మళ్లీ వేటాడేసింది... | Royal Challengers Bengaluru clinched the IPL 2026 title | Sakshi
Sakshi News home page

మళ్లీ వేటాడేసింది...

Jun 1 2026 4:07 AM | Updated on Jun 1 2026 6:32 AM

Royal Challengers Bengaluru clinched the IPL 2026 title

వరుసగా రెండో ఏడాది విజేతగా నిలిచిన పాటీదార్‌ బృందం 

ఫైనల్లో 5 వికెట్లతో గుజరాత్‌పై ఘనవిజయం 

రాణించిన ఆర్‌సీబీ బౌలర్లు 

విరాట్‌ కోహ్లి 75 నాటౌట్‌   

‘సుదీర్ఘ కాలం మనం వేటాడబడ్డాం... ఇకపై వేటగాళ్లలా మారిపోవాలి. ఇది ఆరంభం మాత్రమే. విజయాన్ని వ్యసనంగా మార్చుకోవాలి. వరుసగా రెండుసార్లు టైటిల్‌ సాధించిన జట్టుగా మనం కూడా నిలవగలం’... గత ఏడాది ట్రోఫీని గెలుచుకున్న తర్వాత ఆర్‌సీబీ డైరెక్టర్‌ బొబాట్‌ డ్రెస్సింగ్‌రూమ్‌లో చేసిన వ్యాఖ్య ఇది. ఆ సమయంలో విజయోత్సాహంతో చెప్పిన మాటలుగానే ఇవి మిగిలిపోలేదు. నాడు జట్టులో కనిపించిన ఆత్మవిశ్వాసం, అద్భుత ప్రదర్శన స్ఫూర్తిగా ఈసారి కూడా బెంగళూరు దూసుకుపోయింది. దాదాపు అదే తరహా ప్రణాళికతో సరిగ్గా సంవత్సరం తర్వాత టీమ్‌ మళ్లీ చాంపియన్‌గా నిలిచి సత్తా చాటింది. ఒక్క టైటిల్‌తో ఆగిపోకుండా తమ ఆకలిని తీర్చుకుంటూ వరుసగా రెండో ట్రోఫీని గెలుచుకొని సగర్వంగా నిలిచింది.

తేదీలు మారడం మినహా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ప్రస్థానం సరిగ్గా 2025 తరహాలోనే సాగి టైటిల్‌ వరకు చేరింది. లీగ్‌ దశలో 9 విజయాలతో అగ్రస్థానం, తొలి క్వాలిఫయర్‌లో ఏకపక్ష గెలుపుతో ఫైనల్‌కు... తుది పోరులో కూడా సంపూర్ణ ఆధిపత్యం... డిఫెండింగ్‌ చాంపియన్‌గా సొంతగడ్డ బెంగళూరులో మళ్లీ ట్రోఫీనిముద్దాడతామని గత ఏడాది గర్వంగా చెప్పినా... వేర్వేరు కారణాలతో అది జరగలేదు. కానీ మళ్లీ అదే అహ్మదాబాద్‌ వేదికపై విజయానందాన్ని సొంతం చేసుకుంది. 18వ సీజన్‌లో తొలిసారి ‘ఈ సాలా కప్‌ నమ్‌దు’ అంటూ గర్జించిన జట్టు మరోసారి అదే ధ్వనిని బిగ్గరగా వినిపించింది. నాడు విజేతగా నిలిచిన జట్టులోని 13 మంది ఈసారి కూడా గెలుపులో భాగమై తమ ఆనందాన్ని రెట్టింపు చేసుకున్నారు. 

