చారిత్రక మైలురాయిని తాకిన సన్‌రైజర్స్‌ | SRH Smash MI Chase 244 To Script 100th IPL Win, Milestone In Run Fest | Sakshi
Sakshi News home page

చారిత్రక మైలురాయిని తాకిన సన్‌రైజర్స్‌

Apr 30 2026 2:02 PM | Updated on Apr 30 2026 2:07 PM

SRH Smash MI Chase 244 To Script 100th IPL Win, Milestone In Run Fest

ఐపీఎల్‌-2026లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్‌పై బుధవారం జయభేరి మోగించిన కమిన్స్‌ బృందం... ఈ సీజన్‌లో వరుసగా ఐదో విజయం నమోదు చేసింది. మొత్తంగా ఇప్పటికి తొమ్మిది మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఆరింట గెలిచింది.

వాంఖడే వేదికగా టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. రికెల్టన్‌ (55 బంతుల్లో 123 నాటౌట్‌; 10 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా... విల్‌ జాక్స్‌ (22 బంతుల్లో 46; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), హార్దిక్‌ పాండ్యా (15 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.

52 బంతుల్లోనే 129 పరుగులు
అనంతరం హైదరాబాద్‌ 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 249 పరుగులు సాధించి విజయాన్నందుకుంది. హెడ్‌ (30 బంతుల్లో 76; 4 ఫోర్లు, 8 సిక్స్‌లు), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ క్లాసెన్‌ (30 బంతుల్లో 65 నాటౌట్‌; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), అభిషేక్‌ శర్మ (24 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగి జట్టును గెలిపించారు. అభిషేక్, హెడ్‌ తొలి వికెట్‌కు 52 బంతుల్లోనే 129 పరుగులు జత చేశారు.

చారిత్రక మైలురాయి
ఇదిలా ఉంటే.. ముంబైపై విజయం ద్వారా సన్‌రైజర్స్‌ చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు ఇది వందో విజయం. కాగా 2013లో ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇప్పటికి 205 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. ఇందులో 104 ఓడిపోగా.. వంద గెలిచింది. ఒకటి ఫలితం తేలకుండా ముగిసిపోయింది.

నిలకడైన జట్టుగానూ పేరు
ఐపీఎల్‌లో 13 ఏళ్లుగా కొనసాగుతున్న సన్‌రైజర్స్‌ 2016లో తొలిసారి టైటిల్‌ గెలిచింది. ఇక 2018, 2024లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచింది. అంతేకాదు మరో నాలుగు సీజన్లలో ప్లే ఆఫ్స్‌ చేరింది. తద్వారా ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తున్న జట్లలో ఒకటిగా ముందుకు సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement