సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు బోణీ
65 పరుగులతో కోల్‌కతా చిత్తు
చెలరేగిన క్లాసెన్, అభిషేక్, హెడ్
నితీశ్ రెడ్డి ఆల్‌రౌండ్ ప్రదర్శన
ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో 201 పరుగులు చేసి కూడా సన్‌రైజర్స్ ఓటమిని ఎదుర్కొంది. కానీ ఈసారి అదే బ్యాటింగ్ బలంతో గెలుపు బోణీ చేసింది. క్లాసెన్, అభిషేక్, హెడ్‌ల దూకుడుతో ఈ సీజన్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టు దానిని నిలబెట్టుకుంది. సొంత మైదానంలో పేలవ బౌలింగ్‌తో భారీగా పరుగులిచ్చిన కేకేఆర్ ఛేదనలో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే కుప్పకూలింది. ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకోగా... ఈ సీజన్‌లో గత ఐదు మ్యాచ్‌లకు భిన్నంగా తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు మొదటిసారి గెలవడం విశేషం.
కోల్‌కతా: ఐపీఎల్ మాజీ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ సీజన్‌లో తమ రెండో మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది. ఈడెన్ గార్డెన్స్‌లో గురువారం ఏకపక్షంగా సాగిన పోరులో హైదరాబాద్ 65 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది.
హెన్రిచ్ క్లాసెన్ (35 బంతుల్లో 52; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, అభిషేక్ శర్మ (21 బంతుల్లో 48; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ట్రవిస్ హెడ్ (21 బంతుల్లో 46; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), నితీశ్ కుమార్ రెడ్డి (24 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం కోల్‌కతా 16 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది. అంగ్‌కృష్ రఘువంశీ (29 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), రింకూ సింగ్ (25 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు.
ఓపెనర్ల దూకుడు...
హెడ్, అభిషేక్ అంచనాలకు అనుగుణంగా తమ విధ్వంసక బ్యాటింగ్‌తో హైదరాబాద్‌కు శుభారంభం అందించారు. అరోరా ఓవర్లో తొలి బంతికి ఫోర్ కొట్టిన హెడ్, ఆ తర్వాత అదే ఓవర్లో వరుసగా 6, 6, 4 బాదడంతో మొత్తం 21 పరుగులు వచ్చాయి. 34 పరుగుల వద్ద హెడ్ ఇచ్చిన కష్టసాధ్యమైన క్యాచ్‌ను రహానే వదిలేశాడు. వరుణ్ వేసిన తొలి ఓవర్లో చెలరేగిపోయిన అభిషేక్ 2 సిక్స్‌లు, 3 ఫోర్లు కొట్టడంతో 25 పరుగులు లభించాయి.
పవర్‌ప్లే ముగిసేసరికే స్కోరు 84 పరుగులకు చేరడం విశేషం. అయితే హెడ్‌ను అవుట్ చేసి త్యాగి తొలి వికెట్ తీయగా... ఆ తర్వాత 7 పరుగుల వ్యవధిలో ఇషాన్ కిషన్ (14), అభిషేక్, అనికేత్ వర్మ (1) వికెట్లు కోల్పోయింది. అభిషేక్ ఇచ్చిన క్యాచ్‌ను వరుణ్ అందుకునే సమయంలో బంతి నేలకు తాకినట్లు అనిపించినా...వరుస రీప్లేల తర్వాత అంపైర్ నితిన్ మేనన్ అవుట్‌గా ప్రకటించాడు.
ఈ దశలో క్లాసెన్, నితీశ్ కీలక భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను నడిపించారు. క్లాసెన్ 34 బంతుల్లో అర్ధసెంచరీ మార్క్‌ను అందుకోగా, ఆఖరి 3 ఓవర్లలో జట్టు 4 వికెట్లు చేజార్చుకొని 42 పరుగులు రాబట్టింది. కేకేఆర్ బౌలర్ ముజరబాని 4 వికెట్లు తీశాడు.
రఘువంశీ అర్ధసెంచరీ...
పేన్ వేసిన మొదటి ఓవర్ తొలి బంతికి రహానే సింగిల్ తీయగా... తర్వాతి ఐదు బంతుల్లో ఫిన్ అలెన్ (7 బంతుల్లో 28; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) వరుసగా 4, 4, 6, 6, 4 బాదడంతో మొత్తం 25 పరుగులు వచ్చాయి. అయితే కేకేఆర్ దూకుడు ఈ ఒక్క ఓవర్‌కే పరిమితమైంది. దూబే వేసిన రెండో ఓవర్లోనే అలెన్ వెనుదిరగ్గా... రహానే (8), గ్రీన్ (2) విఫలమయ్యారు.
కొన్ని చక్కటి షాట్లు ఆడిన రఘువంశీ 27 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రఘువంశీ, అనుకూల్ రాయ్ (0) ఒకే స్కోరు వద్ద అవుటైన తర్వాత రింకూ సింగ్, రమణ్‌దీప్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే 39 బంతుల్లో 88 పరుగులు చేయాల్సిన స్థితిలో రింకూ అవుట్ కావడంతో కోల్‌కతా ఆశలు కోల్పోయింది.
స్కోరు వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) గ్రీన్ (బి) త్యాగి 46; అభిషేక్ (సి) వరుణ్ (బి) ముజరబాని 48; ఇషాన్ కిషన్ (సి) రింకూ (బి) ముజరబాని 14; క్లాసెన్ (సి) రమణ్‌దీప్ (బి) ముజరబాని 52; అనికేత్ (సి) రింకూ (బి) రాయ్ 1; నితీశ్ రెడ్డి (సి) వరుణ్ (బి) అరోరా 39; సలీల్ (బి) అరోరా 0; దూబే (నాటౌట్) 9; శివాంగ్ (సి) రహానే (బి) ముజరబాని 4; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 226. వికెట్ల పతనం: 1–82, 2–111, 3–112, 4–118, 5–200, 6–200, 7–222, 8–226. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–47–2, ముజరబాని 4–0–41–4, నరైన్ 4–0–39–0, వరుణ్ చక్రవర్తి 2–0–31–0, కార్తీక్ త్యాగి 4–0–48–1, అనుకూల్ రాయ్ 2–0–16–1.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: అలెన్ (సి అండ్ బి) దూబే 28; రహానే (సి) మలింగ (బి) ఉనాద్కట్ 8; రఘువంశీ (రనౌట్) 52; గ్రీన్ (రనౌట్) 2; రింకూ (సి) ఉనాద్కట్ (బి) నితీశ్ 35; అనుకూల్ (సి) అండ్ (బి) నితీశ్ 0; రమణ్‌దీప్ (సి) ఉనాద్కట్ (బి) మలింగ 10; నరైన్ (సి) అనికేత్ (బి) మలింగ 12; త్యాగి (సి) ఇషాన్ కిషన్ (బి) ఉనాద్కట్ 5; వైభవ్ (నాటౌట్) 1; వరుణ్ (బి) ఉనాద్కట్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (16 ఓవర్లలో ఆలౌట్) 161. వికెట్ల పతనం: 1–30, 2–67, 3–74, 4–120, 5–120, 6–139, 7–154, 8–159, 9–161, 10–161. బౌలింగ్: పేన్ 2–0–35–0, హర్ష్ దూబే 2–0–17–1, అభిషేక్ 1–0–15–0, ఉనాద్కట్ 3–0–21–3, ఇషాన్ మలింగ 2–0–14–2, శివాంగ్ 4–0–41–0, నితీశ్ 2–0–17–2.
ఎట్టకేలకు...
జట్టు ప్రదర్శన ఎలా ఉన్నా... హైదరాబాద్ జట్టు సగటు అభిమాని మన తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి రాణించాలని కోరుకోవడం సహజం. అయితే గత సీజన్ మొత్తం నితీశ్ తీవ్రంగా నిరాశపర్చాడు. 11 ఇన్నింగ్స్‌లలో కలిపి పేలవమైన స్ట్రయిక్ రేట్ 118.95తో మొత్తం 182 పరుగులే చేసిన అతని అత్యధిక స్కోరు 32 మాత్రమే. బౌలింగ్‌లో రెండే వికెట్లు తీశాడు. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో విఫలమైన అతను ఇక్కడ దూకుడుగా ఆడాడు. ముఖ్యంగా అరోరా బౌలింగ్‌లో కొట్టిన సిక్స్ హైలైట్‌గా నిలిచింది. బౌలింగ్‌లో కూడా కీలకమైన రింకూ సింగ్ వికెట్ అతను పడగొట్టాడు.
200 ఐపీఎల్‌లో రహానేకు ఇది 200వ మ్యాచ్. ఈ మైలురాయిని అందుకున్న 11వ ఆటగాడు రహానే. అతను లీగ్‌లో ఆరు జట్లకు (కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, ముంబై, రాజస్తాన్, పుణే) ప్రాతినిధ్యం వహించాడు.


