అద్వితీయ ప్రదర్శనకు సై! | RCB And GT Clash For IPL 2026 Final Trophy Today, Check Predicted Playing XI, Pitch Condition And Other Details Inside | Sakshi
Sakshi News home page

అద్వితీయ ప్రదర్శనకు సై!

May 31 2026 6:19 AM | Updated on May 31 2026 12:13 PM

Royal Challengers Bengaluru vs Gujarat Titans Final Match On 2026

నేడు ఐపీఎల్‌ ఫైనల్‌ 

బెంగళూరుతో గుజరాత్‌ ఢీ 

అమితోత్సాహంతో ఇరు జట్లు 

ఎవరు గెలిచినా రెండో టైటిల్‌ సొంతం 

సా.గం.7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌ స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం

తొలి ట్రోఫీ కోసం 18 సీజన్ల పాటు వేచి చూసి ఇప్పుడు అదే జోరులో ఆనందాన్ని రెట్టింపు చేసుకునేందుకు వరుసగా రెండో ట్రోఫీపై గురి పెట్టిన జట్టు ఒక వైపు... ఆడిన తొలి సీజన్‌లోనే కప్‌ను గెల్చుకోవడంతో పాటు ఐదో సీజన్‌లోనే మరో సారి విజేతగా నిలిచే లక్ష్యంతో నిలిచిన జట్టు మరో వైపు... దూకుడైన బ్యాటింగ్‌ లైనప్, పదునైన బౌలింగ్‌తో పాటు అమిత ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న టీమ్‌ సవాల్‌ విసురుతుండగా... ముగ్గురు బ్యాటర్లే దాదాపు మొత్తం బ్యాటింగ్‌ భారం మోస్తుండగా క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌తో సమరానికి మరో జట్టు రెడీ అయింది. 

వరుసగా రెండో టైటిల్‌ నెగ్గిన కెపె్టన్‌గా అరుదైన జాబితాలో చేరేందుకు ఒక సారథి ఉవి్వళ్లూరుతుండగా, తన నాయకత్వంలో మొదటి టోర్నీ గెలిపించాలని మరొకరు పట్టుదలగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌–19 తుది పోరుకు రంగం సిద్ధమైంది. నేడు జరిగే పోరులో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో గుజరాత్‌ టైటాన్స్‌ తలపడనుంది.

అహ్మదాబాద్‌: ఎన్నో అద్భుత ప్రదర్శనలు, మరెన్నో అనూహ్య ఫలితాలు, అసాధారణ బ్యాటింగ్‌ విన్యాసాలు, కొత్త రికార్డులు, సరికొత్త ఘనతలు...64 రోజులు, 73 మ్యాచ్‌లు, 2299 ఫోర్లు, 1416 సిక్సర్ల తర్వాత ఐపీఎల్‌ పోరాటం ఆఖరి ఘట్టానికి చేరింది. ఆదివారం జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ బెంగళూరు, మాజీ చాంపియన్‌ గుజరాత్‌ను ఢీకొడుతుంది. ఏ జట్టు నెగ్గినా ఇది వారి రెండో టైటిల్‌ కానుంది. పాయింట్ల పట్టికలో టాప్‌–2 స్థానాల్లో నిలిచిన జట్లే చివరి సమరానికి సమాయత్తం కావడం విశేషం. తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్‌ను చిత్తు చేసిన ఆర్‌సీబీ మానసికంగా పైచేయి సాధించగా... సొంతగడ్డపై ఫైనల్‌ ఆడనుండటం టైటాన్స్‌కు సానుకూలాంశం.  

ఆటగాళ్లంతా ఫామ్‌లో... 
డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన బెంగళూరు ఈ సారి గత ఏడాదికంటే మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చి దూసుకొచి్చంది. అన్ని అంచనాలను అందుకుంటూ జట్టు పాయింట్ల పట్టికలో టాపర్‌గా నిలిచింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో సమష్టి ప్రదర్శన టీమ్‌ను ముందంజ వేసేలా చేసింది. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ 10 మ్యాచ్‌లు గెలవగా... 8 మంది వేర్వేరు ఆటగాళ్లు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’లుగా నిలవడం జట్టు సమష్టితత్వానికి నిదర్శనం. ప్రతీ ఒక్కరు జట్టు విజయాల్లో తమ 
వంతు పాత్ర పోషించారు. విరాట్‌ కోహ్లి అద్భుత ఫామ్‌ ఓపెనింగ్‌లో జట్టు శుభారంభానికి ప్రధాన కారణం. పదేళ్ల క్రితం 2016లో ఇదే స్థాయి ఆటతో ఒంటిచేత్తో బెంగళూరును ఫైనల్‌కు చేర్చిన విరాట్‌ కోహ్లి... మరోసారి నాటి ఆటను గుర్తుకు తెచ్చాడు. 

