
టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను జాతీయ జట్టుకు ఆడే సమయంలో సెలక్షన్ విధానం వేరుగా ఉండేదని పేర్కొన్నాడు. కెప్టెన్లకు నచ్చితే అవకాశాలు వస్తూనే ఉంటాయని.. లేదంటే ఇలా వచ్చి అలా వెళ్లిపోవాల్సి ఉంటుందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు.
కాగా భారత మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకొన్నట్లు గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. అన్ని స్థాయిల్లోనూ ఆట నుంచి రిటైర్ అవుతున్నట్లు అతడు తెలిపాడు. కాగా 43 ఏళ్ల మిశ్రా తొలిసారి 2003లో భారత జట్టుకు వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు.
25 ఏళ్ల తర్వాత గుడ్‌బై చెబుతున్నా
మరో ఐదేళ్ల తర్వాత అతనికి టెస్టు ఆడే అవకాశం దక్కింది. భారత జట్టు తరఫున 2017లో మిశ్రా చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇక 2000–01 సీజన్‌లో తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడిన అమిత్ మిశ్రా 25 ఏళ్ల పాటు వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించడం విశేషం.
‘నా జీవితంలో అన్ని రకాలుగా భాగమైన క్రికెట్‌కు 25 ఏళ్ల తర్వాత గుడ్‌బై చెబుతున్నా. నా కెరీర్‌లో ఎన్నో విజయాలు, మలుపులు, భావోద్వేగాలు ఉన్నాయి. నా కెరీర్‌లో అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. మరో రూపంలో ఆటతో నా అనుబంధం కొనసాగుతుంది’ అని అమిత్ మిశ్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
తన అంతర్జాతీయ కెరీర్‌లో మిశ్రా 22 టెస్టుల్లో 35.72 సగటుతో మొత్తం 76 వికెట్లు పడగొట్టాడు. 36 వన్డేలు, 10 టీ20ల్లో కలిపి అమిత్ 80 వికెట్లు తీశాడు. 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టులో అతను సభ్యుడిగా ఉన్నాడు. తన కెరీర్‌లో ఎక్కువగా మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లిల సారథ్యంలోనే ఆడటం విశేషం.
కెప్టెన్లకు నచ్చితేనే
ఇక రిటైర్మెంట్ అనంతరం అమిత్ మిశ్రా హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. తనకు టీమిండియాలో అవకాశాలు తక్కువగా రావడం పట్ల స్పందించాడు. ‘‘నిజంగా ఓ ఆటగాడిని అన్నింటికంటే నిరాశపరిచే విషయం ఇదే. కొన్నిసార్లు జట్టులో ఉంటాము.. మరికొన్ని సార్లు మనల్ని ఎంపిక చేయరు.
మరికొన్నిసార్లు జట్టులో ఉన్నా.. ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఉండదు. ఇలాంటివి తరచూ జరుగుతూ ఉంటే విసుగు వస్తుంది. నా విషయంలో చాలాసార్లు ఇలాగే జరిగింది. కొంత మంది ఆటగాళ్లంటే కెప్టెన్లకు ఇష్టం.
కాబట్టి వారికి వరుస అవకాశాలు వస్తూ ఉంటాయి. అయినా.. అదో పెద్ద విషయం కాదు. ఏదేమైనా మనల్ని మనం నిరూపించుకుంటే అవకాశం అదే తలుపు తడుతుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనే అంతా ఉంది.
ఒకవేళ సెలక్టర్లు నన్ను పరిగణనలోకి తీసుకోలేదంటే.. ఫిట్‌నెస్, బ్యాటింగ్, బౌలింగ్.. ఇలా ఎందులో ఇంకా మెరుగవ్వాలని మాత్రమే ఆలోచించేవాడిని. టీమిండియాకు ఆడే ఛాన్స్ వచ్చినప్పుడల్లా నన్ను నేను నిరూపించుకున్నాడు. ఎల్లప్పుడూ కఠిన శ్రమ, అంకిత భావంతో పనిచేసే వాడిని’’ అని అమిత్ మిశ్రా చెప్పుకొచ్చాడు.
ధోనిని అడిగాను కూడా!
కాగా గతంలో ధోని జట్టులో తనకు స్థానం కరువు అవడం గురించి మిశ్రా స్పందించాడు. ‘‘జట్టు ఎంపిక సమయంలో చాలా అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు. మనం మన ఆటపై దృష్టి పెడితే చాలు. తుదిజట్టును కెప్టెన్ నిర్ణయిస్తాడు. నాకు ఎంఎస్ ధోనితో మంచి అనుబంధం ఉంది.
నన్ను ఎందుకు తీసుకోలేదని ఒకటి.. రెండు సందర్భాల్లో అతడిని అడిగాను. జట్టు కూర్పునకు అనుగుణంగానే నన్ను పక్కనపెట్టామని అతడు చెప్పాడు’’ అని అమిత్ మిశ్రా పేర్కొన్నాడు.
ఐపీఎల్‌లో సుదీర్ఘ కాలం తనదైన ముద్ర
ఇదిలా ఉంటే.. హరియాణా తరఫున రంజీ ట్రోఫీలో ఎన్నో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు నమోదు చేసిన మిశ్రా...బ్యాటింగ్‌లో కూడా కర్ణాటకపై డబుల్ సెంచరీ (202 నాటౌట్) సాధించడం విశేషం. ఇక ఐపీఎల్‌లో సుదీర్ఘ కాలం తనదైన ముద్ర వేసిన బౌలర్లలో అమిత్ మిశ్రా కూడా ఒకడు. 2008 నుంచి 2024 వరకు మధ్యలో ఒక సీజన్ మినహా ప్రతీసారి మిశ్రా ఐపీఎల్ బరిలోకి దిగాడు.
అంతేకాదు.. హైదరాబాద్, ఢిల్లీ, లక్నో తరఫున ఆడిన అతను 162 మ్యాచ్‌లలో 7.37 ఎకానమీతో 174 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఎనిమిదో స్థానంతో ముగించాడు. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో 3 హ్యాట్రిక్‌లు (2008, 2011, 2013) సాధించిన ఏకైన బౌలర్‌గా మిశ్రా నిలిచాడు.
చదవండి: కివీస్ క్రికెట్ దిగ్గజం సంచలన నిర్ణయం.. 41 ఏళ్ల వయసులో రీ ఎంట్రీ.. ఓ ట్విస్ట్