అలా చూసుకుంటే ధవన్‌ రేసు నుంచి తప్పుకున్నట్లే..

Sanjay Manjrekar Says Shikhar Dhawan Fallen Out Of Race For Opening Slot - Sakshi

అహ్మదాబాద్‌: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో ఇషాన్‌ కిషన్‌ ఓపెనింగ్‌ స్థానంలో వచ్చి దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతని అద్భుత ప్రదర్శనతో టీమిండియా మేనేజ్‌మెంట్‌కు పెద్ద ఇబ్బంది వచ్చిపడింది. అదే టీమిండియా ఓపెనింగ్‌ స్లాట్‌.. రానున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని మేనేజ్‌మెంట్‌ ఓపెనింగ్‌ స్థానంలో చాలామంది ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తుంది. ఇప్పటికే కేఎల్‌ రాహుల్‌ కూడా ఓపెనర్‌ స్థానానికి పోటీలో ఉండడం.. ఇదివరకు టీమిండియా ఓపెనర్‌గా సత్తా చాటిన శిఖర్‌ ధవన్‌తో పాటు తాజాగా ఇషాన్‌ కిషన్‌ వచ్చి చేరాడు. దీంతో రోహిత్‌తో ఎవరిని ఓపెనింగ్‌ ఆడించాలనేది పెద్ద తలనొప్పిగా మారింది. ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్‌ .. వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ స్పందించాడు.

''ఇప్పటి పరిస్థితుల దృష్యా శిఖర్‌ ధవన్‌ డేంజర్‌​ జోన్‌లో ఉన్నాడు. ఇషాన్‌ కిషన్‌, కేఎల్‌ రాహుల్‌ నుంచి తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో ధవన్‌ ఒక అడుగు వెనుకపడినట్లే. ఇక రాహుల్‌ విషయానికి వస్తే రెండేళ్లుగా అతను టీ20ల్లో ఇరగదీస్తున్నాడు. అతని ఫామ్‌ దృష్యా అతను ఏ స్థానంలో ఆడడానికైనా సిద్ధంగా ఉన్నాడు కాబట్టి అతని గురించి ఎక్కువ ఆలోచించనవసరం లేదు. కానీ ధవన్‌ విషయంలో అలా కాదు.. అతను మొదట్నుంచి ఓపెనింగ్‌ స్థానంలోనే బ్యాటింగ్‌ చేస్తూ వస్తున్నాడు.

ఐపీఎల్‌ 2020 సీజన్‌లో అద్బుత బ్యాటింగ్‌తో ఢిల్లీని ఫైనల్‌ చేర్చిన ధవన్‌ ఆ ఫామ్‌ను ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో మాత్రం చూపించలేకపోయాడు. తొలి టీ20లో ఆడిన ధవన్‌ 12 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. ధవన్‌ విఫలం కావడం.. మొదటి రెండు టీ20లకు రోహిత్‌ విశ్రాంతిలో ఉండడంతో ఇషాన్‌ కిషన్‌కు అవకాశమిచ్చారు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే తానెంత ప్రమాదకారో ఇషాన్‌ తెలియజెప్పాడు. దీంతో అతన్ని పక్కకు తప్పించే అవకాశాలు లేవు. అలా చూసుకుంటే ధవన్‌ రేసు నుంచి వెనుకబడ్డట్లే. మొదటి రెండు టీ20లకు దూరమైన రోహిత్‌ మూడో టీ20లో కచ్చితంగా ఆడుతాడు.. అతను ఎప్పటికైనా ప్రమాదకారే.. ఫాంలో ఉంటే అతన్ని ఆపడం ఎవరి తరం కాదు. అతని గురించి ఎక్కువగా చెప్పుకోవడానికి లేదు'' అంటూ తెలిపాడు. ఇక ఇంగ్లండ్‌, టీమిండియాల మధ్య మూడో టీ20 నేడు జరగనుంది.

చదవండి:
'పేడ మొహాలు,చెత్త గేమ్‌‌ప్లే అంటూ..'

ఇషాన్‌ కిషన్‌ ఇంకా అదే భ్రమలో ఉన్నాడు: సెహ్వాగ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top