ఐపీఎల్-2026లో గుజరాత్ టైటాన్స్ ఐదో విజయాన్ని నమోదు చేసింది. గురువారం అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టైటాన్స్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. మొదట ఆర్సీబీని 155 పరుగులకే కట్టడి చేసిన గుజరాత్.. అనంతరం బ్యాటింగ్‌లోనూ సత్తాచాటింది.
15.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయంపై మ్యాచ్ అనంతరం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందిచాడు. ఈ గెలుపులో కీలక పాత్ర పోషించిన తమ బౌలర్లను గిల్ కొనియాడాడు.
"కీలక మ్యాచ్‌లో విజయం సాధించింనందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఇలాంటి వికెట్‌పై ప్రత్యర్ధి జట్టును 160 పరుగులలోపు కట్డడి చేయడం అంత సులువు కాదు. కానీ మా బౌలర్లు మాత్రం ఆసాధ్యాన్ని సుసాధ్యం చేశారు.
ఫీల్డింగ్‌లో కూడా మెరుగ్గా రాణించాము. గత మ్యాచ్‌తో పోలిస్తే ఈ రోజు అన్ని విభాగాల్లో మేము పై చేయి సాధించాము. ప్రతీ ఒక్కరూ జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. రెండో ఓవర్‌లో విరాట్ భాయ్ వరుస బౌండరీలతో విరుచుకుపడ్డారు. కానీ ఆ తర్వాత మేము పుంజుకున్న తీరు చాలా బాగుంది.
అతడి వికెట్‌తో తిరిగి మేము గేమ్‌లోకి వచ్చాము. నేనేమి ఈ మ్యాచ్‌లో ప్రత్యేక ప్రణాళికలతో బరిలోకి దిగలేదు. నేను ఒక రిథమ్‌లో ఉన్నాను అన్పించింది. మొదటి బంతికి కాస్త అదృష్టం తోడైంది, రెండో బంతి నాకు కావాల్సిన స్లాట్‌లో పడింది. దీంతో ఈ రోజునే నాదే అనుకున్నాను.
అందుకే బౌలర్లపై ఎదురుదాడికి దిగాను. ఇక తెవాటియా మా జట్టులో కీలక సభ్యుడు. ఈ రోజు అతడు మ్యాచ్ ఫినిష్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. జోస్ భాయ్ మ్యాచ్ ఫినిష్ చేస్తాడనుకున్నా. కానీ ఆ తర్వాత వరుసగా మూడు వికెట్లు కోల్పోయాము. ఆ బాధ్యతను తెవాటియా తీసుకుని మ్యాచ్‌ను ముగించాడు" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో గిల్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో గిల్ 43 పరుగులు చేశాడు.
చదవండి: IPL 2026: పాటిదార్‌ది అవుటా? నాటౌటా? రూల్స్ ఏమి చెబుతున్నాయి?


