ఆసియా కప్‌ కోసం జట్టు ప్రకటన.. శ్రీలంక సెలెక్టర్ల సంచలన నిర్ణయం | Sri Lanka Announce Asia Cup Squad, Asalanka To Lead, Injured Hasaranga Included | Sakshi
Sakshi News home page

ఆసియా కప్‌ కోసం జట్టు ప్రకటన.. శ్రీలంక సెలెక్టర్ల సంచలన నిర్ణయం

Aug 28 2025 8:06 PM | Updated on Aug 28 2025 8:16 PM

Sri Lanka Announce Asia Cup Squad, Asalanka To Lead, Injured Hasaranga Included

ఆసియా కప్‌ 2025 ‍కోసం శ్రీలంక జట్టును ఇవాళ (ఆగస్ట్‌ 28) ప్రకటించారు. ఈ జట్టు ఎంపి​క విషయంలో లంక సెలెక్టర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గాయంతో బాధపడుతున్నా, స్టార్‌ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగను జట్టులోకి తీసుకున్నారు. హసరంగ ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ సందర్భంగా గాయపడ్డాడు.

గాయం నుంచి అతను ఇంకా కోలుకోలేదు. అయినా హసరంగను ఆసియా కప్‌కు ఎంపిక చేసి లంక సెలెక్టర్లు పెద్ద సాహసమే చేశారు. ఆరంభ దశ మ్యాచ్‌లకు అందుబాటులోకి రాకపోయినా, టోర్నీ కీలక దశ చేరుకునే సమయానికైనా అందుబాటులోకి వస్తాడనే ఉద్దేశంతో సెలెక్టర్లు హసరంగను ఎంపిక​ చేశారు.  

హసరంగ ఎంపిక మినహా జట్టులో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు. చరిత్‌ అసలంక కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. టాపార్డర్‌లో కుసాల్‌ మెండిస్‌, పథుమ్‌ నిస్సంక, కుసాల్‌ పెరీరా తమ స్థానాలకు నిలబెట్టుకున్నారు. ఆల్‌రౌండర్లుగా దసున్‌ షనక, కమిందు మెండిస్‌, దునిత్‌ వెల్లాలగే కొనసాగనున్నారు.

చమిక కరుణరత్నే, కమిల్‌ మిషారా, నువనిదు ఫెర్నాండోను గమనించదగ్గ ఎంపికలుగా చూడవచ్చు. దుష్మంత చమీరా, నువాన్‌ తుషార, మతీష పతిరణతో పేస్‌ బౌలింగ్‌ విభాగం.. బినుర ఫెర్నాండో, తీక్షణ, హసరంగ, వెల్లాలగేతో స్పిన్‌ బౌలింగ్‌ విభాగం​ పటిష్టంగా ఉంది.

ఆసియా కప్‌లో శ్రీలంక గ్రూప్‌-బిలో ఉంది. ఈ గ్రూప్‌తో హాంగ్‌కాంగ్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ ఇతర జట్లుగా ఉన్నాయి. ఈ టోర్నీలో లంక ప్రస్తానం​ సెప్టెంబర్‌ 13న బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలవుతుంది.

ఆసియా కప్‌కు ముందు శ్రీలంక 2 వన్డేలు, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌ల కోసం జట్టును ఇదివరకే ప్రకటించారు. ఆగస్ట్‌ 29, 31 తేదీల్లో వన్డేలు.. సెప్టెంబర్‌ 3, 6, 7 తేదీల్లో టీ20లు జరుగనున్నాయి. ఈ సిరీస్‌ ఆసియా కప్‌కు ముందు శ్రీలంకకు బాగా ఉపయోగపడుతుంది.

ఆసియా కప్‌-2025 కోసం శ్రీలంక జట్టు..
చరిత్ అసలంక (కెప్టెన్‌), కుసాల్ మెండిస్ (వికెట్‌కీపర్‌), పథుమ్ నిస్సంక, కుసాల్ పెరీరా, కమిల్ మిషార, దసున్ షనక, కమిందు మెండిస్, వనిందు హసరంగ, నువానీదు ఫెర్నాండో, దునిత్ వెల్లాలగే, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, మతీశ పతిరణ, నువాన్‌ తుషార, దుష్మంత చమీరా, బినుర ఫెర్నాండో

జింబాబ్వేతో సిరీస్‌లకు శ్రీలంక జట్టు..
చరిత్ అసలంక(కెప్టెన్‌), పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, కుసల్ పెరీరా, నువానీదు ఫెర్నాండో, కమిందు మెండిస్, కమిల్ మిశ్రా, విషెన్ హలంబాగే, దాసున్ షనక, దునిత్ వెల్లలగే, చమిక కరుణరత్న, మహేశ్ తీక్షణ, దుషన్ హేమంత, మతీషా పతిరాన, నువాన్ తుషార, దుష్మంత చమీరా, బినుర ఫెర్నాండో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement