టీమిండియా గెలుపుపై సచిన్‌ అలా.. కోహ్లి ఇలా.. | Sachin Cant keep Calm After Gill Wins 1st Test As captain Kohli Post Viral | Sakshi
Sakshi News home page

టీమిండియా గెలుపుపై సచిన్‌ అలా.. కోహ్లి ఇలా..

Jul 7 2025 1:44 PM | Updated on Jul 7 2025 3:03 PM

Sachin Cant keep Calm After Gill Wins 1st Test As captain Kohli Post Viral

ఇంగ్లండ్‌ గడ్డ మీద టీమిండియా చారిత్రాత్మక టెస్టు​ విజయం నేపథ్యంలో భారత దిగ్గజ క్రికెటర్లు సచిన్‌ టెండుల్కర్‌ (Sachin Tendulkar), విరాట్‌ కోహ్లి (Virat Kohli) హర్షం వ్యక్తం చేశారు. యువ సారథి శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill)తో పాటు జట్టును అభినందించారు. కాగా ప్రసిద్ధ ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో టీమిండియా తొలిసారి గెలుపు జెండా ఎగురవేసిన విషయం తెలిసిందే. 

దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్పిన్‌ లెజెండ్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ టెస్టు రిటైర్మెంట్‌ తర్వాత.. తొలిసారిగా విదేశీ పర్యటనకు వెళ్లిన యువ జట్టు.. ఈ అద్భుతం చేసింది.

కెప్టెన్‌గా తొలి టెస్టులో ఓటమిని చవిచూసినప్పటికీ రెండో టెస్టులో మాత్రం శుబ్‌మన్‌ గిల్‌.. గత తప్పిదాలను పునరావృతం కానీయలేదు. ఇటు బ్యాటర్‌గా.. అటు సారథిగా అదరగొట్టి భారత్‌కు చిరస్మరణీయ విజయం అందించాడు.

ఆకాశ్‌పై ప్రశంసలు
ఈ నేపథ్యంలో టీమిండియాతో పాటు గిల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ స్పందిస్తూ... ‘‘టీమిండియా అద్భుత టెస్టు విజయం సాధించినందుకు నీకు శుభాకాంక్షలు గిల్‌. రిషభ్‌ పంత్‌, కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా కూడా అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో అదరగొట్టారు.

టీమిండియా తన వ్యూహాలతో ఇంగ్లండ్‌ తమ ఆట తీరును మార్చుకునేలా చేసింది. ప్రత్యర్థిపై పైచేయి సాధించి గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్‌ అద్భుతం. ఇక ఆకాశ్‌ దీప్‌ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది?!... 

జో రూట్‌కు అతడు వేసిన బంతిని ‘బాల్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా చెప్పుకోవచ్చు. అంతేకాదు.. జాంటీరోడ్స్‌ మాదిరి మహ్మద్‌ సిరాజ్‌ క్యాచ్‌ అందుకోవడాన్ని నేనైతే పూర్తిగా ఆస్వాదించాను’’ అని సచిన్‌ టెండుల్కర్‌ భారత ఆటగాళ్లను ప్రశంసించాడు.

కోహ్లి పోస్ట్‌ వైరల్‌
మరోవైపు.. విరాట్‌ కోహ్లి సైతం స్పందిస్తూ.. ‘‘ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియాకు గొప్ప విజయం. ఏమాత్రం బెదురులేకుండా ఆడి.. ఇంగ్లండ్‌పై ఆద్యంతం పైచేయి సాధించారు. శుబ్‌మన్‌ గిల్‌ బ్యాట్‌తోనూ.. సారథిగా తన వ్యూహాలతోనూ గొప్పగా రాణించాడు.

ప్రతి ఒక్కరు గెలుపులో తమ వంతు పాత్ర పోషించారు. ముఖ్యంగా ఇలాంటి పిచ్‌పై సిరాజ్‌, ఆకాశ్‌ బౌలింగ్‌ చేసిన తీరును కొనియాడాల్సిందే’’ అని ట్వీట్‌ చేశాడు. కాగా కోహ్లి పోస్టును ఇప్పటికే ఐదున్నర మిలియన్ల మందిక్షించారు. ఇక టెండుల్కర్‌- ఆండర్సన్‌ ట్రోఫీ ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లిన టీమిండియా.. ఐదు టెస్టుల సిరీస్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో గిల్‌ సేన ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా భారత్‌ ఐదు సెంచరీలు నమోదు చేసినా.. బౌలింగ్‌, ఫీల్డింగ్‌ వైఫల్యం కారణంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పరాజయం చవిచూసింది.

గిల్‌ సెంచరీలు.. అదరగొట్టిన ఆకాశ్‌
అయితే, ఎడ్జ్‌బాస్టన్‌లో బ్యాటర్లతో పాటు బౌలర్లూ అదరగొట్టారు. కెప్టెన్‌ గిల్‌ డబుల్‌ సెంచరీ (269), సెంచరీ (161) బాది ముందుండి నడిపించగా.. రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌ (55), రిషభ్‌ పంత్‌ (65), రవీంద్ర జడేజా (69 నాటౌట్‌) అర్ధ శతకాలతో సత్తా చాటారు. 

దీంతో భారత్‌ ఇంగ్లండ్‌కు 608 పరుగుల లక్ష్యం విధించగా.. నాలుగో రోజు ఆటలో మూడు వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టుకు వరణుడు సాయం చేసేలా కనిపించాడు.

ఆఖరిదైన ఐదో రోజు వర్షం అంతరాయం కలిగించగా.. మ్యాచ్‌ ఫలితం తేలకుండానే ముగుస్తుందేమోనన్న భయాలు నెలకొన్నాయి. అయితే, వాన తెరిపినిచ్చిన తర్వాత పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మొత్తంగా ఆకాశ్‌ దీప్‌ ఈ మ్యాచ్‌లో పది వికెట్లు పడగొట్టగా.. సిరాజ్‌ ఏడు వికెట్లతో అతడి తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.

 

చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్‌ గిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement