
టెస్ట్ రీఎంట్రీపై గంపెడాశలతో స్వదేశంలో ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న అనధికారిక టెస్ట్ సిరీస్ బరిలోకి దిగిన టీమిండియా స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో అతను దారుణంగా విఫలమయ్యాడు. 13 బంతుల్లో బౌండరీ సాయంతో 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
గత కొంతకాలంగా టెస్ట్ జట్టులో చోటు ఆశిస్తున్న శ్రేయస్ ఈ సిరీస్‌లో సత్తా చాటి, త్వరలో స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగబోయే సిరీస్‌కు ఎంపిక కావాలని భావించాడు. అయితే అతని అంచనాలన్నీ తారుమారయ్యేలా ఉన్నాయి. భారత జట్టులో మిడిలార్డర్ బెర్త్‌ల కోసం శ్రేయస్‌తో పోటీపడుతున్న మిగతా ఆటగాళ్లందరూ సత్తా చాటుతున్నారు. శ్రేయస్ మాత్రమే వరుసగా విఫలమవుతున్నాడు (దులీప్ ట్రోఫీలోనూ (25, 12) నిరాశపరిచాడు).
మరోపక్క టీమిండియా బెర్త్ కోసం శ్రేయస్‌కు ప్రధాన పోటీదారుడైన సర్ఫరాజ్ ఖాన్ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోతున్నాడు. సర్ఫారాజ్ ఇటీవల బుచ్చిబాబు టోర్నీలో సెంచరీతో సత్తా చాటాడు.
శ్రేయస్‌కు మరో పోటీదారుడైన సాయి సుదర్శన్ ప్రస్తుతం ఆసీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అర్ద సెంచరీతో (73) మెరిశాడు. కొత్తగా ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ శ్రేయస్ పోటీదారుల జాబితాలో చేరాడు. రజత్ తాజాగా ముగిసిన దులీప్ ట్రోఫీలో అంచనాలకు మించి రాణించాడు (ఫైనల్లో సెంచరీ, సెమీఫైనల్లో అర్ద సెంచరీ).
దులీప్ ట్రోఫీ ఫైనల్లో రజత్ పాటు సెంచరీ చేసిన యశ్ రాథోడ్, సెమీ ఫైనల్లో భారీ సెంచరీ చేసిన రుతురాజ్ గైక్వాడ్ కూడా కొత్తగా శ్రేయస్ పోటీదారుల జాబితాలో చేరారు.
ఇంత పోటీ మధ్య వరుస వైఫల్యాల బాట పట్టిన శ్రేయస్ భారత టెస్ట్ జట్టులో చోటు ఆశించడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో 532 పరుగుల భారీ స్కోర్ చేసిన ఆసీస్-ఏకు భారత-ఏ జట్టు కూడా ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేస్తుంది. మూడో రోజు మూడో సెషన్ సమయానికి 4 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. అభిమన్యు ఈశ్వరన్ (44), ఎన్ జగదీసన్ (64), సాయి సుదర్శన్ (73), శ్రేయస్ అయ్యర్ (8) ఔట్ కాగా.. దేవ్‌దత్ పడిక్కల్ (39), ధృవ్ జురెల్ (31) క్రీజ్‌లో ఉన్నారు.
ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 262 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు ఆసీస్ తరఫున సామ్ కొన్‌స్టాస్ (109), వికెట్ కీపర్ జోష్ ఫిలిప్ (123 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కగా.. క్యాంప్‌బెల్ కెల్లావే (88), కూపర్ కన్నోల్లీ (70), లియమ్ స్కాట్ (81) సెంచరీలకు చేరువై ఔటయ్యారు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు.
కాగా, రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు, మూడు అనధికారిక వన్డేల కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. భారత-ఏ టెస్ట్ జట్టుకు శ్రేయస్ అయ్యరే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.