Novak Djokovic: ఆర్థిక ఇబ్బందులు! కొడుకు కోసం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి.. ఇప్పుడిలా

Serbia Tennis Star Novak Djokovic Life History UnKnown Facts - Sakshi

22 మే,1999.. బెల్‌గ్రేడ్‌ నగరంలో తనకిష్టమైన టెన్నిస్‌ కోర్టులో జొకోవిచ్‌ 12వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకొనేందుకు సిద్ధమయ్యాడు. ఒక వైపు తల్లిదండ్రులు హ్యపీ బర్త్‌డే అంటూ పాడుతున్నారు. ఆ కుర్రాడిలో సంతోషం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

అదే సమయంలో ఒక్కసారిగా సైరన్‌ మోత.. పెద్ద శబ్దాలతో యుద్ధ విమానాలు తమపై నుంచే వెళ్లసాగాయి. మరో వైపు నుంచి దూసుకొచ్చిన పెద్ద బాంబు తమకు సమీపంలోనే పడింది. అంతే వారంతా ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగెత్తిపోయారు. బాంబు దాడితో కొద్ది దూరంలోనే ఉన్న పవర్‌ స్టేషన్‌ కుప్పకూలడంతో ఆ ప్రాంతమంతా చీకటి అలుముకుంది.

అందరిలోనూ తీవ్రమైన భయం. యూగస్లావియా యుద్ధం సాగుతున్న ఆ టైమ్‌లో ఇలాంటి దృశ్యాలను చాలాసార్లే చూశారు అక్కడి ప్రజలు. జొకోవిచ్‌ కూడా అలాంటి స్థితిని ఎదుర్కొన్నవాడే. 78 రోజుల పాటు సాగిన ఆ యుద్ధంలో బెల్‌గ్రేడ్‌పై బాంబుల దాడి కొనసాగింది.

అలాంటి వాతావరణం నుంచి ఎదిగిన జొకోవిచ్‌ కఠోర శ్రమ, పోరాటంతో టెన్నిస్‌ ప్రపంచాన్ని శాసించే స్థితికి చేరాడు. యుద్ధం కొనసాగిన సమయంలోనూ 12 ఏళ్ల జొకో ప్రాక్టీస్‌ ఆపలేదు. ఒకరోజు ఒకచోట బాంబు పడితే మరుసటిరోజు మరో చోటకు వెళ్లి ప్రాక్టీస్‌ చేసేవాడు.

వరుసగా రెండు రోజుల పాటు ఒకే చోట బాంబులు వేయరనేది వారి నమ్మకం. 24 గ్రాండ్‌స్లామ్‌లు గెలుచుకోవడం, రికార్డు స్థాయిలో వరల్డ్‌ నంబర్‌వన్‌గా కొనసాగడం, లెక్కలేనన్ని ఘనతలు ఖాతాలో వేసుకోవడం మాత్రమే జొకోవిచ్‌ను గొప్పవాడిగా మార్చలేదు. ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా ఎదురొడ్డి అత్యుత్తమ స్థాయికి చేరిన తీరు ఈ సెర్బియా స్టార్‌ను అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టింది. 

ప్రతి వీథిలో అతని పోస్టర్‌
2011లో జొకోవిచ్‌ మొదటిసారి వింబుల్డన్‌ టైటిల్‌ గెలిచినప్పుడు సెర్బియా దేశం మొత్తం ఊగిపోయింది. ఒకప్పుడు యుద్ధానికి కేరాఫ్‌ అడ్రస్‌గా.. చరిత్రలో చెడ్డపేరుతో గుర్తొచ్చిన దేశం నుంచి ఒక స్టార్‌ పుట్టడం ఆ దేశవాసులకు అమితానందాన్ని పంచింది. ప్రతి వీథిలో అతని పోస్టర్‌ వెలసింది.

సిగరెట్‌ లైటర్లు, క్యాండీ బ్యాగ్‌లు, కీ చైన్‌లు ఎక్కడ చూసినా అతనే కనిపించాడు. సెర్బియాకు ఒక కొత్త హీరో అవసరం అనిపించింది. జొకోవిచ్‌ ఆ స్థానాన్ని అందుకోగలిగాడు. అతను స్వదేశానికి తిరిగొచ్చినప్పుడు బెల్‌గ్రేడ్‌లో లక్ష మందితో స్వాగతం లభించింది. దేశాధ్యక్షుడు ‘నా పదవీ నువ్వే తీసుకో’ అంటూ జోక్‌ కూడా చేశాడు.

అమెరికాతో పాటు అగ్రశ్రేణి యూరోపియన్‌ దేశాల్లో ఉండే సౌకర్యాలు, ప్రోత్సాహంతో పోలిస్తే సెర్బియాలాంటి చోట నుంచి టెన్నిస్‌లో ఒక ఆటగాడు పై స్థాయికి రావడం అసంభవం. అలాంటిది జొకోవిచ్‌ సాధారణ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. ప్రపంచ టెన్నిస్‌లో అత్యంత విజయవంతమైన ప్లేయర్‌గా నిలిచాడు.

ఇంతకన్నా అద్భుతం ఏముంటుంది! యుద్ధం తనలో మరింత పట్టుదలను పెంచిందని, ఎలాంటి స్థితిలోనైనా పోరాడాలనే స్ఫూర్తిని నింపిందని అతను చెప్పుకున్నాడు. ఇంకా చెప్పాలంటే ఏదీ సులువుగా దక్కదని, లభించిన ప్రతిదానినీ గౌరవించాలనే విషయాన్ని తెలుసుకున్నానని అంటాడు. 

ఒకే ఒక లక్ష్యంతో..
జొకోవిచ్‌ది సాధారణ కుటుంబ నేపథ్యం. తల్లిదండ్రులిద్దరూ కలసి బేకరీ నిర్వహించేవాళ్లు. వారి షాప్‌ ఎదురుగా ఉండే ఒక టెన్నిస్‌ కోచింగ్‌ సెంటర్‌ కారణంగా అతనికి ఆ ఆటపై ఆసక్తి కలిగింది. సరిగ్గా నాలుగో ఏట.. 1991లో తొలిసారి టెన్నిస్‌ రాకెట్‌ పట్టాడు.

అప్పటివరకు స్కీయింగ్, ఫుట్‌బాల్‌లను ఇష్టపడ్డా చివరకు టెన్నిస్‌ వైపే అతని అడుగులు పడ్డాయి. స్కూల్లో ఉన్నప్పుడు సరదాగా ఆడుకునేందుకు స్నేహితులు ఎప్పుడు పిలిచినా అతను వెళ్లలేదు. టెన్నిస్‌ మాత్రమే ఆడతానంటూ ఠంచనుగా ప్రాక్టీస్‌కు హాజరైపోయేవాడు.

దేశం వదలక తప్పదు
ఏడేళ్ల ప్రాథమిక శిక్షణ తర్వాత ఇక తాను అతనికి నేర్పించేదేమీ లేదని తొలి కోచ్‌ జెలెనా జెన్‌సిచ్‌ స్పష్టం చేసింది. ‘మీ అబ్బాయి టెన్నిస్‌లో ఎదగాలి అనుకుంటే దేశం వదలక తప్పద’ని చెప్పింది. దాంతో తల్లిదండ్రులు 12 ఏళ్ల జొకోను జర్మనీలోని మ్యూనిక్‌కు పంపించారు ప్రత్యేక శిక్షణ కోసం! దీనికోసం వారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు.

సహాయం చేసేవారు లేక చాలాసార్లు అధిక వడ్డీలకు అప్పులూ తెచ్చారు. ఇందుకు ఒకే ఒక్క కారణం తమ అబ్బాయి ప్రతిభపై ఉన్న నమ్మకమే! ఏదో ఒకరోజు అతను అద్భుతాలు చేస్తాడని విశ్వసించారు. జొకో వారి నమ్మకాన్ని వమ్ము చేయలేదు.

అద్భుతమైన కెరీర్‌కు అంకురార్పణ
శిక్షణ ఫలితాలు రెండేళ్ల తర్వాత రావడం మొదలుపెట్టాయి. 14వ ఏట యూరోపియన్‌ చాంపియన్‌షిప్‌లో మూడు పతకాలు గెలవడంతో పాటు వరల్డ్‌ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో అతను రన్నరప్‌గా నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించాడు. 16 ఏళ్ల వయసులో తొలిసారి ఏటీపీ పాయింట్లు అతని ఖాతాలో చేరడంతో జొకో భవిష్యత్తు ఏమిటో స్పష్టంగా తెలిసిపోయింది.

