
తాజాగా ముగిసిన హండ్రెడ్ లీగ్‌లో హ్యాట్రిక్ సహా సంచలన ప్రదర్శనలు నమోదు చేసిన మాంచెస్టర్ ఒరిజినల్స్ యువ ఫాస్ట్ బౌలర్ సోన్నీ బేకర్‌కు చేదు అనుభవం ఎదురైంది.
హండ్రెడ్ లీగ్ ప్రదర్శనల కారణంగా ఇంగ్లండ్ జాతీయ జట్టు నుంచి పిలుపందున్న అతనికి తొలి మ్యాచే పీడకలగా మారింది. సౌతాఫ్రికాతో నిన్న (సెప్టెంబర్ 2) జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బేకర్.. తన తొలి మ్యాచ్‌లోనే అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో 7 ఓవర్లు వేసిన అతను వికెట్లేమీ తీయకుండా ఏకంగా 76 పరుగులు సమర్పించుకున్నాడు. తద్వారా వన్డే అరంగేట్రంలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న ఇంగ్లండ్ బౌలర్‌గా ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నాడు.
బేకర్‌కు ముందు ఈ చెత్త రికార్డు లియామ్ డాసన్ పేరిట ఉండేది. 2016లో అతను పాకిస్తాన్‌పై తన వన్డే అరంగేట్రంలో 70 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ విభాగంలో బేకర్, డాసన్ తర్వాతి స్థానాల్లో డేవిడ్ లారెన్స్ (67), జార్జ్ స్క్రిమ్షా (66) ఉన్నారు.
సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలింగ్ అటాక్‌ను ప్రారంభించిన బేకర్.. మార్క్రమ్ ధాటికి తొలి ఓవర్‌లోనే మూడు బౌండరీలు సమర్పించుకున్నాడు. ఆతర్వాత కూడా మార్క్రమ్ బేకర్‌ను కుదురుకోనివ్వలేదు. అతని రెండో ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఓ బౌండరీ బాదాడు.
మార్క్రమ్‌కు రికెల్టన్ కూడా జతకలవడంతో బేకర్ తన తొలి నాలుగు ఓవర్లలోనే 56 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బేకర్ బ్యాటర్‌గానూ దారుణంగా విఫలమయ్యాడు. తొలి బంతికే కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డై అరంగేట్రాన్ని పీడకలగా మార్చుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ సౌతాఫ్రికా చేతిలో దారుణ పరాజయాన్ని ఎదుర్కొంది. కేశవ్ మహారాజ్ (4/22), ముల్దర్ (3/33) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేస్తూ 24.3 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌గా వచ్చిన జేమీ స్మిత్ (54) అర్ద సెంచరీ చేయడంతో ఇంగ్లండ్ పరువు కాస్తైనా మిగిలింది.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో మార్క్రమ్ (55 బంతుల్లో 86) చెలరేగడంతో సౌతాఫ్రికా 20.5 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. ఈ లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలోనే సోన్నీ బేకర్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.
22 ఏళ్ల రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన బేకర్.. తాజాగా ముగిసిన హండ్రెడ్ లీగ్‌లో నార్తర్న్ సూపర్ ఛార్జర్స్‌పై హ్యాట్రిక్ సాధించి వార్తల్లో నిలిచాడు.