
2 అనధికారిక టెస్ట్‌లు, 3 అనధికారిక వన్డే సిరీస్‌ల కోసం న్యూజిలాండ్-ఏ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఇందులో భాగంగా ఇవాళ (ఆగస్ట్ 31) ముగిసిన తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్-ఏ జట్టు 225 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. కివీస్ ఆల్‌రౌండర్ స్కాట్ కుగ్గెలిన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు.
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసిన కుగ్గెలిన్..
తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్‌లో (2) నిరాశపర్చిన కుగ్గెలిన్.. బంతితో చెలరేగి 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన కుగ్గెలిన్ 85 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీని తర్వాత మరోసారి బంతితో చెలరేగిపోయిన కుగ్గెలిన్.. 4 వికెట్లు తీసి ప్రత్యర్ధి పతనాన్ని శాశించాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో సెంచరీ, 9 వికెట్లతో ఇరగదీసిన కుగ్గెలిన్, ఒంటిచేత్తో ఆసీన్‌ను మట్టికరిపించాడు.
ఆధిక్యం లభించినా నిలబెట్టుకోలేకపోయిన ఆసీస్..
ఈ మ్యాచ్‌లో ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం లభించినా నిలబెట్టుకోలేక ఓటమిపాలైంది. కివీస్ తొలుత బ్యాటింగ్ చేస్తూ స్వెప్సన్ (3/19), బకింగ్హమ్ (3/29) ధాటికి 147 పరుగులకు కుప్పకూలగా.. కుగ్గెలిన్ (5/74) దెబ్బకు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది.
అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్‌లో కోలుకున్న కివీస్.. కుగ్గెలిన్ (101 నాటౌట్) అజేయ శతకంతో విరుచుకుపడటంతో 468 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. కివీస్ ఇన్నింగ్స్‌లో కుగ్గెలిన్‌తో పాటు సోలియా (91), టామ్ బ్రూస్ (51), ముహమ్మద్ అబ్బాస్ (55) అర్ధశతకాలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో స్టీకీట్, మిచెల్ పెర్రీ తలో 4 వికెట్లు పడగొట్టగా.. బకింగ్హమ్ 2 వికెట్లు దక్కించుకున్నాడు.
కుగ్గెలిన్ ధాటికి కుప్పకూలిన ఆసీస్..
భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్-ఏ జట్టు.. మరోసారి కుగ్గెలిన్ (4/39) రెచ్చిపోవడంతో 127 పరుగులకే బిచానా సర్దేసింది. కుగ్గెలిన్‌కు సోలియా (3/15), జాకబ్ డఫ్ఫీ (1/23), ర్యాండెల్ (1/34) సహకరించారు. ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో బాన్‌క్రాఫ్ట్ (47) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో రెండో టెస్ట్ సెప్టెంబర్ 4న మొదలుకానుంది.