తర్వాతి ఏడాదే సెర్బియా జాతీయ జట్టు తరఫున డేవిస్‌ కప్‌ ఆడాడు. అదే జోరు కొనసాగిస్తూ 19 ఏళ్ల వయసులో అతను తన తొలి ఏటీపీ టైటిల్‌ను గెలుచుకోవడంతో అద్భుతమైన కెరీర్‌కు అంకురార్పణ జరిగింది. 2006లో నెదర్లాండ్స్‌లోని అమర్స్‌ఫూర్ట్‌లో అతను ఈ విజయాన్ని అందుకున్నాడు. అదే ఏడాది ఫ్రాన్స్‌లోని మెట్జ్‌లోనూ విజేతగా నిలవడంతో టాప్‌–20 ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్న పిన్న వయస్కుడిగా జొకోవిచ్‌ నిలిచాడు. 

గ్రాండ్‌స్లామ్‌ ప్రస్థానం..
టెన్నిస్‌లో ఏ ఆటగాడికైనా ఒక్క గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ అయినా గెలవాలనేది కల. ఇతర ఎన్ని టోర్నీల్లో విజేతగా నిలిచినా.. ఒక్క గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ ఆటగాడి కెరీర్‌నే మార్చేస్తుంది. తొలి మూడు సీజన్లలో నాలుగు గ్రాండ్‌స్లామ్స్‌లోనూ ఆడి ఒకసారి ఫైనల్‌ వరకు చేరినా ట్రోఫీ దక్కలేదు.

అయితే జొకోవిచ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు కలగన్న సమయం 2008లో.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ రూపంలో వచ్చింది. ఫైనల్లో విల్‌ఫ్రెండ్‌ సోంగాను ఓడించి తొలిసారి మేజర్‌ టైటిల్‌ను జొకో ముద్దాడాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా గడ్డతో అనుబంధం ఎంతగా పెనవేసుకుపోయిందంటే అదే గ్రాండ్‌స్లామ్‌ను అతను మరో తొమ్మిదిసార్లు సొంతం చేసుకోగలిగాడు.

తర్వాతి రెండేళ్లు గ్రాండ్‌స్లామ్‌ దూరమైనా.. 2011లో అతని అద్భుతమైన ఆట మళ్లీ స్థాయిని పెంచింది. ఒకే ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్‌లతో వన్నె తగ్గని ప్రతిభను కనబరచాడు. ఆ తర్వాత ఇంకెన్నో గొప్ప విజయాలు, మరెన్నో సంచలనాలను ఝుళిపించిందా రాకెట్‌. ఇక వరల్డ్‌ నంబర్‌వన్‌గా అతని కీర్తి అసాధారణం.

2011లో తొలిసారి అగ్రస్థానాన్ని అందుకున్న అతను వేర్వేరు దశల్లో (ఎనిమిది సార్లు) కలిపి ఏకంగా 400 వారాల పాటు వరల్డ్‌ నంబర్‌వన్‌గా నిలిచాడు. ఈ ఘనత సాధించిన తొలి, ఏకైక ఆటగాడిగా తన ర్యాంక్‌ను పటిష్ఠం చేసుకున్నాడు. రెండోస్థానంలో ఉన్న ఫెడరర్‌ (310 వారాల) ఒక్కడే 300 వారాలు దాటిన మరో ఆటగాడు కావడం జొకో స్థాయిని చూపిస్తోంది. 

అభిమానులతోనూ తలపడి..
2011 యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌లో సెమీఫైనల్‌ మ్యాచ్‌.. అప్పటికే దిగ్గజంగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్‌ ప్లేయర్‌ రోజర్‌ ఫెడరర్‌తో మూడు గ్రాండ్‌స్లామ్‌ల విజేత నొవాక్‌ జొకోవిచ్‌ తలపడుతున్నాడు. న్యూయార్క్‌లోని ఫ్లషింగ్‌ మెడోస్‌ మైదానమంతా ఫెడరర్‌ నామస్మరణతో ఊగిపోతోంది. అతని ఆటను అభిమానించడంతో పాటు అతనికున్న మంచి అబ్బాయి ఇమేజ్‌ కూడా అందుకు ఒక కారణం కావచ్చు.

