ఆస్ట్రేలియాతో సిరీస్‌.. కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌..! | Shreyas Iyer Likely To Lead India A In Unofficial Tests vs Australia A, After Asia Cup Snub | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాతో సిరీస్‌.. కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌..!

Sep 6 2025 11:35 AM | Updated on Sep 6 2025 11:53 AM

Shreyas Iyer Likely To Lead India A In Unofficial Tests vs Australia A, After Asia Cup Snub

ఆసియా కప్‌-2025 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు ఓ బంపరాఫర్‌ వచ్చేలా ఉంది. త్వరలో స్వదేశంలో ఆస్ట్రేలియా-ఏతో జరుగబోయే రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్‌ సిరీస్‌ కోసం భారత-ఏ జట్టు కెప్టెన్‌గా ఎంపికవుతాడని సమాచారం. 

ఈ సిరీస్‌ కోసం శ్రేయస్‌తో పాటు నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అభిమన్యు ఈశ్వరన్‌, సాయి సుదర్శన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, రజత్‌ పాటిదార్‌, ఎన్‌ జగదీసన్‌, కరుణ్‌ నాయర్‌ తదితర ఆటగాళ్లు కూడా ఎంపికవుతారని తెలుస్తుంది.

శ్రేయస్‌ గతకొంతకాలంగా ఫార్మాట్లకతీతంగా రాణిస్తున్నప్పటికీ టీమిండియా ఆల్‌ ఫార్మాట్‌ ప్లేయర్‌ కాలేకపోతున్నాడు. భారత జట్టు తరఫున అతనికి వన్డే అవకాశాలు మాత్రమే వస్తున్నాయి. ఆటగాడిగానే కాకుండా కెప్టెన్‌గానూ సఫలుడైన శ్రేయస్‌ భారత టీ20, టెస్ట్‌ జట్లలో చోటు ఆశిస్తున్నాడు. 

గత ఐపీఎల్‌ సీజన్‌లో ఆటగాడిగా, కెప్టెన్‌గా సక్సెస్‌ సాధించి, పంజాబ్‌ కింగ్స్‌ను ఫైనల్స్‌కు చేర్చిన శ్రేయస్‌.. ఆ తర్వాత భారత్‌ ఛాంపియన్‌గా నిలిచిన ఛాంపియన్స్‌ ట్రోఫీ జట్టులో భాగంగా ఉన్నాడు.

త్వరలో ప్రారంభమయ్యే ఆసియా కప్‌ కోసం శ్రేయస్‌ అయ్యర్‌ను ఎంపిక చేస్తారని అంతా అనుకున్నారు. అయితే పోటీ అధికంగా ఉండటం చేత అతని ఎంపిక జరగలేదు. ఆటగాడిగా నిరూపించుకునేందుకు శ్రేయస్‌కు త్వరలో మరో ఛాన్స్‌ ఆస్ట్రేలియా-ఏ సిరీస్‌లో రూపంలో వచ్చే అవకాశం ఉంది. 

ఈ సిరీస్‌లో భారత-ఏ జట్టు ఆస్ట్రేలియా-ఏ జట్టుతో రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లు, ఆతర్వాత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడనుంది. టెస్ట్‌ మ్యాచ్‌లు లక్నోని ఎకానా స్టేడియంలో, వన్డేలు కాన్పూర్‌లోని గ్రీన్‌ పార్క్‌ స్టేడియంలో జరుగనున్నాయి.

ఈ మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు సెప్టెంబర్‌ 16 నుంచి భారత్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా-ఏ తరఫున కూడా చాలామంది స్టార్‌ ఆటగాళ్లు పాల్గొనే అవకాశం ఉంది. ఇదివరకే జాతీయ జట్టుకు ఆడి, ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఆటగాళ్లను ఆసీస్‌ సెలెక్టర్లు ఎంపిక చేయవచ్చు.

నిరాశపరిచిన శ్రేయస్‌, జైస్వాల్‌
శ్రేయస్‌తో పాటు ఆసియా కప్‌కు ఎంపిక కాని యశస్వి జైస్వాల్‌ ప్రస్తుతం దులీప్‌ ట్రోఫీ సెమీఫైనల్‌ ఆడుతున్నారు. వెస్ట్‌ జోన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఇద్దరు సెంట్రల్‌ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తక్కువ స్కోర్లకే (జైస్వాల్‌ 4, శ్రేయస్‌ 25) ఔటై నిరాశపరిచారు. శ్రేయస్‌, జైస్వాల్‌ నిరాశపరిచినా వారి జట్టు సహచరులు రుతురాజ్‌ గైక్వాడ్‌ (184), శార్దూల్‌ ఠాకూర్‌ (64), తనుశ్‌ కోటియన్‌ (76) సత్తా చాటారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement