
అక్టోబర్ తొలి వారంలో న్యూజిలాండ్‌తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 14 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును ఇవాళ (సెప్టెంబర్ 2) ప్రకటించారు. దాదాపు ఏడాది కాలంగా అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉన్న విధ్వంసకర బ్యాటర్ మార్కస్ స్టోయినిస్ ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. వచ్చే ఏడాది భారత్, శ్రీలంకలో జరుగనున్న వరల్డ్‌కప్ దృష్ట్యా స్టోయినిస్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.
36 ఏళ్ల స్టోయినిస్ గతకొంతకాలంగా జాతీయ జట్టు పరిధిలో లేడు. అతనికి సెంట్రల్ కానీ, స్టేట్ కాంట్రాక్ కానీ లేవు. అతడు చివరిగా 2024 నవంబర్‌లో ఆస్ట్రేలియా తరఫున ఆడాడు. ఈ ఏడాది ఫ్రిబవరిలో అతడు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న టీ20 లీగ్‌లతో బిజీగా ఉన్నాడు. స్టోయినిస్ తాజా ఐపీఎల్ (పంజాబ్ కింగ్స్), హండ్రెడ్ లీగ్‌ల్లో (ట్రెంట్ రాకెట్స్) రన్నరప్ జట్లలో సభ్యుడిగా ఉన్నాడు.
వరల్డ్‌కప్ దృష్ట్యా స్టోయినిస్‌ను తీసుకున్నట్లు తెలుస్తున్నా, ఆ జట్టుకు ఎంపిక కావడం అతనికి అంత ఈజీ కాదు. స్టోయినిస్ సిమిలర్ ప్రొఫైల్ (ఆల్‌రౌండర్) ఉన్న కెమరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్ నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
స్టోయినిస్‌తో పాటు మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, జేవియర్ బార్ట్‌లెట్ కూడా స్వల్ప విరామం తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. ఓవెన్ ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా, షార్ట్ విండీస్ సిరీస్ సందర్భంగా గాయపడి కోలుకున్నారు. న్యూజిలాండ్ సిరీస్ నుంచి ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్ స్వచ్చందంగా తప్పుకున్నాడు. యాషెస్ ప్రిపరేషన్ దృష్ట్యా అతను షెఫీల్డ్ షీల్డ్ టోర్నీ ఆడేందుకు సిద్దమయ్యాడు.
సౌతాఫ్రికా సిరీస్‌లో ఇంజ్యూరీ రీప్లేస్‌మెంట్లుగా వచ్చిన అలెక్స్ క్యారీ, ఆరోన్ హార్డీ ఈ సిరీస్‌కు ఎంపిక కాలేదు. పితృత్వ సెలవు కారణంగా నాథన్ ఎల్లిస్ కూడా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు.
వెటరన్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఈ జట్టు ప్రకటనకు ముందే టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్ట్ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారణంగా ఈ సిరీస్‌తో పాటు స్వదేశంలో భారత్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు కూడా దూరమయ్యాడు. మిచెల్ మార్ష్ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. ఈ సిరీస్ అక్టోబర్ 1, 3, 4 తేదీల్లో మౌంట్ మాంగనూయ్ వేదికగా జరుగనుంది.
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాట్ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచ్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.