SuryaKumar: 'తెల్లబంతి పని పట్టా.. ఎరుపు బంతి కోసం వెయిటింగ్‌'

Suryakumar Yadav Hints About Test debut Vs Australia Intresting-Post - Sakshi

టీమిండియా ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో  తానేంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. వన్డే, టి20ల్లో తనదైన స్టైల్లో బ్యాటింగ్‌ చేస్తూ పరుగులు రాబడుతున్నాడు. గ్రౌండ్‌ నలువైపులా షాట్లు ఆడుతూ ‍మిస్టర్‌ 360 పేరును సార్థకం చేసుకున్నాడు. ఇన్నాళ్లు వైట్‌బాల్‌ పని పట్టిన సూర్యకుమార్‌ తాజాగా ఎరుపు బంతి పని పట్టనున్నాడు. అదేనండి సంప్రదాయ టెస్టు ఫార్మాట్‌.

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్‌ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టులో సూర్యకుమార్‌ ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరో స్థానంలో బ్యాటింగ్‌ వచ్చే అవకాశమున్న సూర్య టెస్టు క్రికెట్‌లో ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే సూర్యకుమార్‌ తాను టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టే రోజు వచ్చేసిదంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు పెట్టాడు. ''హలో ఫ్రెండ్‌'' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. దీనర్థం.. ఎరుపు బంతితో ఆడడం కోసం ఎదురుచూస్తున్నా. అని చెప్పకనే చెప్పాడు. ఇన్నాళ్లు తెల్లబంతి పని పట్టాడు.. ఇక ఎరుపు బంతి కోసం వెయిటింగ్‌ అన్నట్లుగా సూర్య మెసేజ్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఒకవేళ సూర్యకుమార్‌ ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో ఆడితే.. ఆరో స్థానంలో బ్యాటింగ్‌ వచ్చే అవకాశం ఉంది. తుది జట్టు చూసుకుంటే.. గిల్‌, రోహిత్‌ శర్మలు ఓపెనర్లుగా.. పుజారాలు వన్‌డౌన్‌లో ఆడడం ఖాయం. ఆ తర్వాత కోహ్లి, కేఎల్‌ రాహుల్‌లు నాలుగు, ఐదో స్థానాల్లో వస్తారు. ఇక ఆరో స్థానంలో సూర్యకుమార్‌, ఏడో స్థానంలో జడేజా వచ్చే అవకాశం ఉంది.

ఈ టెస్టు సిరీస్‌ టీమిండియాకు చాలా కీలకం. ఇప్పటికే డబ్ల్యూటీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంది. ఆసీస్‌తో సిరీస్‌ను టీమిండియా 3-1తో గెలిస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడే చాన్స్‌ ఉంటుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 10 టెస్టుల్లో గెలుపు, ఒక ఓటమి, నాలుగు డ్రాలతో కలిపి 75.56 పర్సంటైల్‌ పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. ఐదు టెస్టుల్లో గెలుపు, నాలుగింటిలో ఓటమి, ఒక డ్రాతో కలిపి 58.93 పర్సంటైల్‌ పాయింట్లతో టీమిండియా రెండో స్థానంలో ఉంది.

ఆస్ట్రేలియా భారత పర్యటన షెడ్యూల్‌: ఫిబ్రవరి 09- మార్చి 22.. టెస్టు సిరీస్‌తో ప్రారంభం- వన్డే సిరీస్‌తో ముగింపు
నాలుగు టెస్టుల సిరీస్‌

► ఫిబ్రవరి 9- 13: నాగ్‌పూర్‌
► ఫిబ్రవరి 17- 21: ఢిల్లీ
► మార్చి 1-5: ధర్మశాల
► మార్చి 9- 13: అహ్మదాబాద్‌

మూడు వన్డేల సిరీస్‌
► మార్చి 17- ముంబై
► మార్చి 19- వైజాగ్‌
► మార్చి 22- చెన్నై 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top