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అచ్చం తండ్రిలానే బ్యాటింగ్‌ చేస్తూ అందరిని ఆకట్టుకున్నాడు. చందర్‌పాల్‌ది యూనిక్‌ స్టైల్‌ ఆఫ్‌ బ్యాటింగ్‌ అని అంటారు. అతనిలా మరే ఆటగాడు బ్యాటింగ్‌ చేయకపోవచ్చని పేర్కొన్నారు. కానీ ఆ మాటలను టగ్‌నరైన్‌ చందర్‌పాల్‌ బ్రేక్‌ చేశాడు. 

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్‌గా వచ్చిన టగ్‌నరైన్‌ చందర్‌పాల్‌ అచ్చం తండ్రి బ్యాటింగ్‌ను గుర్తు చేస్తూ ఇన్నింగ్స్‌ కొనసాగించాడు.  తండ్రి బ్యాటింగ్‌ స్టైల్‌ను అనుకరిస్తూ ఆడిన టగ్‌నరైన్‌ అర్థశతకం సాధించాడు. ఓవరాల్‌గా 79 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 51 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియోనూ క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఇది చూసిన అభిమానులు.. తండ్రికి తగ్గ కొడుకు.. ఆ పోలికలు ఎక్కడికి పోతాయి.. అంటూ కామెంట్‌ చేశారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ 64, టగ్‌నరైన్‌ చందర్‌పాల్‌ 51 మినహా పెద్దగా ఎవరు రాణించలేదు. బ్లాక్‌వుడ్‌ 36, షమ్రా బ్రూక్స్‌ 33 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలింగ్‌లో కమిన్స్‌, స్టార్క్‌ చెరో మూడు వికెట్లు తీయగా.. నాథన్‌ లియోన్‌ 2, కామెరున్‌ గ్రీన్‌, హాజిల్‌వుడ్‌ చెరొక వికెట్‌ తీశారు. అంతకముందు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 598 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబుషేన్‌లు డబుల్‌ సెంచరీలతో మెరిశారు. రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌ వికెట్‌ నష్టానికి 21 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 336 పరుగుల ఆధిక్యంలో ఉంది.

చదవండి: 17 ఏళ్ల తర్వాత తొలి టెస్టు మ్యాచ్‌.. 657 పరుగులకు ఇంగ్లండ్‌ ఆలౌట్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top