పాక్‌తో టెస్టు.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ | Shanto Becomes 1st Bangladesh Captain To Score Test 100 Vs Pakistan | Sakshi
Sakshi News home page

పాక్‌తో టెస్టు.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌ కెప్టెన్‌

May 8 2026 5:43 PM | Updated on May 8 2026 7:03 PM

Shanto Becomes 1st Bangladesh Captain To Score Test 100 Vs Pakistan

బంగ్లాదేశ్‌ టెస్టు జట్టు కెప్టెన్‌ నజ్ముల్‌ హుసేన్‌ షాంటో సరికొత్త చరిత్ర సృష్టించాడు. బంగ్లా సారథులకు ఇప్పటి వరకు సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడేందుకు పాకిస్తాన్‌ జట్టు ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తోంది.

ఆదిలోనే షాకులు
ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య ఢాకా వేదికగా శుక్రవారం తొలి టెస్టు మొదలైంది. షేరే బంగ్లా జాతీయ స్టేడియం వేదికగా టాస్‌ గెలిచిన పర్యాటక పాకిస్తాన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఆదిలోనే షాకులు తగిలాయి.

ఓపెనర్లు మహ్మదుల్‌ హసన్‌ జాయ్‌ (8), షాద్మన్‌ ఇస్లాం (13) స్వల్ప వ్యవధిలోనే అవుటయ్యారు. ఈ క్రమంలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ మొమినుల్‌ హక్‌తో కలిసి కెప్టెన్‌ నజ్ముల్‌ హుసేన్‌ షాంటో ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు.

శతక్కొట్టి.. చరిత్ర సృష్టించి..
మొత్తంగా 200 బంతులు ఎదుర్కొన్న మొమినుల్‌ హక్‌ 10 ఫోర్ల సాయంతో 91 పరుగులు చేశాడు. అయితే, నొమన్‌ అలీ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంలో హక్‌ సెంచరీకి తొమ్మిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇక నాలుగో నంబర్‌ బ్యాటర్‌ షాంటో మాత్రం శతకం పూర్తి చేసుకోగలిగాడు.

మొత్తంగా 130 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 101 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే నజ్ముల్‌ హుసేన్‌ షాంటో సరికొత్త చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్‌ తరఫున టెస్టుల్లో పాకిస్తాన్‌పై సెంచరీ చేసిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు.

ఇదిలా ఉంటే.. శుక్రవారం నాటి తొలిరోజు ఆట పూర్తయ్యేసరికి బంగ్లాదేశ్‌ 85 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 301 పరుగులు చేసింది. మొమినుల్‌, షాంటోలతో పాటు.. సీనియర్‌ బ్యాటర్‌ ముష్పికర్‌ రహీం రాణించాడు. రహీం 48, లిటన్‌ దాష్‌ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. పాకిస్తాన్‌ బౌలర్లలో షాహిన్‌ ఆఫ్రిది, మొహమ్మద్‌ అబ్బాస్‌, హసన్‌ అలీ, నొమన్‌ అలీ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

పాకిస్తాన్‌పై టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బంగ్లాదేశ్‌ కెప్టెన్లు
👉నజ్ముల్‌ హుసేన్‌ షాంటో- 130 బంతుల్లో 101 రన్స్‌
👉ముష్ఫికర్‌ రహీం- 143 బంతుల్లో 53 రన్స్‌
👉ముష్ఫికర్‌ రహీం- 88 బంతుల్లో 49 రన్స్‌
👉మొమినుల్‌ హక్‌- 93 బంతుల్లో 41 రన్స్‌.

చదవండి: ఓ 4 పాస్‌లు ఇస్తే ఏమౌతుంది?.. ఐపీఎల్‌ చైర్మన్‌ స్ట్రాంగ్‌ రియాక్షన్‌!

Advertisement
 
Advertisement
Advertisement