ఇరు జట్ల మధ్య తొలి క్వాలిఫయర్‌ పూర్తి ఏకపక్షంగా సాగగా... ఈసారి గుజరాత్‌ టైటాన్స్‌ కాస్త మెరుగ్గా ఆడింది. అయితే భయపడినట్లే గిల్, సుదర్శన్, బట్లర్‌ వైఫల్యం తర్వాత జట్టు కోలుకోలేకపోయింది. ఆర్‌సీబీ బౌలర్లు పదునైన బంతులతో ప్రత్యర్థిని కట్టి పడేశారు. సరిగ్గా నెలరోజుల క్రితం ఇదే మైదానంలో టైటాన్స్‌తో పోరులో సరిగ్గా 155 పరుగులే చేసి ఆర్‌సీబీ ఓడగా... ఇప్పుడు అసలు పోరులో సీన్‌ రివర్స్‌ అయింది. ఛేదనలో కోహ్లి, వెంకటేశ్‌ అయ్యర్‌ మెరుపు ఆరంభంతో ఆర్‌సీబీ విజయానికి బాట పడింది. ఆ తర్వాత కాస్త తడబాటు ఎదురైనా... దిగ్గజ ఆటగాడిగా ఛేదనలో తన స్థాయిని చూపిస్తూ దూసుకుపోయిన కోహ్లి భారీ సిక్స్‌తో విన్నింగ్‌ షాట్‌ కొట్టడంతో ఆర్‌సీబీ బృందంలో సంబరాలు షురూ అయ్యాయి. 

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌లో వరుసగా రెండుసార్లు విజేతగా నిలిచిన మూడో జట్టుగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన ఆర్‌సీబీ ఐపీఎల్‌–2026 టైటిల్‌ను గెలుచుకుంది. నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఆర్‌సీబీ 5 వికెట్ల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.

 వాషింగ్టన్‌ సుందర్‌ (37 బంతుల్లో 50 నాటౌట్‌; 5 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఆర్‌సీబీ బౌలర్లలో రసిఖ్‌ సలామ్‌ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బెంగళూరు 18 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు చేసి గెలిచింది. విరాట్‌ కోహ్లి (42 బంతుల్లో 75 నాటౌట్‌; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగిపోగా, వెంకటేశ్‌ అయ్యర్‌ (16 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు.  

టపటపా... 
ప్రతీ సీజన్‌లో జట్టు బ్యాటింగ్‌ భారం మోస్తున్న ముగ్గురు ప్రధాన బ్యాటర్లు తొందరగా వెనుదిరగడంతోనే గుజరాత్‌ భారీ స్కోరు ఆశలు కోల్పోయింది. శుబ్‌మన్‌ గిల్‌ (8 బంతుల్లో 10; 2 ఫోర్లు), సాయి సుదర్శన్‌ (12 బంతుల్లో 12; 2 ఫోర్లు) నాలుగు పరుగుల వ్యవధిలో అవుట్‌ కాగా, నిశాంత్‌ సింధు (18 బంతుల్లో 20; 3 ఫోర్లు) ప్రభావం చూపలేదు. పవర్‌ప్లేలో జట్టు 45 పరుగులే చేసింది. క్రీజ్‌లో ఉన్నంత సేపు తడబడిన జోస్‌ బట్లర్‌ (23 బంతుల్లో 19; 1 ఫోర్‌) సహనం కోల్పోయి వికెట్‌ సమర్పించుకున్నాడు. 

ఈ దశలో సుందర్‌ కొంత పట్టుదలగా నిలబడినా... అతనూ పెద్ద షాట్లు కొట్టలేకపోయాడు. 4 పరుగుల వద్ద కాక్స్‌ క్యాచ్‌ అందుకున్నా... రీప్లేలో బంతి గ్రౌండ్‌కు తాకిందని తేలడంతో అతను బతికిపోయాడు. మరోవైపు అర్షద్‌ ఖాన్‌ (6 బంతుల్లో 15; 2 సిక్స్‌లు) కొన్ని పరుగులు జోడించగా, తర్వాతి బ్యాటర్లంతా పూర్తిగా చేతులెత్తేశారు. ఒక దశలో వరుసగా 40 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయిన గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో 13వ ఓవర్‌ నాలుగో బంతికి గానీ తొలి సిక్స్‌ రాలేదు!  తొలి 10 ఓవర్లలో 62 పరుగులు చేసిన జట్టు తర్వాతి 10 ఓవర్లలో 92 పరుగులు రాబట్టింది.  

శుభారంభం... 
ఛేదనలో వెంకటేశ్, కోహ్లి జట్టుకు మెరుపు ఆరంభాన్ని అందించారు. తొలి ఓవర్లో సిరాజ్‌ 5 పరుగులే ఇచ్చినా... రబాడ వేసిన తర్వాత ఓవర్లో వెంకటేశ్‌ 3 ఫోర్లు, సిక్స్‌ బాదాడు. సిరాజ్‌ రెండో ఓవర్లోనూ 3 బౌండరీలు రాగా... రబాడ తర్వాతి ఓవర్లో కోహ్లి వరుసగా 4, 4, 6, 4తో చెలరేగిపోయాడు. వెంకటేశ్, పడిక్కల్‌ (1) పరుగు తేడాతో వెనుదిరగ్గా... పవర్‌ప్లేలో జట్టులో 70 పరుగులు చేసింది. ఆ తర్వాత కెపె్టన్‌ రజత్‌ పాటీదార్‌ (13 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్‌), కృనాల్‌ పాండ్యా (1)లను రషీద్‌ ఒకే ఓవర్లో అవుట్‌ చేసి కొంత ఒత్తిడి పెంచాడు. అయితే కోహ్లి మాత్రం తగ్గకుండా దూసుకుపోయాడు. 25 బంతుల్లో అతని అర్ధసెంచరీ పూర్తయింది. టిమ్‌ డేవిడ్‌ (17 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక పరుగులు జోడించగా... విరాట్‌ చివరి వరకు నిలిచి జట్టును విజయతీరం చేర్చాడు.

స్కోరు వివరాలు  
గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాయి సుదర్శన్‌ (సి) జితేశ్‌ (బి) భువనేశ్వర్‌ 12; గిల్‌ (సి) పాటీదార్‌ (బి) హాజల్‌వుడ్‌ 10; నిశాంత్‌ (సి) పడిక్కల్‌ (బి) సలామ్‌ 20; బట్లర్‌ (స్టంప్డ్‌) జితేశ్‌ (బి) కృనాల్‌ 19; సుందర్‌ (నాటౌట్‌) 50; అర్షద్‌ (సి) సలామ్‌ (బి) హాజల్‌వుడ్‌ 15; తెవాటియా (సి) పాటీదార్‌ (బి) సలామ్‌ 7; హోల్డర్‌ (సి) హాజల్‌వుడ్‌ (బి) భువనేశ్వర్‌ 7; రషీద్‌ (సి) షెఫర్డ్‌ (బి) సలామ్‌ 7; రబాడ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–22, 2–26, 3–55, 4–73, 5–99, 6–115, 7–142, 8–151. బౌలింగ్‌: డఫీ 4–0–38–0, భువనేశ్వర్‌ 4–0–29–2, హాజల్‌వుడ్‌ 4–0–37–2, సలామ్‌ 4–0–27–3, కృనాల్‌ 4–0–23–1. 

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: వెంకటేశ్‌ (సి) రబాడ (బి) సిరాజ్‌ 32; కోహ్లి (నాటౌట్‌) 75; పడిక్కల్‌ (సి) అర్షద్‌ (బి) రబాడ 1; పాటీదార్‌ (సి) రబాడ (బి) రషీద్‌ 15; కృనాల్‌ (ఎల్బీ) (బి) రషీద్‌ 1; డేవిడ్‌ (సి) బట్లర్‌ (బి) అర్షద్‌ 24; జితేశ్‌ (నాటౌట్‌) 11; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (18 ఓవర్లలో 5 వికెట్లకు) 161. వికెట్ల
పతనం: 1–62, 2–63, 3–89, 4–91, 5–132. బౌలింగ్‌: సిరాజ్‌ 4–0–36–1, రబాడ 3–0–44–1, హోల్డర్‌ 2–0–16–0, రషీద్‌ 4–0–25–2, అర్షద్‌ 4–0–32–1, ప్రసిధ్‌ 1–0–7–0.  

 

Advertisement
 
Advertisement
Advertisement