విరాట్‌ వీరబాదుడు

Royal Challengers Bangalore beat Chennai Super Kings by 37 Runs - Sakshi

బౌలింగ్‌ పిచ్‌పై విరాట్‌ గర్జన

చేతులెత్తేసిన చెన్నై

37 పరుగులతో బెంగళూరు జయభేరి   

పరుగు పెట్టని స్కోరు బోర్డుకు కోహ్లి మెరుగులు దిద్దాడు. బౌలర్ల అడ్డగా మారిన పిచ్‌పై తన బ్యాటింగ్‌ తడఖా చూపించాడు. బెంగళూరు ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఆఖర్లో మెరిపించాడు. తర్వాత పని తమ బౌలర్లకు అప్పగించాడు. జట్టును గెలిపించాడు.  

దుబాయ్‌: బంతులు నిప్పులు చెరిగేచోట కోహ్లి బ్యాట్‌ గర్జించింది. ఇరు జట్లలో ఏ బ్యాట్స్‌మెన్‌కు సాధ్యం కానీ ఇన్నింగ్స్‌తో అతను బెంగళూరును గెలిపించాడు. శనివారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో  రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 37 పరుగులతో చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఓడించింది. మొదట బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 169 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కోహ్లి (52 బంతుల్లో 90 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆఖర్లో చెలరేగాడు. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (34 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. తర్వాత చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులే చేయగల్గింది. రాయుడు (40 బంతుల్లో 42; 4 ఫోర్లు), ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన జగదీశన్‌ (28 బంతుల్లో 33; 4 ఫోర్లు) రాణించారు. మోరిస్‌ 3, వాషింగ్టన్‌ సుందర్‌ 2 వికెట్లు తీశారు.  

ఫించ్‌ 2, ఏబీ 0
పిచ్‌ బౌలింగ్‌కు సహకరించడంతో బెంగళూరు పరుగు పరుగుకు చాలానే కష్టపడింది. పవర్‌ ప్లే (6 ఓవర్లు)లో కేవలం 36 పరుగులే చేసిన ఆర్‌సీబీ జట్టు ఎంతో ఆలస్యంగా... 8వ ఓవర్లో 50 పరుగులు చేసింది. అలాగని వికెట్లను టపాటపా కోల్పోలేదు. ఓపెనర్‌ ఫించ్‌ (2) ఒక్కడే ఔటయినప్పటికీ తొలి సిక్స్‌ పదో ఓవర్లో వచ్చింది. ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ ఆ సిక్సర్‌ కొట్టాడు. అలాగని ఫోర్లు బాదారనుకుంటే పొరపాటు. పడిక్కల్, కోహ్లి కలిసి ఈ 10 ఓవర్లలో కొట్టిన బౌండరీలు కూడా నాలుగే! మరుసటి ఓవర్లో దేవ్‌దత్‌తోపాటు డివిలియర్స్‌ (0)కూడా ఔటయ్యాడు. వీళ్లిద్దరిని శార్దుల్‌ పెవిలియన్‌ చేర్చాడు. క్రీజులో కోహ్లి ఉన్నా...ఆ తర్వాత కూడా పరిస్థితి మారకపోవడంతో ఆర్‌సీబీ స్కోరు 100 చేరేందుకు మరో 8 (16వ)ఓవర్లు అవసరమయ్యాయి.  

కోహ్లి బాదితే...
కోహ్లి ఆడితే... 30 బంతుల్లో 34 (2 ఫోర్లు)! అదే కోహ్లి బాదితే...  52 బంతుల్లో 90 నాటౌట్‌ (4 ఫోర్లు, 4 సిక్స్‌లు). చూశారా ఎంత తేడా ఉందో! కోహ్లినా మజాకా! మూడో ఓవర్లో క్రీజులోకి వచ్చాడు. 14 ఓవర్ల పాటు కోహ్లి ఆడాడు. 15వ ఓవర్‌ నుంచి బాదేశాడు. ఫోర్లు, సిక్సర్లు తక్కువే అయినా... అతని ఫిట్‌నెస్‌ అసాధారణం కావడంతో సింగిల్స్‌ డబుల్స్‌తోనే అన్ని పరుగులు చేశాడు. అప్పటిదాకా  వన్డేలా కనబడిన మ్యాచ్‌ 15వ ఓవర్‌ నుంచే టి20గా మారిపోయింది. అదే ఓవర్లో సుందర్‌ (10) అవుటైతే శివమ్‌ దూబే (22 నాటౌట్‌) జతయ్యాడు. 17వ ఓవర్లో దూబే, కోహ్లి చెరో ఫోర్‌ కొట్టారు.ఆ ఫోర్‌తో కోహ్లి 39 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తయ్యింది. శార్దుల్‌ వేసిన ఆ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. 18వ ఓవర్‌ చుక్కలు చూపించింది. సామ్‌ కరన్‌ బౌలింగ్‌లో దూబే మొదట సిక్స్‌ బాదాడు. తర్వాత కోహ్లి లాంగాన్, స్క్వేర్‌ లెగ్‌ల మీదుగా రెండు సిక్సర్లు బాదడంతో 24 పరుగులు వచ్చాయి. 19వ ఓవర్లో మరో సిక్స్‌ లాంగాన్‌లో పడింది. 20వ ఓవర్లో బౌండరీ ఒక్కటే కొట్టినా చకచకా బంతికి రెండేసి పరుగులు తీశాడు. ఈ 2 ఓవర్లలో 14 చొప్పున పరుగులు రావడంతో బెంగళూరు పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. చివరి 6 ఓవర్లలో బెంగళూరు 83 పరుగులు సాధించింది. ఇందులో 56 పరుగులు కోహ్లివే.
చతికిలపడిన చెన్నై...
పిచ్‌ పరిస్థితులను గుర్తెరిగిన బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. దీంతో చెన్నై పరుగులు చేయడంలో బెంగళూరు కంటే వెనుకబడిపోయింది. తొలి 5 ఓవర్లలో వరుసగా 4, 2, 7, 6, 2 పరుగులతో 21 స్కోరే చేసింది. ఓపెనర్‌ డుప్లెసిస్‌ (8) వికెట్‌నూ కోల్పోయింది. తర్వాత వాట్సన్‌ (14) కూడా చేతులెత్తేశాడు. 10 ఓవర్లు ముగిసే చెన్నై స్కోరు 47/2. ఇందులో ఏ ఒక్క ఓవర్లోనూ పట్టుమని 10 పరుగులైనా చేయలేకపోయింది. నానాకష్టాలు పడిన చెన్నై... 11వ ఓవర్లో జట్టు స్కోరు 50 పరుగులకు చేరుకుంది. జగదీశన్, రాయుడు క్రీజులో పాతుకుపోయినా... పరుగులు, మెరుపులు కష్టతరం కావడంతో చేయాల్సిన లక్ష్యం కాస్తా కొండంత అయ్యింది. మూడో వికెట్‌కు ఎంతో కష్టపడుతూ 64 పరుగులు జోడించాక జగదీశన్‌ రనౌటయ్యాడు. తర్వాత ధోని (10) వచ్చాడు. చెన్నై ఇన్నింగ్స్‌లో ఏకైక సిక్సర్‌ కొట్టాడు. ఆ వెంటనే అతనూ పెవిలియన్‌ చేరాడు. కుదురుగా ఆడిన రాయుడు క్లీన్‌బౌల్డయ్యాక ఇంకెవరూ కనీసం 8 పరుగులైనా చేయలేకపోయారు. సామ్‌ కరన్‌ (0), జడేజా (7), బ్రేవో (7) తేలిగ్గానే అవుటయ్యారు.   

స్కోరు వివరాలు
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: పడిక్కల్‌ (సి) డుప్లెసిస్‌ (బి) శార్దుల్‌ 33; ఫించ్‌ (బి) చహర్‌ 2; కోహ్లి (నాటౌట్‌) 90; డివిలియర్స్‌ (సి) ధోని (బి) శార్దుల్‌ 0; సుందర్‌ (సి) ధోని (బి) స్యామ్‌ కరన్‌ 10; దూబే (నాటౌట్‌) 22; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 169.  
వికెట్ల పతనం: 1–13, 2–66, 3–67, 4–93. 
బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 3–0–10–1, స్యామ్‌ కరన్‌ 4–0–48–1, శార్దుల్‌ ఠాకూర్‌ 4–0–40–2, బ్రేవో 3–0–29–0, కరణ్‌ శర్మ 4–0–34–0, జడేజా 2–0–7–0.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: వాట్సన్‌ (బి) సుందర్‌ 14; డుప్లెసిస్‌ (సి) మోరిస్‌ (బి) సుందర్‌ 8; రాయుడు (బి) ఉదాన 42; జగదీశన్‌ (రనౌట్‌) 33; ధోని (సి) గురుకీరత్‌ (బి) చహల్‌ 10; స్యామ్‌ కరన్‌ (సి) డివిలియర్స్‌ (బి) మోరిస్‌ 0; జడేజా (సి) గురుకీరత్‌ (బి) మోరిస్‌ 7; బ్రేవో (సి) పడిక్కల్‌ (బి) మోరిస్‌ 7; దీపక్‌ చహర్‌ (నాటౌట్‌) 5; శార్దుల్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 132.
వికెట్ల పతనం: 1–19, 2–25, 3–89, 4–106, 5–107, 6–113, 7–122, 8–126.
బౌలింగ్‌: మోరిస్‌ 4–0–19–3, సైనీ 4–0–18–0, ఉదాన 4–0–30–1, సుందర్‌ 3–0–16–2, చహల్‌ 4–0–35–1, దూబే 1–0–14–0.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top