ఇప్పుడు అదే ఉత్సాహంతో జట్టుకు రెండో టైటిల్‌ అందించాలని అతను పట్టుదలగా ఉన్నాడు. కోహ్లి 600 పరుగులు చేయగా, కెపె్టన్‌ రజత్‌ పాటీదార్‌ (486) ఏకంగా 196.76 స్ట్రైక్‌రేట్‌తో 5 అర్ధ సెంచరీలతో తన స్థాయిని ప్రదర్శించాడు. పడిక్కల్‌ (463) కూడా చెలరేగగా... కృనాల్‌ పాండ్యా ఆల్‌రౌండర్‌ ప్రదర్శన (225 పరుగులు, 13 వికెట్లు) జట్టును నడిపించాయి. 2011 నుంచి ఐపీఎల్‌ ఆడుతున్న భువనేశ్వర్‌ కుమార్‌ అనుభవం జట్టుకు ఎంతో పనికొచి్చంది. భువీ ఇప్పటికే 26 వికెట్లు తీయగా...హాజల్‌వుడ్‌ (13) అండగా నిలిచాడు. వీరికి తోడు యువ బౌలర్‌ రసిఖ్‌ సలామ్‌ (16) సత్తా చాటడం బౌలింగ్‌ బలాన్ని పెంచింది. ఫిట్‌గా ఉంటే ఫిల్‌ సాల్ట్‌ ఓపెనింగ్‌ చేస్తాడు. లేదంటే వెంకటేశ్‌ అయ్యర్‌ కొనసాగుతాడు. బౌలింగ్‌లో పరిస్థితిని బట్టి సుయాశ్, డఫీలలో ఒకరికి ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’గా అవకాశం దక్కుతుంది.  

టాప్‌–3 దూకుడు... 
టోర్నీ ఆరంభంనుంచి గుజరాత్‌ ఒకే విమర్శను మళ్లీ మళ్లీ ఎదుర్కొంది. టాప్‌–3 బ్యాటర్లు మినహా జట్టులో ఏమి లేదని, వీరిని అవుట్‌ చేస్తే కుప్పకూలడం ఖాయమని విమర్శలు వచ్చాయి. అయితే చివరిసారి ఈ విమర్శకు గుజరాత్‌ సిద్ధమైంది. మ్యాచ్‌ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా టాప్‌–3 బ్యాటింగ్‌పైనే ఆధారపడుతోంది. శుబ్‌మన్‌ గిల్‌ (722 పరుగులు), సాయి సుదర్శన్‌ (710), జోస్‌ బట్లర్‌ (507) తమ పాత్రకు పూర్తి న్యాయం చేశారు కాబట్టి ఈ విషయంలో మేనేజ్‌మెంట్‌కు ఆందోళన లేదు. 

వీరు చెలరేగితే మిడిలార్డర్‌ అవసరం ఉండదనే భావన రాజస్తాన్‌తో జరిగిన రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో కూడా రుజువైంది. సుందర్‌ (327) కూడా జట్టు విజయాల్లో కొంత పాత్ర పోషించాడు. అయితే పదునైన బౌలింగ్‌ దళం సహకారంతో గుజరాత్‌ ముందంజ వేయగలిగింది. కొత్త బంతితో రబాడ (28 వికెట్లు), సిరాజ్‌ (18) ప్రత్యర్థులను పూర్తిగా కట్టపడేస్తున్నారు. హోల్డర్‌ (17) కూడా కేవలం 7.54 ఎకానమీతో బౌలింగ్‌ చేయడం టైటాన్స్‌కు అదనపు బలంగా మారింది. గత పోరులో రషీద్‌ లైన్‌ తప్పినా... అతనిలాంటి స్టార్‌ బౌలర్‌ ఏ సమయంలోనైనా చెలరేగిపోగలడు. ఇక్కడి పిచ్‌ను బట్టి చూస్తే స్పిన్నర్‌ సాయికిషోర్‌కు ఈ సారి బౌలింగ్‌ అవకాశం లభించవచ్చు.  

తుది జట్లు (అంచనా) 
బెంగళూరు: పాటీదార్‌ (కెపె్టన్‌), కోహ్లి, సాల్ట్‌/ వెంకటేశ్, పడిక్కల్, కృనాల్, డేవిడ్, జితేశ్, షెఫర్డ్, భువనేశ్వర్, హాజల్‌వుడ్, సలామ్, డఫీ/ సుయాశ్‌ 
గుజరాత్‌:  గిల్‌ (కెపె్టన్‌), సుదర్శన్, బట్లర్, సుందర్, నిశాంత్, హోల్డర్, తెవాటియా, రషీద్, రబాడ, సిరాజ్, ప్రసిధ్, సాయికిషోర్‌.  

పిచ్, వాతావరణం 
బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌. భారీ స్కోరుకు అవకాశం ఉన్నా...బౌలర్లూ ప్రభావం చూపగలరు. లీగ్‌ దశలో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ జరిగిన పిచ్‌పైనే ఫైనల్‌ నిర్వహిస్తున్నారు. ఆ పోరులో గుజరాత్‌ గెలిచింది. అన్నింటికి మించి ఈ స్టేడియంలో రెండో సారి బ్యాటింగ్‌ సులువుగా మారుతుంది. కాబట్టి టాస్‌ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపవచ్చు. మ్యాచ్‌ రోజు వర్షసూచన లేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement