
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ యువ సంచలనం సాయి సుదర్శన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సుదర్శన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 61 బంతుల్లో 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో అజేయంగా 108 పరుగులు చేశాడు.
అతడి విధ్వంసర ఇన్నింగ్స్ ఫలితంగా 200 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ వికెట్ నష్టపోకుండా ఛేదించింది. అతడితో పాటు గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కూడా 93 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో సాయి సుదర్శన్‌పై భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ప్రశంసల వర్షం కురిపించాడు.
సుదర్శన్ తన ప్రదర్శనలతో టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను మించిపోయాడని జడేజా కొనియాడాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో సుదర్శన్ 12 మ్యాచ్‌లు ఆడి 56.10 సగటుతో 617 పరుగులు సాధించాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ సాయిసుదర్శన్ వద్దే ఉంది.
"సాయి సుదర్శన్ అద్బుతమైన బ్యాటర్. అతడి బ్యాటింగ్ టెక్నిక్ చాలా బాగుంది. ఈ ఏడాది సీజన్‌లో సుదర్శన్ తన ప్రదర్శనలతో శుబ్‌మన్ గిల్‌ను మించిపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఒక్క మ్యాచ్‌లోనే కాదు, అంతకుముందు మ్యాచ్‌లలో కూడా గిల్ కంటే మెరుగ్గా రాణించాడు.
శుబ్‌మన్‌తో పోలిస్తే సుదర్శన్ ఎటువంటి రిస్క్ తీసుకోకుండా బ్యాటింగ్ చేస్తున్నాడు. నిన్నటి మ్యాచ్‌లో తొలుత గిల్ బంతిని టైమ్ చేయడానికి కాస్త కష్టపడ్డాడు. గిల్ బంతిని స్టాండ్స్‌కు తరలించేందుకు తన బలాన్ని మొత్తాన్ని ఉపయోగించాడు. కానీ సాయి విషయంలో మాత్రం అలా జరగలేదు. అతడు చాలా సులువుగా షాట్లు ఆడాడు" అని స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జడేజా పేర్కొన్నాడు.
చదవండి: ఐపీఎల్-2025లో దారుణ ప్రదర్శన.. కేకేఆర్ హెడ్ కోచ్‌పై వేటు?