ఐపీఎల్-2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ యువ సంచలనం సమీర్ రిజ్వీ తన మెరుపు బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కేఎల్ రాహుల్ వంటి స్టార్ బ్యాటర్ విఫలమవుతున్న చోట రిజ్వీ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఈ యూపీ ఆటగాడు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఒంటి చేత్తో ఢిల్లీ క్యాపిటల్స్‌ను గెలిపించాడు.
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ 6 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో రిజ్వీ(70 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అదే పరిస్థితి. 163 పరుగుల లక్ష్య చేధనలో ఢిల్లీ 8 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మళ్లీ రిజ్వీనే తన సంచలన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు.
కేవలం 51 బంతుల్లోనే 90 పరుగులు చేసి ఢిల్లీకి రెండో విజయాన్ని అందించాడు. ఐపీఎల్ చరిత్రలో 'ఇంపాక్ట్ ప్లేయర్'గా వచ్చి అత్యధిక స్కోరు సాధించిన రెండో ఆటగాడిగా రిజ్వీ రికార్డులెక్కాడు. రిజ్వీ ప్రస్తుతం 160 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. ఢిల్లీ ఆడిన రెండు మ్యాచ్‌లలో కూడా రిజ్వీకే ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కడం గమనార్హం.
భారత జట్టులోకి ఎంట్రీ?
మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడుతున్న సమీర్ రిజ్వీని భారత జట్టుకు ఎంపిక చేయాలని చాలా మంది మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ప్రస్తుత భారత టీ20 జట్టులో టాపార్డర్ పటిష్టంగా కన్పిస్తున్నప్పటికి మిడిలార్డర్ కొంచెం వీక్‌గానే ఉంది. దీంతో రిజ్వీ లాంటి ధీటైన బ్యాటర్ జట్టులోకి వస్తే భారత మిడిలార్డర్ మరింత పటిష్టంగా మారనుంది.
అయితే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ రిజ్వీ ప్రదర్శలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. భారత జట్టు ఈ ఏడాది జూన్‌లో భారత్ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌కు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది.
దీంతో భారత జట్టులో రిజ్వీకి చోటు దక్కే ఛాన్స్ ఉందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు గత కొంత కాలంగా ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దమ్ములేపుతున్న వైభవ్ సూర్యవంశీని కూడా సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ యువ సంచలనం ఇటీవల తన 15వ ఏట అడుగుపెట్టడంతో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రానికి అర్హత సాధించాడు. అతడితో పాటు భారత అండర్-19 కెప్టెన్ అయూశ్ మాత్రే కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఏడాది జూన్‌లో భారత అండర్-19 జట్టు రెడ్ బాల్ సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఒకవేళ ఈ టూర్‌కు మాత్రే, వైభవ్ ఎంపిక అయితే సీనియర్ జట్టులో వచ్చేందుకు వేచి ఉండక తప్పదు. అంతేకాకుండా భారత సీనియర్ జట్టులో ఇప్పటికే అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ రూపంలో ముగ్గురు ఓపెనర్లుగా ఉన్నారు. వీరి ముగ్గరు కూడా ఓపెనర్లగా విజయవంతమయ్యారు. వీరి గైర్హజారీలో వైభవ్‌కు భారత జట్టులో చోటు దక్కే అవకాశముంది. ఏదేమైనప్పటికి సమీర్ రిజ్వీ అంతర్జాతీయ అరంగేట్రం మాత్రం ఖాయమైనట్లు తెలుస్తోంది.
చదవండి: భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్!