జొకోవిచ్‌ విషయానికి వస్తే.. అప్పుడప్పుడు తన వివాదాస్పద వ్యాఖ్యలు, చేష్టలతో వార్తల్లో నిలిచిన అతనంటే సామాన్య ప్రేక్షకులకు సదభిప్రాయం లేదు. బాగా ఆడుతున్న మరో ఆటగాడిని కూడా కనీసం గౌరవించాలనే ఆలోచన వారిలో కనిపించలేదు. సరిగ్గా చెప్పాలంటే 24 వేల మంది ఉన్న స్టేడియంలో 23 వేల మంది ఫెడరర్‌కు మద్దతు పలుకుతున్నారు.

అదే హుషారుతో ఫెడరర్‌ తొలి రెండు సెట్‌లు గెలుచుకున్నాడు. ఇక ఫైనల్‌ చేరడమే తరువాయి అన్నట్లుంది ఆ పరిస్థితి. కానీ జొకోవిచ్‌ పట్టు వదల్లేదు. ప్రత్యర్థితో పాటు ప్రేక్షకులతోనూ తలపడేందుకు సిద్ధమయ్యాడు. ఒక్కసారిగా తన అత్యుత్తమ ప్రదర్శనను బయటకు తెచ్చి జొకోవిచ్‌ చెలరేగిపోయాడు.

అంతే.. అతని పదునైన షాట్లకు బదులివ్వలేక ఫెడరర్‌ అనూహ్య రీతిలో తడబడ్డాడు. దూకుడును కొనసాగించిన జొకో వరుసగా మూడు సెట్‌లు గెలిచి ఫైనల్లోకి ప్రవేశించాడు. మ్యాచ్‌ గెలిచాక జొకోవిచ్‌.. ‘మీ అంత మంచి అభిమానులు ఎక్కడా ఉండరు. ఎందుకంటే నేను మానసికంగా ఇంకా దృఢంగా, గ్రానైట్‌లా మారేందుకు మీరు సహకరించారు’ అంటూ వ్యాఖ్యానించాడు.

ఇలాంటి వ్యక్తిత్వమే జొకోవిచ్‌ను అందరికంటే భిన్నంగా నిలబెట్టింది. ప్రతిష్ఠాత్మక గ్రాండ్‌స్లామ్‌ల వేటలో మిగతా ఇద్దరు ఫెడరర్, నాదల్‌లతో పోలిస్తే జొకోవిచ్‌ దాటిన ప్రతికూలతలు అసాధారణం. అతని సరదా చేష్టలు అతనికి జోకర్‌ అనే పేరును తెచ్చిపెట్టాయి. సీరియస్‌ ఆటలో అతనో కమేడియన్‌ అంటూ కామెంట్లు వినిపించాయి.

ఓడినప్పుడు ఆగ్రహావేశాలతో రాకెట్లు విరగొట్టినప్పుడు ఏమాత్రం క్రీడాస్ఫూర్తి లేని ఆటగాడు ప్రపంచటెన్నిస్‌ చరిత్రలో ఇతనొక్కడే అంటూ విమర్శలూ వినిపించాయి. ఒక దశలో టెన్నిస్‌ అభిమానులంతా మాకు నచ్చని ఆటగాడు అతనే అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి కాదు.. ఎన్నోసార్లు మైదానంలో అతనికి కనీస మద్దతు కూడా లభించలేదు.

కానీ ఎప్పుడూ దానిపై అతను ఫిర్యాదు చేయలేదు. ‘నేనేంటో నా ఆటతోనే చూపిస్తాను’ అంటూ చెలరేగి.. అత్యున్నత స్థానానికి చేరాడు. ‘ఇలాంటివి నన్ను మరింత దృఢంగా మార్చాయే తప్ప నన్ను కుంగదీయలేదు’ అన్న జొకోవిచ్‌ ఇప్పటికీ తనకు నచ్చినట్లుగానే ఆడుతున్నాడు.. గెలుస్తున్నాడు!
-మొహమ్మద్‌ అబ్దుల్‌ హాది 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top